పరీక్ష తేదీలపై అభ్యర్థుల్లో అయోమయం

కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాలపై నిరుద్యోగులకు చాలా ఆశలున్నాయి

పరీక్ష తేదీలపై అభ్యర్థుల్లో అయోమయం

కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాలపై నిరుద్యోగులకు చాలా ఆశలున్నాయి. ఆ పార్టీ మొదటి క్యాబినెట్‌లోనే మెగా డీఎస్సీ అన్న హామీ ఇప్పటికీ అమలుకాలేదు. సాంకేతికపరమైన కారణాలతో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉండకపోవచ్చు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కొన్నిపరీక్షలపై నిరుద్యోగులకు స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఎన్నికల నేపథ్యంలో వాయిదాపడిన గ్రూప్‌-2 పరీక్ష యథావిధిగా కొనసాగించినా లేదా కొనసాగించకపోయినా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. నిజానికి గ్రూప్‌-2 పరీక్షను ఆగస్టు 29,30 తేదీలలో నిర్వహించడానికి కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. ప్రిపరేషన్‌కు సమయం సరిపోలేదని పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌ మేరకు కమిషన్‌ నవంబర్‌ 2, 3 వ తేదీలకు రీషెడ్యూల్‌ చేసింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో మరోసారి గ్రూప్‌-2 వచ్చే ఏడాది జనవరి 6,7వ తేదీలకు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

గ్రూప్‌-2, 3 కలిపితే

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రక్రియను ప్రభుత్వం యథావిధిగా కొనసాగిస్తే అభ్యర్థుల కోణం చూసినప్పుడు వాళ్లు సంతృప్తి పడే అవకాశాలు లేవు. పోస్టుల సంఖ్య పెంచాలని వారు కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటే ఉన్న నోటిఫికేషన్‌కు అనుబంధంగా సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ విడుదల చేసి ముందు దరఖాస్తు చేసుకోని వారికి తిరిగి అవకాశం లభిస్తుంది. అదే జరిగితే ప్రస్తుతం షెడ్యూల్‌ ప్రకారం జరగదు. పోస్టుల సంఖ్య పెరిగితే నిరుద్యోగుల నుంచి కూడా వ్యతిరేకత రాకపోవచ్చు. కానీ పోస్టులు పెంచకుండా ప్రస్తుత షెడ్యూల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సర్వీస్‌ కమిషన్‌ ప్రక్షాళన తర్వాతే కొత్తబోర్డు ఆధ్వర్యంలోనే పరీక్షలు నిర్వహిస్తామంటే అది మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. యూపీఎస్సీలో ఆలిడిండియా సర్వీస్‌, గ్రూప్‌-ఏ, బీ సర్వీస్‌లు ఉంటాయి. వీటన్నింటికి కలిపి ఒకే పరీక్ష ఉంటుంది. ఇదే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరించి గ్రూప్‌-2, 3 రెండింటిని కలిపితే రెండు వేల వరకు పోస్టులు ఉంటాయి. కనుక యథావిధిగా పరీక్షలు కొనసాగించాలనుకుంటే యూపీఎస్పీ పద్ధతిలో ఒకే పరీక్ష నిర్వహించినా ఇబ్బంది ఉండదు. అలాగే ఇయర్‌ క్యాలెండర్‌ ప్రకటించి ఎప్పుడు ఏ పరీక్ష నిర్వహిస్తారో కూడా తెలియజేస్తే నిరుద్యోగులు కూడా సంతృప్తిపడవచ్చు అనేది నిపుణుల అభిప్రాయం. 

డీఎస్సీ పై అదే సస్పెన్స్‌

గత ప్రభుత్వం5089 వేలకు పైగా టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు చివరి తేదీని అక్టోబర్‌ 21 వరకు అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నప్పటికీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మరో వారం గడువును పెంచి 28 వరకు పొడిగించారు. ఆ పరీక్ష తేదీలను అధికారికంగా ప్రకటించకపోయినా డిసెంబర్‌లో జరుగుతాయిన అనుకున్నారు. కానీ ఎన్నికల నేపథ్యంలో ఆ పరీక్షలు కూడా వాయిదాపడ్డాయి. అయితే ప్రభుత్వం ప్రకటించిన పోస్టులపై నిరుద్యోగ అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కొన్ని జిల్లాల్లో పోస్టులు లేవని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్నట్టు మెగా డీఎస్సీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. టీచర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఎన్ని పోస్టులు పెరుగుతాయి? ప్రస్తుత నోటిఫికేషన్‌కు అనుబంధంగా మరో నోటిఫికేషన్‌ ఇస్తారా? లేక దాన్ని రద్దు చేసి మరో నోటిఫికేషన్‌ ఇస్తారా? వీటిపై కూడా స్పష్టత రావాల్సి ఉన్నది. 

త్వరగా తేలకపోతే లోక్‌సభ ఎన్నికల తర్వాతే

డీఎస్సీకి సంబంధించి నిర్ణయం ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కానీ సర్వీస్ కమిషన్‌ స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. పరీక్షలపై నిర్ణయాధికారం కమిషన్‌కే ఉంటుంది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సర్వీస్‌ కమిషన్‌ ఉన్నతాధికారులు ప్రభుత్వంతో దీనిపై వారం రోజులుగా చర్చలు జరుపుతున్నా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీంతో పరీక్షల తేదీలపై అభ్యర్థుల్లో అయోమయం నెలకొన్నది. ఇప్పుడు కోచింగ్‌లు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. యాప్‌ల ద్వారా కోచింగ్‌ ఇస్తున్నారు. వాళ్లు అభ్యర్థులు సన్నద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. దీంతో ప్రభుత్వం వీలైనంత త్వరగా దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోతే మళ్లీ లోక్‌సభ ఎన్నికల తర్వాతే జరపాల్సి ఉంటుంది.