మీ హామీల సంగతి చూసుకోండి ! బీఆరెస్‌ను బొంద పెట్టడం తర్వాతా చూసుకుందాం..!!

సీఎం రేవంత్ రెడ్డి బీఆరెస్‌ను వంద మీటర్ల లోపు బొంద పెట్టేది తర్వాతా చూసుకుందామని, ముందుగా

మీ హామీల సంగతి చూసుకోండి ! బీఆరెస్‌ను బొంద పెట్టడం తర్వాతా చూసుకుందాం..!!
  • బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 
  • జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దు
  • బిల్లుల ప్రతులు సోనియాగాంధీకి పంపండి
  • అదానీ – రేవంత్‌ల ఒప్పందాలు లోగుట్టు బహిర్గతం చేయాలి
  • హామీల అమలుకు కాంగ్రెస్‌ను వెంటాడుతాం
  • బీజేపీని నిలువరించడం బీఆరెస్‌కే సాధ్యం
  • రేవంత్ కాంగ్రెస్ ఏక్‌నాథ్ షిండేగా మారుతాడు
  • సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కీలక వ్యాఖ్యలు

విధాత : సీఎం రేవంత్ రెడ్డి బీఆరెస్‌ను వంద మీటర్ల లోపు బొంద పెట్టేది తర్వాతా చూసుకుందామని, ముందుగా మీరు ప్రజలకిచ్చిన ఎన్నికల హామీల అమలు సంగతి చూసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హితవు పలికారు. శనివారం తెలంగాణ భవన్‌లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ లండన్‌లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. తెలంగాణ జెండాను ఎందుకు బొంద పెడుతావని తెలంగాణ తెచ్చినందుకా..తెలంగాణను డెవలప్ చేసినందుకా.. మిమ్మలను, మీ దొంగ హమీలను ప్రశ్నిస్తున్నందుకా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. అంతర్జాతీయ వేదికలపై సీఎం హోదాను మరిచి బీఆరెస్‌ను వంద మీటర్ల లోపల బొంద పెడుతామంటూ రాజకీయ ఉపన్యాసాలిచ్చిన రేవంత్ రెడ్డి తీరు గర్హనీయమన్నారు. అహంకారంతో మాట్లాడే రేవంత్ రెడ్డి వంటి నాయకులను బీఆరెస్‌ పార్టీ తన ప్రస్థానంలో వేల మందిని చూసిందన్నారు. మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అని మీలాంటోళ్లు చాలామంది నీలిగినా రెండున్నర దశాబ్దాలుగా బీఆరెస్‌ పార్టీ నిలబడి, నీలాంటి వాళ్ళను మట్టికరిపించిందన్నారు.



 

కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల తర్వతా కలిసిపోతాయని, రేవంత్ కాంగ్రెస్ ఎక్ నాథ్ షిండేగా మారతాడన్నారు. రేవంత్ రక్తం అంతా బీజేపీదేనని, ఇక్కడ చోటా మోడీగా రేవంత్ రెడ్డి మారిండన్నారు. గతంలో అదాని గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు ఆదాని కోసం వెంటపడుతున్నాడన్నారు. స్విట్జర్లాండ్‌లో రేవంత్ రెడ్డి అదానితో అలైబలై చేసుకున్నాడన్నారు. అదాని రేవంత్ రెడ్డి ఒప్పందాల అసలు, లొగుట్టు బయటపెట్టాలన్నారు. రాహుల్ గాంధీ ఏమో అదానీ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఆదాని కోసం అర్రులు చాస్తుండటం వెనుక మతలబు ఏమిటన్నారు. డబుల్ ఇంజన్ అంటే అదానీ, ప్రధాని అన్న రేవంత్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజన్ గా మారిండని ఎద్దేవా చేశారు. 

ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దు

ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టవద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చే దాకా బిల్లులు కట్టొద్దన్నారు. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్లుగానే ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలన్నారు. కరెంటు బిల్లులు అడిగితే అధికారులకు రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలను చూపించాలన్నారు. సోనియా గాంధీ బిల్లు కడుతుందని సీఎం ఎన్నికల్లో చెప్పిండని, కరెంటు బిల్లు ప్రతులను సోనియా గాంధీ ఇంటికి, 10జన్ పథ్‌కు పంపించాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రతి ఒక్క మీటర్‌కు గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు అందించాలన్నారు. ఇందులో కిరాయి ఇండ్లలో ఉండే వాళ్ళకి కూడా ఉచిత విద్యుత్తు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

హామీల అమలుకు కాంగ్రెస్‌ను వెంటాడుతాం

ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను తప్పించుకోవడానికి కాంగ్రెస్ చూస్తే వదిలిపెట్టే పరిస్థితి లేదన్నారు. మహాలక్ష్మి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క మహిళకు 2500 వెంటనే ఇవ్వాలన్నారు. కేవలం 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్ల నుంచి మొదలుకొని అనేకమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చిందన్నారు. రైతన్నలకు రైతుబంధు అందడం లేదన్నారు. మహిళలకు మహాలక్ష్మి నగదు సహాయం అందడం లేదన్నారు. వృద్ధులకు పెంచే పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు 420 హామీలు అని ప్రజలకు కేడర్ గుర్తు చేయాలన్నారు. వివిధ డిక్లరేషన్ల పేరుతో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేసేదాకా వెంటాడుతామన్నారు. 

బీజేపీని నిలువరించడం బీఆరెస్‌కే సాధ్యం

రాష్ట్రంలో బీజేపిని అడ్డుకున్నది ముమ్మాటికి బీఆరెస్‌ పార్టీనే అన్నారు. బీఆరెస్‌ పార్టీ వల్లనే బీజేపీ సీనియర్ నాయకులు హైదరాబాద్ నగరంలోని పలు నియోజకవర్గాల్లో పోటీకి వెనుకంజ వేశారన్నారు. బీజేపీతో బీఆరెస్‌కు ఏరోజు పొత్తు లేదని, భవిష్యత్తులోనూ ఉండదన్నారు. కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి సికింద్రాబాద్‌కు గత 5 ఏండ్లలో ఏం చేసిండో చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ది లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కడితే, కిషన్ రెడ్డి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ లో లిఫ్టులనలు జాతికి అకింతం చేసేందుకే పరిమితమయ్యారన్నారు. ఇదే అయన చేసిన అతిపెద్ద పని అన్నారు. బీఆరెస్ కేసీఆర్ సారధ్యంలో 36 ప్లైఒర్లు కడితే, ఉప్పల్, అంబర్ పేట ప్లై ఒవర్లు సంవత్సరాలైనా కట్టలేక కేంద్ర పాలకులు చేతులెత్తెశారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే అని గుర్తుంచుకోవాలన్నారు. ఓడినా గెలిచినా బీఆరెస్‌ పార్టీ ఎప్పుడూ ప్రజాపక్షమేనన్నారు. కేసీఆర్ గారి నాయకత్వానికి అపూర్వమైన మద్దతు ఇచ్చిన హైదరాబాద్ నగర ప్రజలకు, గులాబీ జెండాకు ఎదురులేదని బలమైన సందేశం ఇచ్చిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, దానం నాగేందర్, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు