కాంగ్రెస్ గెలిస్తే ఆర్నెళ్ల‌కో సీఎం.. రాష్ట్రాన్ని ఆగ‌మాగం చేస్తారు

కాంగ్రెస్ గెలిస్తే ఆర్నెళ్ల‌కో సీఎం.. రాష్ట్రాన్ని ఆగ‌మాగం చేస్తారు
  • తెలంగాణ అంటే కాంగ్రెస్‌కు ప‌డ‌దు
  • ఇక్క‌డ కేసీఆర్‌ పోటీ చేస్తున్న‌ట్టే అనుకోండి
  • ల‌క్ష్మీన‌రసింహారావును గెలిపించండి
  • వేముల‌వాడ స‌భ‌లో మంత్రి కేటీఆర్‌

విధాత : ఢిల్లీకి మ‌న జ‌ట్టు ఇస్తే.. ఆరు నెల‌ల‌కు ఒక ముఖ్య‌మంత్రి దిగుతాడ‌ని, రాష్ట్రాన్ని ఆగ‌మాగం చేస్తార‌ని మంత్రి కేటీఆర్ హెచ్చ‌రించారు. ఇక్క‌డ పోటీ చేస్తున్నది ల‌క్ష్మీన‌రసింహారావు కాదు. కేసీఆర్ అనుకోవాల‌ని కోరారు. అలా భావించి ల‌క్ష్మీన‌రసింహారావును గెలిపిస్తే నియోజ‌క‌వ‌ర్గాన్ని తాను ద‌త్త‌త‌కు తీసుకుంటాన‌ని, ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఇద్ద‌రు ఎమ్మెల్యేలు అనుకుని ప‌ని చేయాల‌ని కోరారు. సోమ‌వారం వేముల‌వాడ‌లో నిర్వ‌హించిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. ‘మ‌న తెలంగాణ స్టోరీకి క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌కత్వం మ‌న నాయ‌కుడు, మ‌న ముఖ్య‌మంత్రి కేసీఆర్.

ఇది బ్లాక్ బ‌స్ట‌ర్. అవ‌త‌ల కాంగ్రెస్ సినిమాకు.. క‌న్న‌డ ప్రొడ్యూస‌ర్, ఢిల్లీ డైరెక్ట‌ర్, గుజ‌రాత్ యాక్ట‌ర్. సినిమా అట్ట‌ర్ ప్లాప్ డిజాస్ట‌ర్. రేపు తెలంగాణ‌ను ఎవ‌రూ న‌డ‌పాల‌నేది మోదీ, రాహుల్ కాదు డిసైడ్ చేయాల్సింది.. తెలంగాణ గ‌ల్లీ డిసైడ్ చేయాలి. ఢిల్లీ కాదు. మ‌ళ్లా ఢిల్లీకి మ‌న జుట్టు ఇస్తే ఆరు నెల‌ల‌కు ఒక ముఖ్య‌మంత్రి దిగుత‌డు. ఏదో మాట్లాడి ఆగం చేస్త‌రు. వేముల‌వాడ‌లో పోటీ చేస్తున్న‌ది ల‌క్ష్మీన‌ర‌సింహారావు కాదు.. కేసీఆర్ అనుకోవాలి. మీరు అవ‌త‌లి పార్టీకి ఓటేస్తే.. అది పోయేది ఢిల్లీకి, గుజ‌రాత్‌కు.. ఆ త‌ర్వాత‌ అన్యాయం జ‌రిగేది మ‌న‌కు. వేముల‌వాడ‌కు ఇండ‌స్ట్రీలు తేవాలి అన్నారు. మంచి మెజార్టీతో గెలిపించండి. మీ నియోజ‌క‌వ‌ర్గాన్ని నేను ద‌త్త‌త తీసుకుని అభివృద్ధి చేస్తాను. మీకు ఇద్ద‌రు ఎమ్మెల్యేలు అనుకోని ఈ ఎన్నిక‌ల్లో క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాలి. మెజార్టీ విష‌యంలో సిరిసిల్ల‌తో పోటీ ప‌డాలి’ అని అన్నారు.

