బీఆరెస్ అహంభావానికి ఓటమి ఖాయం: సీపీఐ నారాయణ

- తెలంగాణలో కాంగ్రెస్ అనుకూల పవనలు
- ఒక దెబ్బకు మూడు పార్టీలు కూలుతాయి
విధాత : తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాలనలో అధికార దుర్వినియోగం, అవినీతి సొమ్ముతో సీఎం కేసీఆర్ కుటుంబంలో అహంకారం పెరిగిపోయిందని, ఈ ఎన్నికల్లో వారి అహంతోనే బీఆరెస్ ఓటమి పాలవుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆరెస్‌కు ఓటు వేస్తే అది బీజేపీకి వేసినట్లేనన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. ప్రజల్లో మార్పు కనిపిస్తుందని, ఒక్క ఓటు దెబ్బతో ఈ ఎన్నికల్లో బీజేపీ, బీఆరెస్, మోసపూరిత ఎంఐఎం పార్టీలను మూడింటిని దెబ్బకొట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అహంభావ పునాదులు ఢిల్లీలో ఉన్నాయన్నారు. బీజేపీ, బీఆరెస్‌లు రెండు ఒక్కటేనన్నారు.
తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ మంత్రి ఎర్రబెల్లి వంటి తెలంగాణ ద్రోహులను పక్కన పెట్టుకున్నారని, కేసీఆర్ కేబినెట్ అంతా తెలంగాణ ద్రోహలతో నిండిపోయిందన్నారు. ఇన్నాళ్లు ఏదైనా ప్రాజెక్టు గేట్లు ఊడిపోవడం కొట్టుకపోవడమో విన్నామని, కాని నిర్మాణం చేపట్టిన తక్కువ సమయంలో పునాదులతో సహా కదిలిపోయిన ప్రాజెక్టు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పునాదులు కదిలిపోతుంటే బీఆరెస్ నేతల ఫామ్ హౌజ్‌లు కమిషన్లతో దోచుకున్న డబ్బులతో నిండిపోతున్నాయని ఆరోపించారు. కొండ పోచమ్మ ప్రాజెక్టు నుంచి నేరుగా సీఎం ఫౌమ్ హౌజ్‌కు నాళ్లు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. కల్వకుంట్ల కుటుంబానికి షేర్ లేకుండా రాష్ట్రంలో ఏ కొత్త ప్రాజెక్టు, మెడికల్ కాలేజీ, రియల్ ఎస్టేట్ వెంచర్, షాపింగ్ మాల్ కూడా అనుమతి రావడం లేదన్నారు. బీఆరెస్ పార్టీ నిరుద్యోగులను, గిరిజన, దళిత, మైనార్టీల వర్గాలను, రైతులను మోసం చేసిందన్నారు.
దళిత బంధు, రైతురుణమాఫీ పేరుతో అనేక ఇబ్బందులు పెట్టారన్నారు. మాకు పొత్తులో భాగంగా కాంగ్రెస్ సీపీఎం, టీజేఎస్, వైఎస్సార్టీపీ మద్దతు ప్రకటించాయన్నారు. బీజేపీ పాలనలో జైల్లో ఉండాల్సిన వారు బయట, బయట ఉండాల్సిన వారు జైల్లో ఉంటున్నారన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ రోజు రాష్ట్ర, కేంద్ర సంస్థలు దాడి చేయడం కేంద్ర ప్రభుత్వ రాజకీయ దాడులకు నిదర్శనమన్నారు. సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లపై చేసేది నిజమైన ఐటీ దాడులు కావన్నారు. ఇక ప్రధాని బీసీ సీఎం, ఎస్సీ వర్గీకరణ అంటున్నారని, గతంలో చాలాసార్లు మందకృష్ణ ప్రధానిని కలిసేందుకు ప్రయత్నించారని, అప్పుడేందుకు స్పందించలేదన్నారు. తెలంగాణ ఎన్నికల వేళ వర్గీకరణ పేరుతో ఈ డ్రామాలు ఎందుకని నారాయణ నిలదీశారు. విశ్వరూప సభ వేదికపై మోడీ, మంద కృష్ణలు బాగా నటించారని, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణలో సీట్లు పెరుగవన్నారు.
బీజేపీ కంటే నోటాకే ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. బీఏపీ బీసీలకు, సామాన్యులకు, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వ్యతిరేక పార్టీ అన్నారు. కేంద్రంలో కూడా ఈ దఫా బీజేపీ పడిపోతుందని వారికి అర్థమైంది అన్నారు. నిజంగా ఆ వర్గాల పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే జన గణన, కుల గణన ఎందుకు చేయడం లేదని, మహిళా బిల్లు ఎందుకు అమలు నోచుకోవడం లేదన్నారు. సరిగ్గా ఎన్నికల సమయం రాగానే బీజేపీకి రాముడు, దేవాలయాలు గుర్తుకు వస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అభివృద్ధికి కీలకమైన ఎల్‌కే అద్వానినే మోడీ తొక్కేశారని, పార్టీ లోపల బయట అన్నింట అణచివేతకు తెగపడుతున్నారన్నారు. అన్ని సంస్థల్లో ప్రజాస్వామ్యం లేకుండా బీజేపీ చేస్తుందన్నారు. అనంతరం నాంపల్లి అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని నారాయణ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు 50 లక్షల ఇవ్వాలని, కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.