తూర్పు బీఆర్ఎస్‌లో ‘అసమ్మతి’ తెగులు

ఎన్నికల వేళ వరంగల్ తూర్పు గులాబీలను అసమ్మతి తెగులు పట్టిపీడిస్తోంది

తూర్పు బీఆర్ఎస్‌లో ‘అసమ్మతి’ తెగులు
  • సొంత పార్టీ నాయకులపై నిఘా
  • వెంటట ఉండేవారిపై అపనమ్మకం
  • ఇతర సెగ్మెంట్లకు వెళ్ళిన ముఖ్యనాయకులు
  • అసంతృప్తిలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు
  • కాంగ్రెస్ లో చేరిన కొందరు నాయకులు
  • గులాబీ అసంతృప్తులకు విపక్షాల గాలం


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల వేళ వరంగల్ తూర్పు గులాబీలను అసమ్మతి తెగులు పట్టిపీడిస్తోంది. నిన్నటి వరకు గుంభనంగా ఉన్న తూర్పు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఎప్పుడు పార్టిని వీడుతారో? అనే పరిస్థితి నెలకొంది. పార్టీలో ఇప్పటికే తీవ్ర అసమ్మతి నెలకొనగా, తాజాగా పార్టీలో ఉన్న వారిపై ఎమ్మెల్యే, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్ధి నన్నపునేని నరేందర్ అపనమ్మకాన్ని ప్రదర్శించడంతో వెంటతిరుగుతున్నవారు కూడా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రోజు నరెందర్ వెంట ఉండే నాయకులే ఆయన పరోక్షంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నిత్యం తన వెంట ఉన్నప్పటికీ అనుమానిస్తున్నారనే విమర్శలున్నాయి.


కాగా.. తమ పార్టీకి చెందిన వారి పైన్నే తన అనుచరులతో నిఘా కొనసాగిస్తున్నారనే సమాచరంతో నమ్మకంగా పనిచేయకుండా తప్పదన్నట్లు వ్యవహరిస్తున్న తీరు పుట్టిముంచే అవకాశాలున్నాయని చెబుతున్నారు. తూర్పు నియోజకవర్గంలోని గులాబీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గంలోని ప్రధాన నేతలు నరెందర్ తో పెట్టుకోలేక ఇతర సెగ్మెంట్లకు వెళ్ళిపోయారని చెబుతున్నారు. కొందరు విపక్ష పార్టీలో చేరగా మరికొంత మంది పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు నిత్యం ప్రచారం సాగుతోంది. ఎప్పుడు ఎవరు బీఆర్ ఎస్ నుంచి జారిపోతారో అర్ధం కావడంలేదంటున్నారు.


కోటరీ కనుసన్నల్లో ఎమ్మెల్యే అభ్యర్థి


కొంతమంది తనకనుకూలమైన వ్యక్తుల కోటరితో వరంగల్ తూర్పులో పార్టీ కొనసాగుతోందంటున్నారు. పార్టీలో తొలి నుంచి ఉన్న వారికి, ఉద్యమంలో పాల్గొన్నవారికి కనీస గుర్తింపులేదని వాపోతున్నారు. తన అడుగులకుమడుగులొత్తేవారికి తప్ప ఇతరులను పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. ఎన్నికలకు ముందే ఎమ్మెల్యేపై పార్టీ అధిష్టానానికి పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. సర్వేల్లో కూడా కొంత వ్యతిరేకత వ్యక్తమైందనే చర్చసాగింది. ఒక దశలో టికెట్ వస్తుందో రాదో అనే చర్చసాగిన నేపథ్యంలో సిటింగులకే టిక్కెట్లివ్వడంతో కలిసొచ్చినట్లు చెబుతున్నారు.


