బీఆరెస్‌లో చేరిన జిట్టా..మామిళ్ల..కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్
యువజన సంఘాల రాష్ట్ర నాయకులు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్‌జీవోస్ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌లు బీఆరెస్‌లో చేరారు

విధాత : యువజన సంఘాల రాష్ట్ర నాయకులు, భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, టీఎన్‌జీవోస్ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌లు శుక్రవారం బీఆరెస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వారికి గులాబీ కండువ కప్పిన బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బీఆరెస్‌లోకి జిట్టా బాలకృష్ణారెడ్డికి పునరాగమనత దారితప్పిన కొడుకు తిరిగి ఇంటికి చేరినట్లుగా ఉందంటూ అభివర్ణించారు. ఉద్యమకారులంతా సొంత గూటికి చేరుతుండటం ఆనందంగా ఉందన్నారు.

అందరం కలిసి కష్టపడి సాధించిన తెలంగాణను కాపాడుకుందామన్నారు. టీఎన్జీవోస్ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, తెలంగాణ ఉద్యమకాలం నుంచి కూడా టీఎన్జీవోస్ బీఆరెస్‌కు మద్దతును, సమర్ధవంతమైన నాయకత్వాన్ని అందిస్తుందన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలు, నాయకులు, ఉద్యమకారులను అమరులుగా చేసిన వారే ఈరోజున తెలంగాణ సాధకుడైన సీఎం కేసీఆర్‌ను గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ధకు రావాలంటూ సవాల్ చేస్తున్న తీరు చూసి నవ్వాలో ఏడ్వాలో అర్ధం కావడం లేదన్నారు. మరోసారి తెలంగాణ అస్థిత్వం మీద దాడి జరుగుతుందని, ఎన్నికల వేళ అంతా కలిసి పనిచేస్తే బీఆరెస్‌కు తిరుగుండదన్నారు.