భూపాల్‌కు టికెట్ ఇవ్వొద్దు..- బీఆర్ఎస్‌ను ఆగం చేయొద్దు: పిల్లి రామరాజు యాదవ్

భూపాల్‌కు టికెట్ ఇవ్వొద్దు..- బీఆర్ఎస్‌ను ఆగం చేయొద్దు: పిల్లి రామరాజు యాదవ్

కేసీఆర్, కేటీఆర్ పునరాలోచించాలి

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ‘నల్లగొండ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆగడాలు మితిమీరిపోయాయి. ఆయనకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి పార్టీని ఆగం చేయొద్దు’ అని ఆపార్టీ రాష్ట్ర నాయకులు, కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 2న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి నల్లగొండ జిల్లా కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.



ఐదేళ్ల కాలానికే భూపాల్ రెడ్డి హృదయంలో అహంకారం, ప్రజల పట్ల నోటి దురుసు పెరిగిపోయిందన్నారు. అధికారం ఆవహించి అధికార పార్టీ నేతలనే చీదరించుకుంటున్న పరిస్థితి ఏర్పడ్డదన్నారు. నల్లగొండ పట్టణానికి వందల కోట్ల నిధులు కేటాయించినా ఏ ఒక్క కౌన్సిలర్ కూడా చిన్న కాంట్రాక్టు ఇవ్వని దుస్థితి భూపాల్ రెడ్డి దన్నారు. సొంత పార్టీ కౌన్సిలర్లను పక్కనపెట్టి పక్క పార్టీ కౌన్సిలర్ల వార్డులకు నిధులు కేటాయిస్తున్నారని ఆరోపించారు.



బీఆరెస్ కు నియోజకవర్గంలో ఇద్దరు జడ్పీటీసీలు ఉంటే ఇద్దరినీ దూషించడమే తప్ప ఏనాడు గౌరవించలేదన్నారు. నియోజకవర్గంలోని ఎంపీటీసీలను, సర్పంచులను, వార్డు మెంబర్లను ఏనాడు పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. భూపాల్ రెడ్డి మీద స్వంతపార్టీ వారికే లోలోపల తీవ్రమైన వ్యతిరేకత ఉన్న విషయాన్ని అధిష్టానం గమనించాలన్నారు. తనకు టికెట్ కేటాయిస్తే అన్ని వర్గాల ప్రజలు తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అధిష్టానం ఒకసారి పునరాలోచించి భూపాల్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని మార్చాలని కోరారు.