రాజకీయాల్లో వ్యక్తిగత దూషణ సరికాదు: మండలి చైర్మన్ గుత్తా

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: రాజకీయాల్లో వ్యక్తిగత దూషణ సరైంది కాదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం చిట్యాల మండలకేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం కరెక్ట్ కాదని, భావి తరాలకు ఆదర్శంగా నేటి రాజకీయ నాయకులు నిలవాలని కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శవంతమైన నాయకుడిగా నిలిచారని చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లా గత పదేళ్లలో చాలా అభివృద్ధి చెందిందని, దేశం గర్వించే విధంగా యాదాద్రి ఆలయాన్ని నిర్మించిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. దామరచర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు జిల్లాకే తలమానికంగా నిలిచిందన్నారు. కాళేశ్వరం బ్యారేజ్ విషయంలో ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధికోసం కోడిగుడ్డు మీద ఈకలు పీకే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు వైఖరి కారణంగా తెలంగాణ రాష్టానికి అపకీర్తి వచ్చేలా ఉందని రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి ప్రాజెక్టు అంటే ఏమిటి? వ్యవసాయం అంటే ఏమిటి? అస్సలు తెలియదని ధ్వజమెత్తారు.
జలయజ్ఞం పేరుతో ధనాన్ని ధన యజ్ఞం చేసిన వాళ్ళు.. ప్రతిష్టాత్మకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుపైన మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు. అధికారంలోకి రాకముందే కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థులు పోటీ పడడం హాస్యాస్పదమన్నారు. రాబోవు ఎన్నికల్లో మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు.