టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే

- 19 వరకు బదిలీలు చేపట్టవద్దు
- ధర్మాసనం మధ్యంతర ఉత్వర్వులు
విధాత, హైదరాబాద్: రాష్ర్టంలోని స్కూల్ అసిస్టెంట్, ఎస్టీటీల బదిలీల ప్రక్రియను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. టీచర్ల ఉద్యోగోన్నతులు చేపట్టకుండా బదిలీలు చేయకూడదని రంగారెడ్డి జిల్లాకు చెందిన టీచర్లు హైకోర్టులో శుక్రవారం లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగోన్నతుల తర్వాతే బదిలీలు చేయాలని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ చేపట్టారు.
ఈనెల 19 వరకు బదిలీల ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలో సీనియార్టీపై, ఉద్యోగోన్నతులకు టెట్ అర్హత కేసులుండటం, ఉద్యోగోన్నతులపై స్టే ఉన్నందున రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లలో ఉద్యోగోన్నతులు చేపట్టకుండా కేవలం బదిలీలు మాత్రమే చేయాలని విద్యాశాఖ నిర్ణయించిందని పిటిషనర్ల తరుఫు న్యాయవాది బాలకిషన్ రావు వాదనలు వినిపించారు.
ఉద్యోగోన్నతుల తర్వాత బదిలీలు చేయాలని ధర్మాసనాన్ని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీల బదిలీలను ఈనెల 19 వరకు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.