కోహ్లీ, షమీ మాదిరి సెంచరీ, హ్యాట్రిక్ కొడుదామా..? జూబ్లీహిల్స్‌లో కేటీఆర్

వరల్డ్ కప్‌లో కోహ్లీ, షమీ చెలరేగినట్లు మనం కూడా సెంచరీ, హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అజారుద్దీన్‌తో క్రికెట్ ఆడండి.. ఓట్లు మాత్రం మాగంటి గోపీనాథ్‌కు వేయండి అని కేటీఆర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిండు మనం కూడా కొడుదామా..? షమీ హ్యాట్రిక్ తీసిండు.. మనం కూడా హ్యాట్రిక్ కొడుదామా..? వంద శాతం కొడుదామా..? కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ ప్రచారానికి వస్తే క్రికెట్ ఆడండి. పిల్లలతో గల్లీలో జబర్దస్త్ క్రికెట్ ఆడించండి. కానీ ఓట్లు మాత్రం మాగంటి గోపీనాథ్‌కు వేయండి. కరోనా సమయంలో బయటకు రావడానికి మీరంతా భయపడ్డారు. కానీ గోపీనాథ్ గల్లీ గల్లీ తిరిగి పేదవారికి అండగా నిలబడ్డారు. రహ్మత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ అలా ప్రతి డివిజన్‌లో, ప్రతి కాలనీలో సమస్యలు తెలిసిన వాడు మాగంటి గోపినాథ్ అని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం కులం పేరుతో కుంపట్లు పెట్టలేదు. మతం పేరుతో మంటలు పెట్టలేదు. ప్రాంతం పేరుతో పంచాయితీ పెట్టలేదు. ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ, బీహార్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక కేరళ ఎవరైనా కావొచ్చు.. హైదరాబాద్‌లో ఉన్నోళ్లంతా మావారే, మా బిడ్డలే అని చూసుకున్నాం. పదేండ్ల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితి ఏందీ..? ప్రతి అపార్ట్‌మెంట్‌లో ఇన్వర్టర్లు, జనరేటర్లు, షాపుల్లో కరెంట్ ఉండేది కాదు. మళ్లీ ఆ దిక్కుమాలిన రోజులు కావాలా..? కరెంట్ కావాలా..? కాంగ్రెస్ కావాలా..? ఆలోచించండి. పొరపాటున తప్పు చేస్తే ఆ పాత చీకటి రోజులు తిరిగి వస్తాయి. మళ్లీ కరెంట్ కోతలు, కంపెనీల మూతలు, మళ్లీ ఛార్జీల మోతలు తయారైతదని కేటీఆర్ అన్నారు.
కరెంట్ కష్టాలు లేవు.. కంపెనీలు వస్తున్నాయి. సంపద పెరుగుతుంది. ఉపాధి దొరుకుతుంది. హైదరాబాద్‌లో కర్ఫ్యూ, కల్లోలాలు లేవు.. దీంతో కంపెనీలు వస్తున్నాయి. ఈ హైదరాబాద్‌ను కాంగ్రెసోళ్లకు అప్పజెప్తే.. మీకు తెలుసు, ఒక సీఎంను దించేతందుకు, ఇంకో సీఎం ఎక్కేతందుకు ఓల్డ్ సిటీలో మతకల్లోలాలు పెట్టి 400 మందిని చంపినోళ్లు కాంగ్రెసోళ్లు. అలాంటి దిక్కుమాలిన కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వొద్దు. ఆ దరిద్రాన్ని మళ్లీ మన నెత్తిమీదకు తెచ్చుకోవద్దు. బీజేపీ ఎప్పుడో ఎత్తిపోయింది. వాళ్ల పని అయిపోయింది అని కేటీఆర్ స్పష్టం చేశారు.