లడ్డూ వేలం పాట రికార్డు

లడ్డూ వేలం పాట రికార్డు

 రూ. 36 లక్షలకు దక్కించుకున్నపెరిక కరణ్ జయరాజ్

విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: నల్గొండ పాతబస్తీ హనుమాన్ నగర్ ఒకటో నెంబర్ వినాయకుడి లడ్డూ వేలంపాట బుధవారం హోరాహోరీగా సాగింది. ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో లడ్డూ వేలంపాట జరిగింది.


నిమజ్జనాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పాతబస్తీ ఒకటో నెంబర్ విగ్రహం వద్ద ప్రతిఏటా మాదిరిగానే ఈసారి కూడా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎస్పీ అపూర్వరావుతోపాటు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాంతి సంఘం, మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.


గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన లడ్డూ వేలం పాటను బీఆర్ఎస్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ ప్రారంభించారు. మాదిగ యువజన సంఘాల జేఏసీ నేత పెరిక కరణ్ జయరాజ్ రూ.36 లక్షలకు అనూహ్యంగా గణనాథుని లడ్డూప్రసాదాన్ని దక్కించుకున్నారు.


అనంతరం కమిటీ సభ్యులు ఆయనకు లడ్డుని అందజేయగా బ్యాండ్ బాజాల మధ్య లడ్డూను స్వీకరించారు. పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం వివిధ వేషధారణలు, కళారూపాలు, ఆటపాటలు, చిన్నారుల కేరింతలు, డీజే, డప్పు చప్పులకు యువకుల నృత్యాల నడుమ గణనాథుని శోభాయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.