క‌రెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా?: కేటీఆర్

క‌రెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా?: కేటీఆర్
  • రైతులు ఆలోచించి ఓటేయాలి
  • 24 గంటల కరెంటు వద్దన్న కాంగ్రెస్‌
  • రైతుల‌ను అవ‌మానిస్తున్న రేవంత్‌
  • ధ‌ర‌ణి, రైతుబంధు రైతుల కోస‌మే
  • రైతులు బాగుప‌డితే కాంగ్రెస్‌కు మంట‌
  • బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

విధాత : కరెంట్ కావాలో, కాంగ్రెస్ కావాలో తెలంగాణ రైతులు ఆలోచన చేసుకోవాలని బీఆరెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సూచించారు. తెలంగాణ భవన్‌లో శ‌నివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు రైతులకు ఉచిత కరెంటు ఎందుకని మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతల తీరుతో రైతులు ఆగమయ్యే పరిస్థితి ఉందని చెప్పారు.


70 లక్షల మంది రైతులను బిచ్చగాళ్లని రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో 9 గంటల కరెంటు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. రాబందుల కాలం పోయిందని, రైతుబంధు రాజ్యం వచ్చిందని చెప్పారు. వ్యవసాయాన్ని బాగు చేసే ప్రయత్నం బీఆరెస్‌ చేసిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. ధరణి, రైతుబంధు తెచ్చింది రైతుల కోసమేనన్నారు.

కాంగ్రెస్ పాలనలో బావికాడ నిద్రపోయిన రోజులు రైతులకు గుర్తు చేసుకోవాలని కోరారు. కోతలు లేని విద్యుత్తు సరఫరా ఉండేదా? అని ఆలోచించుకోవాలన్నారు. రైతులకు మూడు గంటల కరెంటు చాల‌ని కాంగ్రెస్ చెబుతున్న‌ద‌ని, ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు బాగుపడుతుంటే రైతులపై కాంగ్రెస్‌కు ఎందుకు అంత కక్ష అని కేటీఆర్ ప్రశ్నించారు. 24 గంటల కరెంటు వద్దన్న కాంగ్రెస్‌ను ఊరి పొలిమేరల దాకా తరిమికొట్టాలని రైతులకు పిలుపునిచ్చారు.

24 గంటల కోసం కాంగ్రెస్ నాయకులను ప్రతి గ్రామంలో రైతులు నిలదీయాలన్నారు. మోట‌ర్లకు మీటర్లు పెట్టాలంటూ మెడపై ప్రధాని మోదీ కత్తి పెట్టారని, అయినా మీటర్లు పెట్టకుండా కేంద్రం నుంచి వచ్చే 30 వేల కోట్లు వదులుకున్నామని తెలిపారు. పంజాబ్‌కు దీటుగా ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. 

హైద‌రాబాద్‌ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తాం

హైద‌రాబాద్‌ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు బీఆరెస్ ప్రభుత్వం ప్రణాళియుతంగా ముందుకెళుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌ రెసిడెంల్స్ వెల్ఫేర్‌ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

ఉమ్మడి రాష్ట్రంలో తరచూ విద్యుత్తు, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉండేవనని, విద్యుత్తు కోతల‌కు వ్య‌తిరేకంగా, తాగునీటి కోసం నిత్యం నిరసనలు కొనసాగేవని గుర్తు చేశారు. మిషన్ భగీరథ ద్వారా హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశామన్నారు.


నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేస్తున్న‌ ఏకైక రాష్ట్ర తెలంగాణ మాత్రమే అన్నారు. హైదరాబాద్‌లో కాలుష్య రహిత ప్రజా రవాణా అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. నగరంలో 24 గంటల తాగునీటిని అందించాలని, మెట్రో రైల్ వసతిని రాబోయే 10 ఏళ్లలో 415 కిలోమీటర్ల‌కు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని పేర్కొన్నారు.