ఈ నేపథ్యంలో నరేందర్ కు టికెట్ దక్కినప్పటికీ అసంతృప్తులను, అసమ్మతివాదులను, పార్టీలో సీనియర్లు, ఉద్యమకారులను కలుపుకొని పోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఏకపక్ష విధానాలతో వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. పైగా సొంత పార్టీకి చెందిన నాయకులను బెదిరించడం, వారిపై మరి కొందరితో నిఘా కొనసాగించడంతో, అక్రమ కేసుల్లో ఇరికించి పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు అసమ్మతి కార్పొరేటర్లు బాహాటంగానే చెబుతున్నారు.


అసమ్మతి కార్పొరేటర్ల రహస్య మంతనాలు


ఎమ్మెల్యే నరేందర్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు కొద్ది రోజుల క్రితం రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశానికి పలువురు కార్పొరేటర్లతో పాటు సీనియర్ నాయకులు వచ్చారు. నరేందర్ అభ్యర్ధిత్వాన్ని మార్చాలని అధిష్టానానికి ఫిర్యాదుచేయాలని పట్టించుకోకుంటే ఎవరి నిర్ణయం వారు తీసుకుందాని తీర్మానించుకున్నారు. ఈ సమాచారం తెలిసిన ఎమ్మెల్యే డిప్యూటి మేయర్ షమీమ్ రిజ్వానా, ఆమె భర్త మసూద్ తో పాటు అసమ్మతి కార్పొరేటర్లను బుజ్జగించి వారికి కొంత మొత్తం ముట్టజెప్పినట్లు విస్తృత ప్రచారం సాగింది. ఇందులో కొందరు సంతృప్తి చెందకుండా పార్టీని వీడి టీపీసీసీచీఫ్ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.


బీఆర్ఎస్ నాయకుడు నవీన్ రాజు, కార్పొరేటర్ గుండేటి నరేందర్, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ, నాయకులు జనార్ధన్, తత్తరి లక్షన్, గోరంటల రాజు, తోట మాధవ్, సతీష్ తదితరులు పార్టీని వీడారు. డిప్యూటి మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ ను కెటిఆర్ వద్దకు తీసుకపోయి బుజ్జగించారు. దీంతో తాత్కాలికంగా పార్టీ మార్పు నిలిచిపోయినట్లు చెబుతున్నారు. కార్పొరేటర్లలో మరికొంత మంది ఇతర పార్టీ నాయకులతో ఇప్పటికీ చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. మాజీ మేయర్ గుండా ప్రకాశరావు సైతం పార్టీని వీడుటున్నట్లు సమాచారం.


సెగ్మెంట్ వీడిన ముఖ్యనాయకులు


వరంగల్ తూర్పు రాజకీయాల్లో నరేందర్ కంటే సీనియర్ నాయకులుగా ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణితో పాటు కార్పొరేషన్ చైర్మన్ లుగా ఉన్న మెట్టు శ్రీనివాస్ లు నరేందర్ తో పొసగక తూర్పును వీడి ఇతర సెగ్మెంట్లలో పార్టీ గెలుపునకు వెళ్ళారు. నియోజకవర్గంలో ఉండి ఇబ్బందులు పడే కంటె అంటీముట్టనట్లు ఉండడం క్షేమమనే తీరుతో ఉన్నారు. మరో నాయకుడు రాజనాల శ్రీహరి నరేందర్ పై తీవ్ర విమర్శలు చేశారు.


కబ్జాకోరుకు టికెట్ ఇచ్చారని విమర్శించారు. నామినేషన్ కూడా వేశారు. సారయ్య భూపాలపల్లికి, మెట్టు ములుగు వెళ్ళగా, సుధారాణి వరంగల్ పశ్చిమకు పరిమితమయ్యారు. ఇంచార్జ్ బండా ప్రకాష్ కొంత శ్రద్ధ వహిస్తున్నారు. అపనమ్మకం, అసంతృప్తితో ప్రస్తుతం తూర్పు గులాబీ పార్టీ కొనసాగుతుండగా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధులు పార్టీలో తమకున్న పాత సంబంధాలను వినియోగంచుకుని తమ వైపు తిప్పుకునేందుకు సర్వశక్తులు ప్రయోగిస్తున్నారు.