కేంద్రం చర్యలతోనే పెరిగిన విద్యుత్తు వనరులు
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో తీసుకున్న విద్యుత్తు సంస్కరణల ఫలితంగానే దేశంలోనూ,

♦ కేంద్రం చర్యలతోనే పెరిగిన విద్యుత్తు వనరులు
♦ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో తీసుకున్న విద్యుత్తు సంస్కరణల ఫలితంగానే దేశంలోనూ, తెలంగాణలో విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థల సేవలు పెరిగాయని ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.
విద్యుత్తు శ్వేత పత్రంపై చర్చలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ తెలంగాణ విద్యుత్తు రంగానికి వేలాది కోట్ల సహాయం చేసినా శ్వేతపత్రంలో పేర్కోనలేదన్నారు. గతంలో రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు వెళితే పట్టించుకునే దిక్కు లేకుండా పోయేదని, ప్రధాని మోడీ హాయంలో యాదాద్రి థర్మల్ పవర్ ఫ్లాంట్ ప్రతిపాదనలకు 15రోజుల్లో అనుమతులిచ్చారని స్వయంగా సభలో ఆనాటీ సీఎం కేసీఆర్ చెప్పి 35ఏళ్ల రాజకీయ జీవితంలో అలాంటి ప్రభుత్వాన్ని చూడలేదని మోడీ, కేంద్ర మంత్రి జవదేకర్లను ప్రశంసించారని, ఆ విషయాన్ని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తన ప్రసంగంలో చెప్పలేదన్నారు.
పైగా కేంద్రం రాష్ట్రానికి ఎలాంటి సహాయం చేయలేదని బీజేపీని బద్నాం చేసే ప్రయత్నం చేశారని, ఆయన వ్యవహారం చూస్తే బీఆరెస్ ఇంకా బీజేపీకి వ్యతిరేకంగా తన చర్యలు కొనసాగిస్తుందని అర్ధమవుతుందన్నారు. పదేళ్లలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేసిన విద్యుత్తు చర్యల కారణంగా నిరంతరాయంగా కరెంటు సరఫరా సాధ్యమైందని మాజీ మంత్రి చెప్పి ఉంటే బాగుండేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సైతం శ్వేత పత్రంలో కేంద్ర సహాయాలను చూపలేదన్నారు. కేంద్రం రాష్ట్రంలోని ఎన్టీపీసీ రామగుండం పవర్ ఫ్లాంట్లకు సహాయం చేయడంతో పాటు సోలార్ విద్యుత్తు ఫ్లాంట్లకు ప్రోత్సాహాకాలు అందించిందన్నారు.
ఆర్ధిక రంగాన్ని బీఆరెస్ ప్రభుత్వం వేల కోట్ల అప్పుల్లో కూరుకపోయేలా వ్యవహారం చేస్తే కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు చూస్తే కూడా అదే భయం కల్గుతుందన్నారు. గత ప్రభుత్వాలల్లో సాగిన అప్పుల శ్వేతపత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం తను ఇచ్చిన హామీల నుంచి తప్పుకుంటే సహించలేది లేదన్నారు.