సెంచ‌రీ ఖాయం

‘ఆ రోజు సిక్స్ పాయింట్ ఫార్మూలా తుంగ‌లో తొక్కిన ఇందిరాగాంధీ.. మ‌నుమ‌డు రాహుల్ ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడు. ఇక్క‌డికి వ‌చ్చి సిక్స్ గ్యారెంటీలు అంటుండు.. సిక్స్ గ్యారెంటీలు కాదు రాహుల్ గాంధీ. న‌వంబ‌ర్ 30న నిన్ను తెలంగాణ సిక్స్ కొట్టుడు ఖాయం. విరాట్ కోహ్లీ సెంచ‌రీ కొట్టిన‌ట్టు కేసీఆర్ సెంచ‌రీ కొట్టి త‌ప్ప‌కుండా గ‌వ‌ర్న‌మెంట్ ఏర్పాటు చేసుడు కూడా ఖాయం’ అని చెప్పారు.

ఢిల్లీ దొర‌ల‌కు, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య ఎన్నిక‌లు

రాబోయే ఎన్నిక‌లు ఢిల్లీ దొర‌ల‌కు, నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న‌వ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక‌ప్పుడు ఆంధ్ర‌కు ప్ర‌త్యేక రాజ‌ధాని లేక‌పోవ‌డంతో అప్ప‌టికే జోర్దార్‌గా ఉన్న తెలంగాణ‌ను క‌లుపుకొనేందుకు ఏపీ పెద్ద‌లు రాహుల్ ముత్తాత నెహ్రూను ఒప్పించి తెలంగాణ‌లో ఆంధ్రాలో క‌లిపే కుట్ర చేశార‌ని విమ‌ర్శించారు. దానికి వ్య‌తిరేకంగా ఉద్య‌మం జ‌రిగితే కాల్పులు జ‌రిపించార‌ని చెప్పారు. 1968లో తెలంగాణ కావాల్సిందేన‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డితే 370 మంది పిల్ల‌ల్ని పిట్ట‌ల్లా కాల్చిచంపింది ఇందిరాగాంధీ ఢిల్లీ దొర‌సాని అని మండిప‌డ్డారు. తెలంగాణ ప్ర‌జా స‌మితి నాయ‌క‌త్వంలో మ‌ర్రి చెన్నారెడ్డి 11 మంది ఎంపీల‌ను గెలిపిస్తే.. వారిని కాంగ్రెస్‌లో క‌లుపుకొని తెలంగాణ ఆకాంక్ష‌ల‌ను అణ‌గ‌దొక్కార‌ని విమ‌ర్శించారు.

త‌ర్వాత కేసీఆర్ నాయ‌క‌త్వంలో వ‌చ్చిన బీఆరెస్‌.. 14 ఏళ్ల‌పాటు ఉద్య‌మం చేస్తే తెలంగాణ సాకార‌మైంద‌ని చెప్పారు. ‘ఆ స‌మ‌యంలో కాంగ్రెస్‌కు దిక్కు లేదు. తెలంగాణ ఇస్త‌మ‌ని చెప్పి, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు. న‌మ్మి పొత్తు పెట్టుకుంటే.. వంద‌ల మంది ప్రాణాల‌ను తీసుకుంది సోనియ‌మ్మ‌. ఉత్త‌గ‌నే తెలంగాణ రాలేదు. ఇన్ని ప్రాణాలు పోతే, చాలా మంది క‌ష్ట‌ప‌డితే, కేసీఆర్ నిరాహార దీక్ష‌తో తెలంగాణ‌ అట్టుడికితే ప్ర‌త్యేక రాష్ట్రం ఇచ్చారు. ఇవ్వ‌క‌పోతే వీపు చింత‌పండు అయిత‌ది.. చంపి పాత‌రేస్త‌రు తెలంగాణ ప్ర‌జ‌లు కాంగ్రెస్‌ను అని రాష్ట్రాన్ని ఇచ్చారు’ అని కేటీఆర్ చెప్పారు.