కేసీఆర్‌దే బాధ్య‌త‌,కాళేశ్వ‌రం ప్రాజెక్టు మొత్తాన్నీకేంద్ర ఏజెన్సీలు ప‌రీక్షించాలి

కేసీఆర్‌దే బాధ్య‌త‌,కాళేశ్వ‌రం ప్రాజెక్టు మొత్తాన్నీకేంద్ర ఏజెన్సీలు ప‌రీక్షించాలి
  • ప్రజలకు భరోసా కలిగించాలి
  • ల‌క్ష్మీ బ‌రాజ్ కుంగిపోవ‌డానికి
  • బాధ్యులెవ‌రో తేల్చి శిక్షించాలి
  • ఈటల రాజేందర్ డిమాండ్‌

విధాత‌, హైద‌రాబాద్‌: మేడిగడ్డ, సుందిల్ల‌, అన్నారం ప్రాజెక్టులు తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇచ్చి కాపాడతాయి అనుకుంటే.. వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు మోట‌ర్లు మునిగి పోతున్నాయ‌ని, ఇప్ప‌డేమో బ‌రాజ్ కుంగిపోయింద‌ని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. దీనికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ బాధ్య‌త వ‌హించాల‌ని, వెంట‌నే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఏజెన్సీలు తక్షణమే ఈ ప్రాజెక్టును సందర్శించి, పూర్తి సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాలని కోరారు. మేడిగ‌డ్డ‌లోని ల‌క్ష్మీబ‌రాజ్ కుంగిపోయింద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో రిటైర్డ్ అధికారులు రామ‌చంద్రుడు, చంద్రవదన్, మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి మొలుగూరుల‌తో క‌లిసి ఆదివారం ఆయ‌న బరాజ్‌ను సంద‌ర్శించారు. బ‌రాజ్ ప‌రిశీల‌న‌కు వ‌చ్చిన ఈట‌ల‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఈట‌ల‌ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజల డబ్బుతో క‌ట్టిన ఈ బ‌రాజ్‌పైకి ప్ర‌తిప‌క్ష పార్టీల‌ నేత‌ల‌ను, నిపుణుల‌ను, మీడియాను అనుమ‌తించ‌కుండా.. నిషిద్ధ ప్రాంతంగా ప్ర‌క‌టించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స్వయంగా కేసీఆర్ త‌న మెద‌డునంతా కరిగించి, ఇంజినీర్లకే సూచనలు ఇచ్చి కట్టించాన‌న్నార‌ని, కానీ అతి తక్కువ కాలంలోనే మొన్న వరదలు వచ్చినప్పుడు ఈ లక్ష్మీ బ‌రాజ్‌ పంపులు మునిగిపోయాయ‌ని గుర్తు చేశారు. దీంతో ఈ ప్రాజెక్టు గొప్పతనం అప్పుడే తెలిసిపోయిందన్నారు. కాంక్రీట్ గోడలు పడిపోయి, మోటర్లు ముక్కలు ముక్కలు అయ్యాయని తెలిపారు. ఇప్పుడేమో ప్రాజెక్టు కుంగిపోతున్నద‌ని అన్నారు. మ‌రి తెలంగాణ ప్రజలకు గోదావ‌రి నీళ్లు ఎలా ఇస్తారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌ ఇవన్నీ దాచి పెట్ట‌కుండా పూర్తి సమాచారాన్ని ప్రజలకు తెలియ‌జేయాల్సిన‌ బాధ్యత ఉంద‌న్నారు. సమాచారం లేకుండా గేట్లు తెరవడం వల్ల బర్లు, గొర్లు కొట్టుకుపోయాయ‌ని, పొలాలు ముగినిపోయాయ‌ని అన్నారు. ఒకటే పిల్లర్ 5 అడుగులు కుంగింది అంటున్నార‌ని, కానీ.. 15 నంబర్ నుంచి 22 వ నంబ‌ర్ పిల్లర్ వరకు కొన్ని వందల టన్నుల కాంక్రీట్‌తో నిర్మించినవి కుంగిపోయాయ‌ని చెప్పారు. ఈ న‌ష్టానికి కార‌కులైన వారికి ఇచ్చే శిక్ష ఏంట‌ని సీఎంను నిల‌దీశారు. ఈ నష్టానికి కారుకులెవరో తేల్చాల‌ని డిమాండ్ చేశారు. పోలీసులను పెట్టి, ఎవరిని పోనీయకుండా దాచినంత మాత్రాన సత్యాలు దాగవన్నారు. ఇప్పటికే స్థానికంగా ఉన్న ప్రజలంతా ప్రాజెక్టు మీదకు పోయి, వాటిని చూసి బెదిరిపోయారని చెప్పారు. ఊర్లో పంటలు, ప్రాణాలు ఏమవుతాయని భయపడుతున్నారని అన్నారు.