సంక్షేమంలో దళారీలను తీసుకురానున్న కాంగ్రెస్

సంక్షేమ పథకాల అమలులో దళారీ వ్యవస్థను తీసుకొచ్చే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆరోపించారు

సంక్షేమంలో దళారీలను తీసుకురానున్న కాంగ్రెస్

– ప్రజాపాలన దరఖాస్తులపై కానరాని స్పష్టత

– పార్లమెంట్ ఎన్నికల్లో బీఆరెస్ సత్తా చాటుతాం

– మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి

విధాత: సంక్షేమ పథకాల అమలులో దళారీ వ్యవస్థను తీసుకొచ్చే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలసి జగదీశ్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ప్రజాపాలన పేరిట దరఖాస్తుల స్వీకరణ నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ స్పష్టత ఇవ్వలేదన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఉత్సాహంగా జరిగిందన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజవర్గం నుంచి పన్నెండు మంది చొప్పున మాట్లాడారని, పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలనే ధీమా కార్యకర్తల్లో కనిపించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ లోపాలను ఎండగట్టాల్సిందేనని కార్యకర్తలు పట్టుదలతో ఉన్నారన్నారు. కేసీఆర్ హయాంలో సంక్షేమానికి ఇన్ని అడ్డంకులు లేవని చెప్పారు. విలువైన సూచనలు, సలహాలు పార్టీకి వచ్చాయని, అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లల్లో అందించిన కేసీఆర్ సీఎంగా లేకపోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు.


కాంగ్రెస్ ను గెలిపించడానికి బీజేపీ చేసిన కుట్రను కూడా కార్యకర్తలు ప్రస్తావించారు. ప్రజలు ఇపుడు ఆలోచనలో పడ్డారని, కాంగ్రెస్ ప్రభుత్వం తన దివాళాకోరు తనాన్ని వివిధ సందర్భాల్లో ప్రదర్శించిందన్నారు. కేసీఆర్ కూడా కొంతమంది కార్యకర్తలతో ఫోన్ లో మాట్లాడుతున్నారని, ప్రజలు కోరుకున్న రీతిలో బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. ప్రజల ఆకాంక్షలు బీఆరెస్ కు ముఖ్యమని, పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు తీసుకురావడానికి గట్టిగా కష్టపడతామని జగదీశ్ రెడ్డి చెప్పారు. ప్రోటో కాల్ ఉల్లంఘనలను కూడా కార్యకర్తలు సమావేశంలో లేవనెత్తారని, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ దాడులను సమావేశం తీవ్రంగా పరిగణించిందన్నారు. తప్పుడు కేసుల భాదితులకు పార్టీ అండగా ఉంటుందని, తెలంగాణ హక్కుల సాధనలో రాజీపడబోమని స్పష్టం చేశారు. పార్లమెంటు అభ్యర్థులపై ఈ సమావేశంలో చర్చ సాగలేదన్నారు. అభ్యర్థులను కేసీఆర్ చర్చించి నిర్ణయిస్తారని చెప్పారు. ఎంపీ లింగయ్య యాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎంపీలుగా మేం పార్లమెంటులో విభజన సమస్యలపై కొట్లాడామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ సమస్యలపై ఎపుడూ మాట్లాడలేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ కే ఉందని అన్నారు.