ధరణి పోర్టల్‌లో అవకతవకలు తేల్చేందుకు రంగం సిద్ధం
రాష్ట్ర ప్రభుత్వం ధరణికి శస్త్ర చికిత్స మొదలు పెట్టింది. ధరణి అవకతవకలను వెలికితీసి, సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన కమిటీ పని మొదలుపెట్టింది.

- సచివాలయంలో కమిటీ తొలి భేటీ
- సమస్త సమాచారం కోరిన సభ్యులు!
- అంశాలవారీగా ప్రభుత్వానికి నివేదిక
విధాత, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ధరణికి శస్త్ర చికిత్స మొదలు పెట్టింది. ధరణి అవకతవకలను బయటకు తీసి, రైతుల సమస్యలను పరిష్కరించడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం భూముల సమస్యలపై పనిచేసిన నిష్ణాతులతో వేసిన కమిటీ గురువారం సచివాలయంలో తొలి సమావేశం నిర్వహించింది. సమావేశానికి కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, రిటైర్డ్ ఏఐఎస్ అధికారి, మాజీ సీసీఎల్ఏ రేమండ్ పీటర్, భూమి నిపుణులు, న్యాయవాది భూమి సునీల్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ వీ మధుసూధన్, మెంబర్ కన్వీనర్, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్‌తో పాటు సీఎంఆర్‌వో ప్రాజెక్ట్ డైరెక్టర్, డిప్యూటీ కలెక్టర్ వీ లచ్చిరెడ్డి హాజరయ్యారు.
సమస్యల గుర్తింపు
ఈ కమిటీ మొదటి సమావేశంలో ధరణిలో భూములకు సంబంధించి అనేక సమస్యలున్నట్లు గుర్తించింది. ఈ సమస్యలు ఏ విధంగా తలెత్తాయి? ధరణిలో జరిగిన లావాదేవీలు, వాటిలో జరిగిన అక్రమాలు, ప్రభుత్వ, అసైన్డ్ భూములు ప్రైవేట్‌గా మారిన తీరు, ధరణి పోర్టల్ ద్వారా ప్రజలు ఇబ్బంది పడిన వైనంపై ఈ కమిటీ ప్రాథమికంగా చర్చించింది. ధరణిలో ఉన్న సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కోసం తన కార్యాచరణను సీసీఎల్ఏ వేదికగా మొదలు పెట్టాలని, పండుగ తరువాత మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. వీలైనంత త్వరగా కమిటీ తన నివేదికను ఇస్తుందని కమిటీ సభ్యులు సమావేశం అనంతరం మీడియాకు వెల్లడించారు.
ఎలా ముందుకెళదాం?
ప్రధానంగా ఈ సమావేశంలో కమిటీ ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఒక్కో సమస్యను ఏవిధంగా గుర్తించాలి? గుర్తించిన సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే దిశగా సూచనలు ఇచ్చేందుకు అనుసరించాల్సిన మార్గం ఏమిటి? అనే అంశాలపై ప్రధానంగా చర్చ నడిచినట్టు తెలుస్తున్నది. ధరణి వెబ్‌సైట్‌కు సంబంధించిన సమస్త సమాచారాన్ని తమకు ఇవ్వాలని కమిటీ సభ్యులు అధికారులను కోరినట్టు సమాచారం. మొత్తం అధ్యయనం చేసి, ప్రభుత్వానికి తుది నివేదిక ఇవ్వడానికి సమయం పట్టే అవకాశాలున్న రీత్యా.. అంశాల వారీగా అధ్యయనం చేసి, వాటిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
ముందుగా ధరణి చట్టం, వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థల రద్దు, గ్రామస్థాయిలో భూముల పర్యవేక్షణ గతంలో ఎలా ఉండేది? ప్రస్తుతం ఎలా ఉంది? ధరణికి ముందు, తరువాత భూ పరిపాలన, తాసిల్దార్లకు, డిప్యూటీ కలెక్టర్లకు ఉన్న అధికారాలు తీసి కలెక్టర్లకు, సీసీఎల్ఏకు మాత్రమే అధికారాలు ఇచ్చిన తరువాత రైతులు పడిన ఇబ్బందులను కమిటీ పరిశీలించనున్నది. ధరణి పోర్టల్ నిర్వహణ, భూ రికార్డుల నిర్వహణ ప్రభుత్వం నుంచి కాకుండా ప్రైవేట్‌కు అప్పగించడానికి గల కారాణాలు ఏమిటి? ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల చేతుల్లోకి ధరణి పోర్టల్ వెళ్లిన తరువాత జరిగిన లావాదేవీలు, ఏ కారణం చేతనైనా భూమి రిజిస్టర్ కాకపోతే రిజిస్ట్రేషన్ చార్జీలు తిరిగి ఇవ్వకపోవడానికి గల కారణాలు? అసైన్డ్ భూములు పట్టా భూములుగా, ప్రభుత్వ భూములుగా మారిన తీరు. ప్లాట్లు వ్యవసాయ భూములుగా మారిన వైనం, ఇలా ధరణిలో జరిగిన అనేక అవకతవకలు, రికార్డుల మార్పిడి, రైతులకు జరిగిన ఇబ్బందులు, పట్టాల మార్పిడి, భూమి హెచ్చు తగ్గులు వీటన్నింటినిపై సమగ్రంగా అధ్యయనం చేయడం కోసం అనుసరించాల్సిన తీరుపై ఈ కమిటీ ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం.
వీటి అధ్యయనానికి అవసరమైన ఫైళ్లు తీసుకోవడం ఎలా? అధికారుల సహకారం ఎలా ఉంటుందన్న దానిపై చర్చించిన ఈ కమిటీ వచ్చే వారం నుంచి పూర్తిస్థాయిలో పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు అధికారులను ఈ కమిటీ డాటా ఇవ్వాలని అడిగినట్లు సమాచారం. అలాగే ఇతర రాష్ట్రాలలో ఉన్న భూ పరిపాలన పద్ధతులు, రికార్డుల వ్యవస్థ ఎలా ఉందన్నదానిపై కూడా సమాచారం తీసుకోవాలని నిర్ణయించింది. ఇలా అన్ని రకాల సమాచారం సేకరించి, అధ్యయనం చేసి, అంశాలవారీగా సమగ్ర నివేదికలను ప్రభుత్వానికి అందజేయాలని కమిటీ నిర్ణయించినట్టు సమాచారం.
ప్రజలకు భరోసా కల్పించే విధంగా పని చేస్తాం
ధరణిలో భూముల సమస్యలు చాలా ఉన్నాయని కమిటీ సభ్యులు ప్రముఖ న్యాయవాది భూమి సునీల్ తెలిపారు. కమిటీ సమావేశం తరువాత కోదండరెడ్డితోపాటు ఇతర కమిటీ సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలపై కమిటీ వేసిందన్నారు. తమ కమిటీ ప్రజలకు భరోసా కల్పించే విధంగా పని చేస్తుందని, ఈ మేరకు విధి విధానాలు తయారు చేసి, ప్రభుత్వనికి వేగంగా సలహాలు ఇస్తామన్నారు. మా కమిటీ సీసీఎల్ఏ కార్యాలయం వేదికగా పని చేస్తుందని తెలిపారు. వారం రోజుల్లో కమిటీ మళ్ళీ సమావేశం అవుతుందన్నారు.
వేగంగా సమస్య పరిష్కరించడానికే కమిటీ
రాష్ట్ర ప్రజలు, రైతాంగం ధరణి పోర్టల్ ద్వారా చాలా ఇబ్బంది పడ్డారని కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే, జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి చెప్పారు. ఆన్‌లైన్‌లో చాలా భూములు ఎక్కలేదని తెలిపారు. రైతులకు, భూ యజమానులకు ప్రభుత్వ సహాయాలు అందలేదని తెలిపారు. ధరణి వల్ల సన్నకారు, చిన్నకారు రైతులు గుంట భూమి అమ్మడానికి కూడా ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. లక్షల రైతుల కుటుంబాలు ఇబ్బంది పడ్డాయని తెలిపారు. ఇప్పటికే ధరణి మీద అధ్యయనం చేశామని, ధరణిలో మార్పులు చేర్పులు చేస్తామని గతంలోనే రేవంత్ రెడ్డి చెప్పారని కోదండరెడ్డి పేర్కొన్నారు. వేగంగా సమస్య పరిష్కారం కోసం కమిటీ వేశారన్నారు. గతంలో తప్పులు పునరావృతం కాకుండా అడుగులు వేస్తామని తెలిపారు.