సవాళ్లను అధిగమిస్తేనే అద్భుతాలు సాధ్యం

- ఉస్మానియా స్నాతకోత్సవంలో గవర్నర్
విధాత : విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించినప్పుడే అద్భుత విజయాలు సొంతం చేసుకోగలుతారని గవర్నర్, ఉస్మానియా యూనివర్సిటీ చాన్స్‌లర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవం యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.
యూనివర్సిటీ చరిత్రలో ఒకేసారి 1024మందికి పీహెచ్‌డీ పట్టాలు పంపిణీ చేశారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ కనబరిచిన 58మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ పంపిణీ చేశారు. ఓయు ఇంజనీరంగ్ పూర్వ విద్యార్థి, ప్రపంచంలోని ఉత్తమ కంపనీల్లోని ఒకటైన అడోబ్, అధ్యక్షుడు, సీఈవో శంతన్ నారాయణ్ గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్నారు. గవర్నర్‌తో పాటు శంతన్ నారాయణ్, వీసీ దండెబోయిన రవిందర్‌లు పట్టాల పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ విద్యార్థులు తాము ఎంచుకున్న రంగంలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఆశించిన లక్ష్యాలను ప్రణాళికయుతంగా సాధించేందుకు కృషి చేసి విజయం సాధించాలన్నారు. ప్రతిభావంతులకు పతకాలు అందించేందుకు పారిశ్రామిక వేత్తలు, పూర్వ విద్యార్థులు ముందుకు రావాలని కోరారు.
ముఖ్య అతిధి శంతన్ నారాయణ్ మాట్లాడతుతూ ఈ యూనివర్సిటీలో చదివి ప్రపంచ అగ్రగామి సంస్థకు నాయకత్వం వహించడం అనందంగా ఉందన్నారు. వినూత్న ఆలోచనలతో 42ఏళ్ల క్రితం అమెరికా వెళ్లానని, కొత్త ఆవిష్కరణలకు దారులు ఎప్పుడు తెరిచే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి.లక్ష్మినారాయణ, పాలకవర్గ సభ్యులు, వివిధ విభాగాధిపతులు, ఎగ్జామినేషన్ కంట్రోలర్లు పాల్గొన్నారు.