మాటకు మాట కేటీఆర్ వర్సెస్ జానారెడ్డి
రాహుల్‌గాంధీపై మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలు సంస్కారహీనంగా, అహంభావంతో కూడుకున్నాయని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కె. జనారెడ్డి తప్పుబట్టారు

విధాత : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలు సంస్కారహీనంగా, అహంభావంతో కూడుకున్నాయని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కె. జనారెడ్డి తప్పుబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంస్కారం లేని కేటీఆర్ వంటి వారి గురంచి ఎక్కువ మాట్లాడబోనన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలను విమర్శిస్తున్న కేటీఆర్ బీఆరెస్ గతంలో ఇచ్చిన హామీలు ఎందుకు అముల చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. బీఆరెస్ ఇస్తానన్న మూడెకరాలు దళితులకు ఇచ్చిందా అంటూ నిలదీశారు. యూపీఏ దిగిపోయే నాటికి వైఎస్సార్ హాయంలో ఉచిత కరెంటును కాంగ్రెస్ ఇచ్చిందన్నారు.

పెడింగ్ బిల్లులు రద్దు చేసింది మేమేనని, మేము ఇచ్చిన కరెంట్ నే కదా ఇప్పుడు కొనసాగిస్తున్నారని, అప్పట్లో డబ్బు పెట్టి కొనడానికి కూడా లేని పరిస్థితీ ఉండేదన్నారు. మేము ఇచ్చిన 7-8 గంటలే కదా మీరు ఇస్తున్నదని, కరెంటు ఉత్పత్తికి కృషి చేసింది తామేనన్నారు. వాటిని బీఆరెస్ కొనసాగిస్తుందన్నారు. 60 ఏండ్లు ఏ పదవి లేకుండా స్వాతంత్ర్యం కోసం కొట్లాడింది కాంగ్రెస్ కాదా అని, దేశం కోసం విశాల దృక్పధంతో కాంగ్రెస్ పనిచేస్తుందన్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదా..? ఇప్పటి వరకు సాధించిన ప్రగతి ఎవరు సాధించారు ..మీరా అని నిలదీశారు. ఉపాధి హామీ, పేదలకు ఆహార భద్రత, అటవీ హక్కులు ఇచ్చింది కాంగ్రెస్ కాదా అని, అటవీ హక్కులు ఇవ్వకపోతే పోడు భూములు వచ్చేవా అని జానారెడ్డి ప్రశ్నించారు.
బీఆరెస్ హయాంలో తలసరి ఆదాయం పెరిగింది అంటున్నారని, 2004 నుండి 14 వరకు 6.5 శాతం పెరిగిందని, బీఆరెస్ 9 ఏండ్ల తలసరి ఆదాయం కంటే మేము చేసింది ఎక్కవేనన్నారు. మోడీ అప్పులు చేశారని విమర్శ చేస్తున్నారని , 5 లక్షల 50 వేళా కోట్ల అప్పు మీరు కూడా చేశారని కేటీఆర్‌ను తప్పుబట్టారు. మేడిగడ్డ పై పూర్తిగా అధ్యయనం చేశాకా మాట్లాడుతానన్నారు. రాష్ట్రంలో బీఆరెస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని, జనం ఆ పార్టీ పాలనను వద్దనుకుంటున్నారన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, ప్రజల ఆకాంక్షలు, ఎన్నికల హామీలు అమలు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు.
- జానారెడ్డి సంస్కారం మాటలు ఎదుటి పార్టీకేనా: మంత్రి కేటీఆర్
- వచ్చేది బీఆరెస్ ప్రభుత్వమే
నాకు సంస్కారం లేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కె.జానారెడ్డి చేసిన విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని, జానారెడ్డి సంస్కారం మాటలు ఎదుటి పార్టీవారికే వర్తిస్తాయా అని మంత్రి కేటీఆర్ కౌంటర్ వేశారు. మీడియాతో మాట్లాడుతూ సంస్కారం గురించి కాంగ్రెస్ నేతల దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదన్నారు. జానారెడ్డి ముందుగా సంస్కారాన్ని వాళ్ల పీసీసీ ప్రెసిడెంట్‌కు నేర్పించాలని సూచించారు.
గతంలో కేసీఆర్‌కు కాంగ్రెస్ నేతలు పిండం పెడుతామని, రాళ్లతో కొట్టాలని అభ్యంతరకరంగా విమర్శలు చేసినప్పుడు జానారెడ్డి సంస్కారం ఎక్కడికిపోయిందన్నారు. టికెట్ల కోసం 50కోట్లను వసూలు చేస్తున్నాడని రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ నేతలే ఈడీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు. ప్రజల మూడ్ ఈ దఫా మరోసారి బీఆరెస్‌ను గెలిపించే దిశగా ఉందన్నారు. గతంలో కంటే ఎక్కువ సీట్లతో బీఆరెస్ గెలుస్తుందన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి కిషన్‌రెడ్డి భయపడుతున్నారని, అసలు కాంగ్రెస్, బీజేపీలకు పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారన్నారు.