పాలమూరులో ఆరు పెండింగ్.. తొలి జాబితాలో అభ్యర్థుల ఖరారు

పాలమూరులో ఆరు పెండింగ్.. తొలి జాబితాలో అభ్యర్థుల ఖరారు
  • మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డికి దక్కని టికెట్
  • జాబితాలో ముగ్గురు పాతవారే.. ఐదుగురికి కొత్తగా
  • మిగతా ఆరు నియోజకవర్గాల నేతల్లో ఉత్కoఠ



విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ తొలి జాబితాలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి.. మొత్తం 14 స్థానాలకు ఎనిమిది నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో మిగిలిన ఆరు నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో టెన్షన్ నెలకొన్నది. ఆశావహులు అధికంగా ఉండడం, కుల సమీకరణాలతో వీటిని పెండింగ్ లో ఉంచినట్టు తెలుస్తున్నది. కొత్తగా కాంగ్రెస్ లో చేరిన వారందరూ టిక్కెట్లు దక్కించుకున్నారు. పలువురు ఆశావహులకు నిరాశ ఎదురైంది.


నాగర్ కర్నూల్


నాగర్ కర్నూల్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి కుమారుడు రాజేశ్ రెడ్డికి తొలి జాబితాలో చోటు దక్కింది. దామోదర్ రెడ్డి బీఆరెస్ పార్టీకి రాజీనామా చేసి ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. ఆ సమయంలోనే తన కుమారుడికి టికెట్ ఇస్తామన్న హామీ పొందారు. కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి ఇంత కాలం కాంగ్రెస్ కు సేవలు అందించినా టికెట్ దక్కకపోవడంతో నిరాశలో ఉన్నారు. కూచుకుళ్ళకు నాగం మద్దతుగా ఉంటారో లేక సొంత కుంపటి పెట్టుకుంటారో త్వరలో తెలుస్తుంది.


కొల్లాపూర్


ఇటీవల కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తొలి జాబితాలోనే స్థానం దక్కించుకున్నారు. ఇక్కడ ఇంతకాలం కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న జగదీశ్వర్ రావుకు నిరాశే మిగిలింది.


గద్వాల


బీఆరెస్ నుంచి గద్వాల జడ్పీ చైర్ పర్సన్ గా ఉన్న సరిత ఇటీవల కాంగ్రెస్ లో చేరి తొలి జాబితాలోనే టికెట్ తెచ్చుకున్నారు. అసెంబ్లీకి పోటీ చేయడం ఆమెకు ఇదే తొలిసారి.


అలంపూర్


అందరూ అనుకున్నట్లే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తొలి జాబితాలో చోటు సాధించారు. గతంలో కూడా ఆయన ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు.


అచ్చంపేట


అనుకున్న విధంగానే చిక్కుడు వంశీ కృష్ణను కాంగ్రెస్ ప్రకటించింది. గతంలో ఆయన ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే గా ఉన్నారు.


కల్వకుర్తి


బీఆరెస్ ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ లో చేరి మొదటి జాబితాలోనే స్థానం దక్కించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు ఇదే తొలిసారి.


షాద్ నగర్


ఇక్కడకూడా అనుకున్నట్టే శంకరయ్య (వీర్లపల్లి శంకర్)కే టికెట్ లభించింది. ఎంతో కాలంగా పార్టీకి విధేయుడిగా ఉన్న శంకర్ కు సీనియర్ నేతగా పేరున్నా అసెంబ్లీకి పోటీ చేయడం ఇదే తొలిసారి.


కొడంగల్ నియోజకవర్గం


ఇక్కడి అభ్యర్థి ఎవరనేది ఊహించే అవసరం ఎవ్వరికీ రాలేదు. ఎందుకంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికే టికెట్ వస్తుందనే విషయం వేరే చెప్పనక్కరలేదు.


ఆరు సీట్లకు పెండింగ్


తొలి జాబితాలో మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని పరిశీలనలో పక్కకు పెట్టారు. ఇక్కడ ఆశావహులు ఎక్కువ ఉన్నారు. ప్రధానంగా మాజీ డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్త్వాల్, ముదిరాజ్ వర్గం నుంచి సంజీవ్ ముదిరాజ్, ఇటీవల బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఎన్పీ వెంకటేష్, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.


జడ్చర్ల


ఇక్కడ అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్ ఆచి తూచి అడుగులు వేస్తున్నది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. అనిరుధ్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డి మాత్రం ఎర్ర శేఖర్ పట్ల మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది. దీంతో ఇది పెండింగ్ లో పడింది.


దేవరకద్ర


ఇక్కడ కూడా పోటీ ఎక్కువగా ఉన్నది. మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షుడు గౌని మధుసూదన్ రెడ్డి, ప్రదీప్ గౌడ్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. వీరిద్దరినీ కాదని ఇటీవల కాంగ్రెస్ లో చేరిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డిని పోటీలో నిలపాలని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ ఆమె మక్తల్ కోరుతున్నారు.


మక్తల్


ఇక్కడ టికెట్ కోసం పోటీ పడుతున్న ముఖ్య నేతలు లేరు. ఒక్క వాకిటి శ్రీహరి మాత్రమే టికెట్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నారాయణ పేట డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ స్థానాన్ని ఇటీవల కాంగ్రెస్ లో చేరిన సీతా దయాకర్ రెడ్డి కోరారు. వీరిద్దరి ప్రజా బలం పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.


నారాయణ పేట


ఇక్కడ కూడా తీవ్ర పోటీ కారణంగానే ప్రకటించలేదని తెలుస్తున్నది. ఇక్కడ కుంభం శివకుమార్ రెడ్డికి ఇవ్వాలని నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. జడ్చర్ల టికెట్ అనిరుధ్ రెడ్డికి ఇస్తే అక్కడ టికెట్ కోరుతున్న ఎర్ర శేఖర్ కు నారాయణ పేట ఇవ్వాలని అధిష్ఠానం యోచనగా చెబుతున్నారు. ఎర్ర శేఖర్ కు ఇస్తే పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు చెబుతున్నారు.


వనపర్తి


ఇక్కడి సీనియర్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకు ప్రజా బలం తగ్గిందనే భావనలో అధిష్ఠానం ఉంది. పెద్దమందడి ఎంపీపీ చైర్ పర్సన్ మేఘారెడ్డి బీఆరెస్ కు రాజీనామా చేసి ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. ఆయన వనపర్తి నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. వీరిద్దరిలో ఎవరికి ఇవ్వాలనేది తేలకపోవడంతో పెండింగ్ లో పెట్టారని తెలుస్తున్నది.