వారసత్వ రాజకీయ ఆధిపత్యం.. ఎన్నికల్లో పోటీకి అదనపు అర్హత
రానురాను రాజకీయరంగం పూర్తిగా వారసత్వంగా మారిపోయిందీ. ఎన్నికలు వచ్చాయంటే వారసులు కాదంటే బంధువులు బరిలోకి దిగిపోతున్నారు. మరో మాటలో చెప్పాలంటే కొందరైతే ఈ హక్కుతో దశాబ్దాలుగా రాజకీయాలను, పార్టీలను ఏలేస్తున్నారు

- ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్ధులుగా పోటీ
- పార్లమెంట్ ఎన్నికల ముఖచిత్రం
విధాత ప్రత్యేక ప్రతినిధి: రానురాను రాజకీయరంగం పూర్తిగా వారసత్వంగా మారిపోయిందీ. ఎన్నికలు వచ్చాయంటే వారసులు కాదంటే బంధువులు బరిలోకి దిగిపోతున్నారు. మరో మాటలో చెప్పాలంటే కొందరైతే ఈ హక్కుతో దశాబ్దాలుగా రాజకీయాలను, పార్టీలను ఏలేస్తున్నారు. మరికొందరు తరాలుగా కనీసం గ్రామపంచాయతీ వార్డు మెంబర్ గా గెలువడం సంగతి పక్కనపెడితే పోటీచేసిన సందర్భాలు లేకుండా పోతున్నాయి. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో ఎంపీ అభ్యర్ధులుగా పోటీపడుతున్న ప్రధాన పార్టీల్లో కూడా వారసులకు తక్కువేమీలేదు. వారసులు కాదంటే పార్టీల్లో ఛక్రం తిప్పే ముఖ్యనేతల బంధువులు అదీకాదంటే వారి సామాజిక వర్గానికి ప్రాధాన్యత లభిస్తోంది. జరిగేది ఏ ఎన్నికనేదీ పక్కన పెడితే వారసులకు తొలిప్రాధాన్యత లభిస్తోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీలు వీటికి ప్రాధాన్యతనిస్తున్నాయి. వారసులకు టిక్కెట్లు ఇవ్వడం అదనపు అర్హతగా భావిస్తున్నారు. పార్టీల్లో సుదీర్ఘకాలం కార్యకర్తలుగా, నాయకులుగా పనిచేసిన వారిని కాదని ఈ వారసులకు టిక్కెట్లు లభిస్తున్నాయి. టిక్కెట్ వచ్చే వరకు పార్టీల్లో కనీసం ప్రాథమిక సభ్యత్వం, కార్యకర్తగా లేని వారు ఏకంగా అభ్యర్ధులుగా అవకాశం దక్కించుకోవడం గమనార్హం.
దశాబ్దాల తర్వాత కూడా మార్పు లేదు
స్వాతంత్రత్యం పూర్వం తొలి నాళ్ళల్లో నాడు అవకాశాలు అందిపుచ్చుకోలేని పరిస్థితుల్లో కొందరికే రాజకీయ రంగం పరిమితమైంది. ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతరత్రా ప్రజాప్రతినిధులుగా ధనవంతులు, పలుకుబడి ఉన్న వారు, ఇంకా చెప్పాలంటే ఉన్నతకులాలకు చెందిన వారు మాత్రమే ఎన్నికల రంగంలో నిలిచేవారూ.ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేవారు. కానీ, దశాబ్దాల తర్వాత కూడా ఈ పరిస్థితుల్లో మార్పులేక పోగా వారసత్వం వారికొక అదనపు అర్హతగా మారిపోయింది. కొందరైతే తరాలుగా ఈ వారసత్వరాజకీయాలకు ప్రతినిధులుగా, ప్రజాప్రతినిధులుగా చట్టసభల్లో రాజ్యమేలుతున్నారు. కొన్ని కుటుంబాలకు చెందిన వారు వాటికోసమే పుట్టినట్లు చెబుతుంటారు. సరాసరి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రధాన ప్రజాప్రతినిధులుగా దిగిపోయి ఎన్నికవుతున్నారు. విచిత్రమేమిటంటే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో బీసీలు, మహిళా రిజర్వేషన్లలో కూడా ఇతే పరంపర సాగుతోంది. తాము కాదంటే తమ వారసులను ఎన్నికల్లో పోటీకిపెడుతున్నారు.
