అన్నం పెట్టే తల్లికి సున్నం పెట్టే వాడు ‘చిరుమర్తి’

– ప్రజాదరణ లేకనే అడ్డగోలు వ్యాఖ్యలు
– కేసీఆర్.. దమ్ముంటే నకిరేకల్ లో గెలిపించుకో
– వీరేశం గెలుపును ఎవరూ అడ్డుకోలేరు
– నార్కెట్‌పల్లి ఎన్నికల సభలో రాజగోపాల్ రెడ్డి
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: అన్నం పెట్టిన తల్లికి సున్నం పెట్టే వ్యక్తి చిరుమర్తి లింగయ్య అని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. నకిరేకల్ నియోజకవర్గంలో ప్రజల ఆదరాభిమానాలు కోల్పోయి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని అన్నారు. శుక్రవారం నార్కెట్‌పల్లి మండలకేంద్రంలో నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వీరేశం గెలుపు కోసం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే చిరుమర్తి లింగయ్యను గెలిపించుకోవాలని సవాల్ విసిరారు. నకిరేకల్ లో కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి ఎమ్మెల్యే గా గెలిపిస్తే లింగయ్య మోసం చేశాడన్నారు.
నేను కాంగ్రెస్ లో చేరకముందే వీరేశంకు టిక్కెట్ ఇప్పించానని తెలిపారు. వీరేశం కు నకిరేకల్ లో టిక్కెట్ డిక్లేర్ అయిన రోజే గెలుపు ఖాయమైందన్నారు. వీరేశం పులి అయితే బీఆర్ఎస్ అభ్యర్థి పాముగా అభివర్ణించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేట్ కూడ తాకనీయనన్నారు. వీరేశం లేకపోతే జగదీష్ రెడ్డి ఎక్కడ ఉండన్నారు. వీరేశం రాకతో కాంగ్రెస్ పార్టీకి సూర్యాపేట, తుంగతుర్తిలో మరింత బలం వచ్చిందన్న ఆయన, కేసీఆర్ ను గద్దెదింపాలి.. వారి ఆహంకారం పోవాలని వ్యాఖ్యానించారు. వీరేశంను భారీ మైజారిటీతో గెలిపించాలని కోరారు. సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీమ్ లను ప్రతిఒక్కరికి వివరించాలన్నారు. కార్యక్రమంలో నగరికల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.