కరీంనగర్ గ్రానైట్పైకి మళ్లీ ఈడీ?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ కంపెనీల అక్రమ వ్యాపారం జోరుగా జరుగుతోందని, వసూలు అయిన సొమ్ములను ఏం చేస్తున్నారంటూ స్వయంగా కేంద్ర మంత్రి ప్రశ్నించారంటే ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విధాత): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ కంపెనీల అక్రమ వ్యాపారం జోరుగా జరుగుతోందని, వసూలు అయిన సొమ్ములను ఏం చేస్తున్నారంటూ స్వయంగా కేంద్ర మంత్రి ప్రశ్నించారంటే ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇటీవల జిల్లాలోని గ్రానైట్ కటింగ్ కంపెనీల యజమానుల బృందం ఆయనను కలిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సభ్యత్వం పేరుతో ప్రతి ఒక్క కంపెనీ నుంచి రూ.10 లక్షలు మొదలు రూ.50 లక్షల వరకు వసూలు చేస్తున్నారని, కోట్ల రూపాయలు సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తున్నదని నిలదీశారు. గత ఇరవై సంవత్సరాలుగా వసూలు చేసిన సొమ్ములను బీఆర్ఎస్కు చందా రూపంలో ఇస్తున్నారన్న బండి.. ‘నాకు అన్నీ తెలుసు’ అని మండిపడ్డంతో వ్యాపారులు ఏమీ మాట్లాడలేకపోయారు. ‘త్వరలోనే మీ సంగతి, మీ డబ్బుల సంగతీ తేల్చుతా’ అంటూ హెచ్చరించారని అంటున్నారు. సంజయ్ ఆగ్రహంతో ఏం జరుగుతుందో ఏమోనంటూ గ్రానైట్ వ్యాపారులు ఆందోళనలో ఉన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే రూ.750 కోట్ల ఎగవేత
మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు చెందిన ఆరు కంపెనీలపై దాడులు నిర్వహించిన ఈడీ.. ఎగుమతుల్లో హవాలాను బయటపెట్టింది. 2022 నవంబర్ నెలలో ఈడీ కరీంనగర్, హైదరాబాద్‌లో తనిఖీలు నిర్వహించి రికార్డులు స్వాధీనం చేసుకోవడంతో పాటు రూ.1.08 కోట్లు సీజ్ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013 సంవత్సరంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు.. గ్రానైట్ వ్యాపారుల అక్రమ దందా, హవాలా వ్యాపారంపై విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. పన్ను ఎగవేత, పెనాల్టీ మొత్తం చెల్లించనందుకు రూ.750 కోట్లు జరిమానా విధించారు. ఈ నివేదిక ఆధారంగానే తాము కరీంనగర్లో దర్యాప్తు చేస్తున్నామని ఈడీ ప్రకటించింది. శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్, శ్రీ వేంకటేశ్వర గ్రానైట్స్, పీఎస్ఆర్ గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీస్ విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయని తెలిపింది. చైనా, హాంకాంగ్, సింగపూర్ దేశాలతో పాటు మరికొన్ని దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తున్నారు. రికార్డుల్లో తక్కువ మెటీరియల్ చూపించి, ఎక్కువ పరిమాణంలో తరలిస్తున్నారు. ఫెమా నిబంధనలు పాటించలేదని, ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ కూడా ఎగవేస్తున్నారని ఈడీ స్పష్టం చేసింది.
ఈడీకి మహేందర్ రెడ్డి, బండి సంజయ్ ఫిర్యాదు
జిల్లాలో గ్రానైట్ అక్రమాలపై న్యాయవాది భేతి మహేందర్ రెడ్డి 2021 సంవత్సరంలో ఈడీకి ఫిర్యాదు చేశారు. అప్పటి ఎంపీ, ప్రస్తుత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఫిర్యాదు చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఈడీ రంగంలోకి దిగి పోర్టులకు లేఖలు రాసి కీలక సమాచారం సేకరించింది. తెలంగాణలో మొత్తం 17 ప్రాంతాల్లో మైనింగ్ సాగుతుండగా, ఎక్కువగా కరీంనగర్‌లోనే ఉన్నాయి. ఇక్కడి ఓద్యారం, మానకొండూరు, సుల్తానాబాద్, ములంగూరు, కత్వాల లో మైనింగ్ నడుస్తోంది. ఇదిలా ఉండగా 2022 లో బీజీపీ నాయకుడు పేరాల శేఖర్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. 2022 నవంబర్ నెలలో ఐటీ, ఈడీ సంయుక్తంగా అప్పటి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ నివాసంతో పాటు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. ఈయన బంధువులతో పాటు గ్రానైట్ వ్యాపారులపై 22 బృందాలు తనిఖీలు చేశాయి. 2011 నుంచి 2021 వరకు వే బిల్లులు, ఇన్వాయిస్లు సరిగ్గా తనిఖీ చేయకుండా గ్రానైట్స్ ను ఎగుమతి చేశారని, ఇందులో అధికారులు కుమ్మక్కయ్యారని ఈడీ, ఐటీ అధికారులు నిర్థారణకు వచ్చారు.
బెదురు లేకుండా వ్యాపారం
తప్పులు చేశారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చినా, ఐటీ, ఈడీ సంయుక్తంగా సోదాలు నిర్వహించినా గ్రానైట్ దందా చేసేవారు ఏమాత్రం బెదరడం లేదని అర్థమవుతున్నది. రెండు ఐదు రోజుల క్రితం కరీంనగర్ గ్రానైట్ వ్యాపారులు హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను కలవడానికి వెళ్లారు. వారిని చూడగానే ఆగ్రహానికి లోనయిన సంజయ్, ఇరవై సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీకి దోచి పెడుతున్నారని, ఇంకెన్నాళ్లు ఇస్తారని ప్రశ్నించారు. మీలో కొందరు వ్యాపారాలను కాపాడుకునేందుకు రాజకీయాలను వాడుకుంటుండగా, మరికొందరు మాత్రం రాజకీయ నాయకుల వలే వ్యాపారాలను విస్తరించుకుంటూ ఆ సొమ్ములతో మాలాంటి నాయకులను ఓడగొట్టేందుకు యత్నించారని సంజయ్ వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వినాయక చవితి సందర్భంగా మండపాల వద్ద ఏమైనా ఏర్పాట్లు చేశారా, సమాజానికి ఏమైనా సేవ చేస్తున్నారా అంటే అదీ లేదు. ఏ పని చేయనప్పుడు వసూలు చేసిన సొమ్ములు ఏం చేశారంటూ ఝలక్ ఇస్తూ, ఆ లెక్కలన్నీ త్వరలోనే బయటకు తీస్తానంటూ హెచ్చరించడంతో వ్యాపారులు కంగుతిన్నారని సమాచారం. మళ్లీ ఐటీ, ఈడీ దాడులు తప్పవనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నట్లు వ్యాపారవర్గాల్లో చర్చ జరుగుతోంది.