నియోజ‌క‌వ‌ర్గానికి నిధులు ఇవ్వ‌డంలేదు.. హైకోర్టును ఆశ్ర‌యించిన ఎమ్మెల్యే సీత‌క్క

నియోజ‌క‌వ‌ర్గానికి నిధులు ఇవ్వ‌డంలేదు.. హైకోర్టును ఆశ్ర‌యించిన ఎమ్మెల్యే సీత‌క్క
  • తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు
  • ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసిన న్యాయ‌స్థానం
  • పూర్తి వివ‌రాల‌తో కౌంట‌ర్ దాఖ‌లు చేయల‌ని ఆదేశం
  • త‌దుప‌రి విచార‌ణ అక్టోబ‌ర్ 9కి వాయిదా

విధాత‌, హైద‌రాబాద్: త‌న నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి ప్ర‌భుత్వం నిధులు మంజూరు చేయ‌కుండా వివ‌క్ష చూప‌తోంద‌ని ములుగు ఎమ్మెల్యే సీత‌క్క తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ములుగు నియోజ‌క‌వ‌ర్గానికి సీడీఎఫ్ నిధులు విడుద‌ల‌ చేయ‌కుండా అభివృద్ధికి అడ్డుప‌డుతున్నార‌ని ఆమె పిటిష‌న్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నందునే త‌న నియోజ‌క‌వ‌ర్గానికి నిధులు మంజూరు చేయ‌డంలేద‌ని వివ‌రించారు. సీడీఎఫ్ నిధుల మంజూరులో జిల్లా మంత్రి ప్ర‌మేయం చ‌ట్ట‌విరుద్ధం అని పేర్కొన్నారు. ఈ పిటిష‌న్‌పై శుక్ర‌వారం తెలంగాణ హైకోర్టు న్యాయ‌మూర్తి జస్టిస్ సుమలత ధ‌ర్మాస‌నం విచార‌ణ చేప‌ట్టింది. ములుగు నియోజకవర్గానికి నిధులు మంజూరైనట్టు శాంక్షన్ ఆడ్ ఇచ్చిన తర్వాత ఎందుకు నిధులు ఇవ్వలేదని హైకోర్టు ప్రశ్నించింది.



ప్రభుత్వం నాలుగు వారాలు సమయం కావాలని కోరడంతో హైకోర్టు తిర‌స్క‌రించింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు నిధులు ఇచ్చిన ప్రభుత్వం ములుగు ఎమ్మెల్యే నియోజవర్గానికి ఇవ్వలేదని ఆమె తరపు సీనియర్ న్యాయవాది శ్రీపాద ప్రభాకర్, న్యాయవాది కృష్ణ కుమార్ గౌడ్ వాదించారు. 2022లో కానిస్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ రూ.2.6 కోట్లు మంజూరు చేసినట్టు ప్రభుత్వం సాంక్షన్ ఆర్డర్ ఇచ్చిందని ఇప్పటివరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదని చెప్పారు. చాలాకాలంగా ఎదురుచూస్తున్నప్పటికీ కాన్స్టెన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వలేదని చెప్పారు.



ఈ నిధులతో ప్రజల సౌకర్యం కోసం రోడ్లు, డ్రైనేజీలు వంటివి నిర్మించడం జరుగుతుందని అన్నారు. ఈ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేస్తుందని ఆరోపించారు. మరో మూడు నాలుగు నెలల్లో శాసనసభకు ఎన్నికలు రాబోతున్నాయని తక్షణమే నిధులు మంజూరు చేస్తే ములుగు నియోజకవర్గ అభివృద్ధికి చర్యలు తీసుకునేందుకు శాసనసభ్యురాలు చొరవ చూపుతారని అన్నారు. వచ్చే డిసెంబర్ నాటికి ఎన్నికలు జరగవచ్చునని ఈలోగా నిధులు ఇవ్వకపోతే అవన్నీ వృథా అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.



తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వకుండా జిల్లాకు చెందిన మంత్రి మోకాలు అడ్డు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు నిధులు మంజూరు చేయాలని కోరిన అధికారుల నుంచి స్పందన లేదన్నారు. అన్ని నియోజకవర్గాలకు నిధులు ఇచ్చిన ప్రభుత్వం ములుగు నియోజకవర్గ పట్ల వివక్షత చూపుతోందని న్యాయ‌స్థానానికి గుర్తుచేశారు. ఇటీవల వరదలు సంభవించినప్పుడు తన నియోజకవర్గం ఎక్కువగా దెబ్బతిందని, 17 మంది చనిపోయారని, రోడ్లు డ్రైనేజీలు బాగా దెబ్బతిన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చట్ట ప్రకారం రావాల్సిన నిధులు ప్రభుత్వం మంజూరు చేస్తే నియోజకవర్గ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పన సాధ్యమవుతుందని అన్నారు.



ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కల్పించుకుని పూర్తి వివరాలు సమర్పించేందుకు కనీసం నాలుగు వారాలు సమయం కావాలని ధ‌ర్మాస‌నాన్ని కోరారు. ఈ పరిస్థితుల్లో తిరిగి ప్రభాకర శ్రీపాద కల్పించుకుని నాలుగు వారాల సమయం ఇచ్చిన తర్వాత జరిగే విచారణ నాటికి అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలు కావచ్చు అని, అంత సమయం ఇవ్వాల్సిన అవసరం లేదని అభ్యంతరం చెప్పారు. దీంతో పది రోజులు మాత్రమే సమయం ఇస్తున్నట్టు న్యాయ‌స్థానం ప్రకటించింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ అప్ప‌టిలోగా పూర్తివివ‌రాల‌తో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను అక్టోబ‌ర్ 9కి వాయిదా వేసింది.