కాంగ్రెస్‌కు భారీ షాక్.. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల రాజీనామా

- బీఆర్ఎస్‌లో చేరుతారని ఊహాగానాలు
- ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు రాజీనామా లేఖ
- రేవంత్ రెడ్డి పై పొన్నాల ఆగ్రహం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తలిగింది. తెలంగాణ మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వరంగల్ జిల్లా జనగామకు చెందిన పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. పొన్నాల రాజీనామాతో కాంగ్రెస్ పార్టీలోని బీసీల్లో కొంత అభద్రత నెలకొనే అవకాశం ఉంది. పోరాటం చేయాల్సిన నేత అర్ధంతరంగా రాజీనామా చేయడం పట్ల ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది. త్వరలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా వెలువడుతుందనే సమయంలో పొన్నాల రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించడం కాంగ్రెస్ పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారనుంది.
పొన్నాల ముందస్తు ప్రణాళిక తోటే ఈ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించాడా? అనే చర్చ కూడా సాగుతోంది. కొంతకాలంగా పొన్నాలను కాంగ్రెస్ పార్టీ పెద్దగా పట్టించుకున్న దాఖలా లేదు. ఇటీవల ఆయన బీసీ వాదాన్ని ఎత్తుకున్నప్పటికీ ఆత్మరక్షణలో నుంచి ఆయన ఈ వాదాన్ని అనుసరించారని విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పెద్దగా బీసీలను పట్టించుకోలేదని విమర్శలు కూడా ఉన్నాయి.
ఏదిఏమైనా పొన్నాల తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఆయనను మరికొంత విశ్లేషించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో అభద్రతాభావం నెలకొన్న సందర్భంలో ఆయన ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు కూడా ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ఆయనకు బీఆర్ఎస్ నుంచి ఆహ్వానం అందే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి.
తెలంగాణకు తొలి పీసీసీ చీఫ్
తెలంగాణ పీసీసీ తొలి చీఫ్ పొన్నాలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినప్పటికీ ఆయన ఓటమి చెందడమే కాకుండా, కాంగ్రెస్ పార్టీ కూడా 2014 ఎన్నికల్లో ఓటమిపాలైంది. పీసీసీ చీఫ్ గా పొన్నాల వైఫల్యం చెందారనే విమర్శలు ఉన్నాయి. తాను ప్రాతినిధ్యం వహించిన జనగామ నుంచి కూడా ఆయన విజయం సాధించలేకపోవడం పట్ల అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తరువాత ఆయన జనగామకు దూరంగా ఉంటూ వచ్చారు.

2018 ఎన్నికల్లో కూడా జనగామ టికెట్ వస్తుందా లేదా అని అనుమానాలు నెలకొన్న సందర్భంలో ఆఖరికి ఆయన కాంగ్రెస్ సీటు దక్కించుకొని పోటీ చేసినప్పటికీ, మరోసారి ఓడిపోయారు. ఒక దశలో పొత్తులో భాగంగా ప్రొఫెసర్ కోదండరాం రెడ్డికి ఈ సీటు కేటాయిస్తారని చర్చ సాగింది. చివరికి పొన్నాలకు దక్కించుకున్నప్పటికీ ఓటమిపాలయ్యారు. 2018లో ఓటమి చెందినప్పటి నుంచి జనగామకు దూరంగా ఉంటున్నారని విమర్శలు ఆయనపై ఉన్నాయి.
గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కుటుంబం నుంచి కూడా ఆయనపై ఒత్తిడి సాగింది. వయసు రీత్యా కూడా పొన్నాల రిటైర్మెంట్ స్టేజీలో ఉన్నారని చర్చ సాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలక నేతగా ఉన్న పొన్నాల ఈ జిల్లాను కూడా పెద్దగా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో జనగామలో మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి రంగప్రవేశంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
జనగామపై పొన్నాల పట్టు కోల్పోయారని చర్చ సాగింది. ఈ దశలో కొమ్మూరి డీసీసీ ప్రెసిడెంట్ గా ఎంపిక కావడం పొన్నాల జీర్ణించుకోలేకపోయారు. కొమ్మూరికి రేవంత్ రెడ్డి పూర్తి సపోర్టు చేయడంతో పొన్నాలకు ఇబ్బందికరంగా మారింది. ఇటీవల ఆయనకు జనగామ టికెట్ వస్తుందా లేదా అని అనుమానాలు కూడా నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమైన బీసీలకు సముచిత స్థానం కేటాయించాలని డిమాండ్ ఊపందుకుంది.

దీనికి పొన్నాల, హనుమంతరావు, మధు యాష్కి తదితరులు నేతృత్వం వహించారు. ఈ దశలో ఫలితం తేలకముందే పొన్నాల కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పొన్నాలకు కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు దక్కలేదని కొందరు అంటుండగా, తనను నమ్ముకున్న బీసీలను కాదని రాజీనామా చేయడం పట్ల విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందని చర్చ ప్రారంభమైంది.
ఇదిలాఉండగా ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని ఊహాగానాలు అప్పుడే సాగుతున్నాయి. జనగామ టికెట్ పొన్నాలకు కేటాయిస్తారని చర్చ సాగుతోంది. జనగామ సిటింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కాదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఈ సీటు కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పల్లాను కాదని పొన్నాలకు కేటాయిస్తారా? అనేది ఆసక్తికరమైన చర్చగా మారింది. బీఆర్ఎస్ నుంచి గట్టి హామీ లభించిన తర్వాతనే పొన్నాల రాజీనామా చేశారని ఆరోపణలు వ్యక్తం కావడం బాధాకరం.
ఖర్గేకు పొన్నాల లేఖ
తన రాజీనామా సందర్భంగా పొన్నాల ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను ఉద్దేశించి శనివారం లేఖను రాశారు. ఈ లేఖలో గత కొంతకాలంగా పార్టీలో తాను అనుభవిస్తున్న ఇబ్బందిని, పార్టీ సీనియర్ నేతలను పట్టించుకోని వైనాన్ని, బీసీలను చిన్నచూపు చూస్తున్న వైఖరిని అందులో పేర్కొన్నారు. బీసీలకు కాంగ్రెస్ లో తీవ్రనష్టం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా ఆక్షేపించారు.