కాంగ్రెస్ మహమ్మారిని తరిమికొట్టండి: జగదీశ్ రెడ్డి

– నాకు ఓటేసిన ప్రజలు గర్వపడేలా అభివృద్ధి
– సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
విధాత, సూర్యాపేట: కాంగ్రెస్ మహమ్మారిని తరిమికొట్టాలని, ఓటు వేసిన వాళ్ళు గర్వపడేలా సూర్యాపేట నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
సూర్యాపేటలో ఆదివారం ఉదయం నుండి ఆర్యవైశ్య, పద్మశాలి, ముదిరాజ్ కులస్థుల ఆత్మీయ సమ్మేళనాలకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. ఎవరికి వేసిన ఓటుతో లాభం జరిగిందో.. ప్రజలు ఆలోచించాలని కోరారు. ఎన్నికలవేళ 2014కు ముందున్న పరిస్థితులు, బెదిరింపులు మరోసారి పునరావృతం అవుతున్నాయన్న మంత్రి, కాంగ్రెస్ మహమ్మారిని తరిమికొట్టాలన్నారు. ప్రస్తుతం సూర్యాపేటలో జరిగిన అభివృద్ధిని 2014లోనే తాను ఊహించానని, భవిష్యత్తులోనూ స్పష్టమైన విజన్ తో సూర్యాపేటను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు ఆధునిక వసతుల కల్పనే లక్ష్యంగా పాలన సాగిస్తున్నానన్నారు.
మరోసారి ఆశీర్వదిస్తే నల్లచెరువును నెక్లెస్ రోడ్డుగా అభివృద్ధి చేయడంతో పాటు, పుల్లారెడ్డి చెరువును కూడా సర్వాంగ సుందరంగా ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు. పదివేల మంది యువతీ యువకులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక హబ్ ఏర్పాటు చేస్తానన్నారు. శాశ్వత ఐటీ టవర్లను నిర్మించి, నాలుగు వేల ఉద్యోగాలకు ఐటీ హబ్ ను విస్తరిస్తానని హామీ ఇచ్చారు. మూడోసారి ఆశీర్వదిస్తే.. సూర్యాపేటను దేశంలోనే నంబర్ వన్ గా నిలిచేలా అభివృద్ధి చేస్తానని మంత్రి అన్నారు.