17 స్థానాలే అయినా `పద్ధతి’ తప్పలేదు
రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో కూడా పద్ధతి తప్పలేదన్నట్లూ వారసులు, బంధువులు, ఒకే సామాజికవర్గానికి పెద్ద పీట వేశారు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీలు వారసత్వరాజకీయాల్లో పోటీపడుతున్నారు.
వరంగల్ నుంచి కడియం కావ్య
ఎస్సీ రిజర్వుడు స్థానంగా ఉన్న వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా కాంగ్రెస్ నుంచి డాక్టర్ కడియం కావ్యను ఎంపిక చేశారు. కావ్య రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నేతగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి కుమార్తెగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తోంది.గత కొన్నేళ్ళుక్రితం నుంచి కావ్యను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు శ్రీహరి ప్రయత్నిస్తుండగా తాజా పార్లమెంట్ ఎన్నికలతో సాధ్యమైంది. గమ్మత్తేమిటంటే కడియం కావ్యను కాంగ్రెస్ కంటే ముందు బీఆరెస్ కూడా ఎంపీ అభ్యర్ధిగా ఎంపిక చేయడం.
ఖమ్మం నుంచి రామసహాయం రఘురామిరెడ్డి
జనరల్ స్థానంగా ఉన్న ఖమ్మం ఎంపీ అభ్యర్ధిగా రామసహాయం రఘురామిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఈ అభ్యర్ధి ఎంపిక కోసం ఎక్కడలేని కసరత్తు చేసినట్లు ప్రచారం సాగింది. తీవ్ర పోటీ మధ్య రఘురామిరెడ్డి అభ్యర్ధిగా బరిలో నిలిచారు. రఘరామిరెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి రాజకీయ వారసుడిగా రంగంలోకి వచ్చారు. సురేందర్ రెడ్డి దాదాపు రెండు దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రఘురామిరెడ్డికి పార్టీలో కనీస ప్రాతినిధ్యం లేదు. అయినా ఏకంగా అభ్యర్ధి అయ్యారు. ఇదే స్థానం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భార్య నందినీ, మంత్రి తుమ్మల కుమారుడు యుగంధర్, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి వారసులుగా ఎంపీ టికెట్ ప్రయత్నించడం గమనార్హం.
మానుకోటలో నుంచి మాలోత్ కవిత
ఎస్టీ రిజర్వుడు స్థానంగా ఉన్న మానుకోట నుంచి బీఆరెస్ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాలోత్ కవిత మరోసారి పోటీచేస్తోంది. 2009 అసెంబ్లీ ఎన్నికల్లోనే కవిత మానుకోట ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి రాజకీయ రంగప్రవేశం చేశారు. సీనియర్ నేతగా ఉన్న డిఎస్ రెడ్యానాయక్ కుమార్తెగా రాజకీయాల్లోకి వచ్చారు.
నల్లగొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి
జనరల్ స్థానంగా ఉన్న నల్లగొండ ఎంపీ స్థానం నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ క్యాండిడేట్ గా పోటీలో ఉన్నారు. రఘువీర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డి కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. మరోకుమారుడు జయవీర్ రెడ్డి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా అవకాశం దక్కించుకుని గెలుపొందారు. ఓటమిపాలైన బీఆరెస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కూడా తన తండ్రి నోముల నర్సింహయ్య రాజకీయ వారసుడిగా ముందుకు వచ్చారు. బీఆరెస్ నుంచి పోటీచేస్తున్న ఎంపీ అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డి మొన్నటి ఎన్నికల్లో నల్లగొండ ఎమ్మెల్యేగా ఓటమిపాలైన కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కావడం గమనార్హం.
పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ
ఎస్సీ రిజర్వుడు స్థానమైన పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన గడ్డం వంశీకృష్ణ తండ్రి గడ్డం వివేక్ మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు. పెద్దనాన్న గడ్డం వినోద్ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరిద్ధరు గడ్డం వెంకటస్వామి కాకా వారసులుగా రాజకీయరంగంలోకి వచ్చారు. ఇప్పుడు కాకా మనవడు కూడా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతకు ముందు పనిచేసిందేమీలేదు.
కరీంనగర్ నుంచి వెలిశాల రాజేందర్
జనరల్ స్థానమైన కరీంనగర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా వెలిచాల రాజేందర్ రావు పోటీచేస్తున్నారు. రాజేందర్ రావు తన తండ్రి వెలిశాల జగపతిరావు రాజకీయ వారసుడిగా బరిలో నిలిచారు. ఆయన అంతకు ముందు పార్టీలో ప్రాథమిక సభ్యుడు కాదు. తీవ్రమైన పోటీలో ఆయనకు ఈ అవకాశం లభించింది.
నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్
జనరల్ స్థానమైన నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్ సిట్టింగ్ ఎంపీగా బీజేపీ నుంచి మరోసారి పోటీచేస్తున్నారు. అర్వింద్ తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ రాజకీయ వారసునిగా వచ్చినప్పటికీ బీజేపీలో అవకాశం దక్కింది. శ్రీనివాస్ రాష్ట్రంలో కాంగ్రెస్ సీనియర్ నేతగా పేరొందారు. తర్వాత బీఆరెస్ లో చేరారు.
మహబూబ్ నగర్ నుంచి డికే అరుణ
జనరల్ స్థానమైన మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీగా పోటీచేస్తున్న డికే అరుణ తన తండ్రి నర్సిరెడ్డి, భర్త డికే భరత్ సింహారెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ లో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. అరుణ బావ సమరసింహారెడ్డి కూడా రాజకీయాల్లో సీనియర్ నేతగా మంత్రి కొనసాగారు. అరుణ తండ్రి చిట్టెం నర్సిరెడ్డి ఎమ్మెల్యేగా పనిచేశారు.
నాగర్ కర్నూల్లో మల్లు రవి, భరత్
ఎస్సీ రిజర్వుడు స్థానమైన నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్ధులుగా పోటీపడుతున్న కాంగ్రెస్ అభ్యర్ధి మల్లు రవి తన తండ్రి మల్లు అనంతరాములు వారసునిగా రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీ అభ్యర్ధి భరత్ తన తండ్రి మాజీ బీఆరెస్ ఎంపీ రాములు రాజకీయ వారసునిగా బరిలో నిలిచారు.
మల్కాజీగిరి నుంచి పట్నం సునీతారెడ్డి
జనరల్ స్థానమైన మల్కాజీగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేస్తున్న పట్నం సునీతారెడ్డి తన భర్త బీఆరెస్ మాజీ మంత్రి మహేందర్ రెడ్డి రాజకీయ వారసురాలిగా ఉన్నారు. జడ్పీ చైర్ పర్సన్ గా బీఆరెస్ నుంచి ఎన్నికయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్నారు.
చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్ స్థానంగా ఉన్న చేవెళ్ళ నుంచి బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న బీఆరెస్ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత తాత కొండా రంగారెడ్డి రాజకీయవారసునిగా రంగంలోకి వచ్చారు.
హైదరాబాద్ నుంచి అసదుద్దీన్
హైదరాబాద్ నుంచి పోటీచేస్తున్న ఎంఐఎం అధ్యక్షునిగా, సీనియర్ ఎంపీగా అసదుద్దీన్ ఒవైసీ కూడా సలావుద్దీన్ ఓవైసీ వారసునిగా రాజకీయాల్లోకి వచ్చారు. అసదుద్దీన్ సోదరుడు అక్బరుద్దీన్ సైతం ఎమ్మెల్యేగా ఉన్నారు.