నిరుద్యోగ తెలంగాణగా మార్చిన కేసీఆర్ స‌ర్కారు

నిరుద్యోగ తెలంగాణగా మార్చిన కేసీఆర్ స‌ర్కారు
  • ఉద్యోగాలు ఇచ్చామ‌ని చెపుతున్నకేటీఆర్‌
  • ఆర్ట్స్ కాలేజి వ‌ద్ద బ‌హిరంగ చ‌ర్చ‌కు రా
  • స‌వాల్ విసిరిన వంశీ చంద‌ర్‌రెడ్డి, చామ‌ల కిర‌ణ్ కుమార్‌రెడ్డి, రియాజ్‌


విధాత‌, హైద‌రాబాద్‌: తెలంగాణ‌లో యువ‌త‌కు ఉద్యోగాలు ఇచ్చామ‌ని చెపుతున్న మంత్రి కేటీఆర్ ఉస్మానియా యూనివ‌ర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వ‌ద్ద‌కు బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని కాంగ్రెస్ నాయ‌కులు వంశీ చంద‌ర్‌రెడ్డి, చామ‌ల కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, రియాజ్‌లు స‌వాల్ విసిరారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఓయూ రావాల‌ని స‌వాల్ విసిరిన కాంగ్రెస్ నేత‌లు ఆ స‌మ‌యానికి ఓయ క్యాంప‌స్‌లోని ఆర్ట్స్ కాలేజీ వ‌ద్ద‌కు వెళి, మంత్రి కేటీఆర్ కోసం వెయిట్ చేశారు. మంత్రి రాక‌పోవ‌డంతో తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు.


ఉద్యోగాలు ఇవ్వ‌లేదు కాబ‌ట్టే నిరుద్యోగుల‌కు స‌మాధానం చెప్ప‌లేక యూనివ‌ర్సిటీకి రాలేద‌ని ఆరోపించారు. దీనికి ముందుగా వంశీచంద‌ర్‌రెడ్డి గాంధీ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ప్ర‌భుత్వం నిరుద్యోగ తెలంగాణ మార్చిందన్నారు. 15.1శాతం నిరుద్యోగ రేట్ గా తెలంగాణ పరిస్థితి నెలకొందని, కేసీఆర్, కేటీఆర్ కు నిరుద్యోగుల పట్ల ఉన్నచిత్తశుద్ధికి ఇది నిదర్శనమ‌న్నారు. 22 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్పిఎస్సిలో రిజిస్టర్డ్ చేసుకున్నార‌ని తెలిపారు.


తెలంగాణ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమ‌లు చేసిన‌ నిరుద్యోగ ప్రణాళికలను బిఆర్ఎస్ ప్రభుత్వం తుంగలోకి తొక్కిందన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ 65 లక్షల మంది నిరుద్యోగులకు ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధిని దూరం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఏటా జూన్ 2 సెప్టెంబర్ 17 లోపు ఖాళీలను గుర్తించి ఉద్యోగాలు భర్తీ చేస్తుంద‌న్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రతి నెల 4 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామ‌న్నారు. ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్పిఎస్సి ని ప్రక్షాళన చేసి నూతన విధానాలతో నియామక బోర్డు ను ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు.