మతం పేరుతో రాజకీయం చేసే బీజేపీని నమ్మొద్దు: కేటీఆర్

మతం పేరుతో రాజకీయం చేసేవాళ్లను నమ్మొద్దని, వారికి తగిన బుద్ధి చెప్పాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కోన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణంలో బీఆరెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ గెలుపు కోసం ఆయన రోడ్ షో ప్రచారం నిర్వహించారు

మతం పేరుతో రాజకీయం చేసే బీజేపీని నమ్మొద్దు: కేటీఆర్

కాంగ్రెస్ పాలనలో మళ్లీ రైతు, నేతన్నల ఆత్మహత్యలు

విధాత : మతం పేరుతో రాజకీయం చేసేవాళ్లను నమ్మొద్దని, వారికి తగిన బుద్ధి చెప్పాలని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కోన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణంలో బీఆరెస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ గెలుపు కోసం ఆయన రోడ్ షో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సిరిసిల్లలో బీజేపీ ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలన్నారు. ప్రధాని మోదీ వల్ల తెలంగాణకు ఒక్క రూపాయి కూడా లాభం జరుగలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో మరోసారి రైతు, నేత కార్మికుల ఆత్మహత్యలు సాగుతున్నాయన్నారు. బీఆరెస్‌ ప్రభుత్వంలో నేత కార్మికులకు ఉపాధి ఉండేదన్నారు. కాళేశ్వరం, మిడ్‌మానేరు ప్రాజెక్టులను కట్టించిన కేసీఆర్ సాగుతాగునీటి సమస్యలు లేకుండా చూశారన్నారు. ఇంతకు ముందు బ్రిడ్జి కింద నీళ్లు ఉండేవని, కాంగ్రెస్‌ వచ్చింది నీళ్లు లేకుండా పోయాయని విమర్శించారు. కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం బీఆరెస్‌ అభ్యర్థి వినోద్‌ కుమార్‌ను గెలిపించాలని కోరారు. అంతకు ముందు పట్టనంలోని రైతుబజార్‌లో కేటీఆర్‌ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల నిర్మాణంలో తన భూమి తీసుకున్న బీఆరెస్ ప్రభుత్వం తనకు భూమి, ప్లాటు ఇవ్వలేదని బాధిత మహిళ కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు.

ఆమె సమస్య పరిష్కారానికి కలెక్టర్‌తో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. రైతులు, వ్యాపారులు తమ సమస్యలు తెలిపారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ తాము కూర్చుని కూరగాయలు అమ్ముకునేలా షెడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని రైతులు కోరారని చెప్పారు. దీంతో 24 గంటల్లోపు వారికి తాత్కాలిక వసతి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేసీఆర్‌ ఉన్నప్పుడే బాగుందని, కేసీఆర్‌ ప్రభుత్వం పోయిన తర్వాత తమ వాగుల్లో నీళ్లు పోయాయని, ఓ నెల పింఛన్‌ కూడా రాలేదని వాపోయారని తెలిపారు. మళ్లీ కేసీఆర్‌ వస్తేనే పేదలకు బాగుంటుందని అంతా అన్నారని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తమను పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారని, రుణమాఫీ జరగలేదని, రైతుబంధు ఇంకా సరిగా రాలేదని చెప్పినట్లుగా తెలిపారు. వారి స్పందన చూస్తుంటే కరీంనగర్‌ ఎంపీగా బోయినపల్లి వినోద్‌ మంచి మెజార్టీతో గెలుస్తారని నమ్మకముందని చెప్పారు. పార్టీ నేతలు తుల ఉమ, సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కలిసి సిరిసిల్ల పట్టణంలో కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం చేశారు.