రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి…ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు.. రాచర్ల బాలరాజు

బ్యాంకులిచ్చిన రుణాలకు వడ్డీలు కట్టలేక రైతులు సతమతమవుతున్నారని రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్పందించి రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచర్ల బాలరాజు డిమాండ్ చేశారు రైతులు అప్పుల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు లక్షల రుణమాఫీని వెంటనే అమలు చేయాలి…ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు.. రాచర్ల బాలరాజు

విధాత, వరంగల్ ప్రతినిధి:బ్యాంకులిచ్చిన రుణాలకు వడ్డీలు కట్టలేక రైతులు సతమతమవుతున్నారని రాష్ట్రప్రభుత్వం తక్షణమే స్పందించి రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచర్ల బాలరాజు డిమాండ్ చేశారు రైతులు అప్పుల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలభారత రైతుకూలీ సంఘం నర్సంపేట డివిజన్ కార్యవర్గ సమావేశం బుధవారం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులు గట్టి కృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాచర్ల బాలరాజు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని చెప్పినా చేయలేకపోయిందని విమర్శించారు. ఆగస్టు 15 లోపు అమలు చేస్తామని ఇటీవల ఎన్నికల సందర్భంగా ప్రకటించిందని ఇప్పటికైనా చెప్పిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలి

జిల్లాలో గత 40 సంవత్సరాలుగా గిరిజన గిరిజన పేదలు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారని వారికి శాశ్వత పట్టాలు లేకపోవడం వల్ల ప్రతీ ఖరీఫ్ సీజన్లో ఫారెస్ట్ అధికారులు దాడులు చేసి పంటలను ధ్వంసం చేస్తున్నారని అన్నారు. ఈ దాడులు జరగకుండా వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పట్టాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు పంట నష్టపోతే వారికి 2005 యాజమాన్య హక్కు చట్ట ప్రకారం నష్టపరిహారం అందాల్సి ఉండగా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఇప్పటికైనా పూర్తి నష్టపరిహారం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.అలాగే పంటల బీమా పథకం ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఆయన కోరారు ఇందులో గత మోడీ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలను చెప్పించి వారికి లాభాలుపొందే విధంగా విధానాలు తయారు చేసిందని ఇకముందు అలా జరగకుండా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అసంబద్ధంగా కొనసాగుతున్నదన్నారు. కూలీలకు ఒక రోజుకు 125 రూపాయలను మాత్రమే అందుతున్నదని చెప్పారు. పనిచేసే ప్రాంతంలో తగిన సౌకర్యాలు ఉండడం లేదని రోజుకు 600 రూపాయలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. సంవత్సరానికి 150 నుండి 200 రోజులు పని కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం డివిజన్ కార్యదర్శి జక్కుల తిరుపతి, సభ్యులు గుగులోతు భద్రాజి, మల్లయ్య, వీరారెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.