తొందరపడవద్దు… వైఎస్ హయాంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాం.. పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీలో కేసీఆర్

రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తొందర పడవద్దని.. పార్టీ వీడవద్ధనిమాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తెలిపారు.

తొందరపడవద్దు… వైఎస్ హయాంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాం.. పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీలో కేసీఆర్

విధాత : రాజకీయ భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తొందర పడవద్దని.. పార్టీ వీడవద్ధనిమాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తెలిపారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్‌, మాగంటి గోపీనాథ్‌, ముఠా గోపాల్‌, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌ రెడ్డి, దండె విఠల్‌, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేశ్‌, రావుల శ్రీధర్‌ రెడ్డిలతో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారితో కలిసి లంచ్‌ చేసిన కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. ఎవరూ తొందరపడొద్దని సూచించారు.

ఇలాంటి పరిణామాలు ఆనాటి వైఎస్‌ హయాంలోనే జరిగాయని.. అయినా మనం భయపడలేదని కేసీఆర్‌ గుర్తు చేశారు. మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పార్టీ మారడాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచించారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన బీఆర్‌ఎస్‌కు వచ్చే నష్టం ఏమీ లేదని స్పష్టం చేశారు. రేపట్నుంచి వరుసగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. భవిష్యత్తులో మనకు‌ మంచి రోజులు వస్తాయని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని స్పష్టం చేశారు.

గైర్హాజరైన ఎమ్మెల్యేలు

కెసిఆర్ తన ఫామ్ హౌస్ లో నిర్వహించిన ఎమ్మెల్యేల భేటీకి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం చర్చనీ అంశమైంది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ భేటీకి దూరంగా ఉన్నారు. దానం నాగేందర్ ఇటీవల కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పిన పేర్లలో గైరాజరైన ఐదుగురు ఎమ్మెల్యేల పేర్లు ఉండటం గమనార్హం. అయితే మహిపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. తను ఈడి కేసు పనులపై వచ్చానని.. కేసీఆర్ భేటీ అంశం తనకు తెలియదని మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే గైరాజరైన ఎమ్మెల్యేలు రేపు ఎల్లుండి కేసీఆర్ ను కలిసే అవకాశం లేకపోలేదు.