ఛీకొట్టిన నోటితో ఎలా జై కొట్టాలి: ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై అసంతృప్తి
నిన్నటి వరకు ఈ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వొద్దొంటూ ఛీ కొట్టిన నోటితో ఇప్పుడు ఎలా జై కొట్టాలంటూ మానుకోట గులాబీలు అంతర్మథనంలో పడ్డారు

- అంతర్మథనంలో మానుకోట గులాబీలు
- అనుచరులతో ఎమ్మెల్సీ సమావేశం
- అధిష్టానం ఆదేశమంటూ స్పష్టం
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నిన్నటి వరకు ఈ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వొద్దొంటూ ఛీ కొట్టిన నోటితో ఇప్పుడు ఎలా జై కొట్టాలంటూ మానుకోట గులాబీలు అంతర్మథనంలో పడ్డారు. భూ కబ్జాదారుడు, అవినీతిపరుడంటూ ప్రతిపక్షాన్ని మించి లొల్లి పెట్టిన అసమ్మతివర్గానికి ఇప్పుడు అగ్నిపరీక్షగా మారింది. నిన్నటి వరకు దొంగ, లంగ, అవినీతిపరుడు, అక్రమార్కుడు, పార్టీ కేడర్ ను పట్టించుకోలేదంటూ వంద ఆరోపణలు చేసినా అదే నాయకునికి తిరిగి పార్టీ టికెట్ ఇవ్వడంతో తలపట్టుకుంటున్నారు. అసమ్మతి వర్గానికి నాయకత్వం వహించిన నాయకులకు ఇప్పుడు తమ అనుచరులను ఒప్పించడం పెద్ద పరీక్షగా మారింది.
అనుచరుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధిష్టానం ఆదేశాలంటూ వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సానుకూల స్పందన రాలేదు. అసమ్మతివర్గ నాయకులు, కార్యకర్తలు మౌనం వహించినట్లు సమాచారం. మానుకోట సిటింగ్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ఇప్పటికే రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. రానున్న ఎన్నికల్లో మూడవ సారి పోటీచేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవకాశం కల్పించి అభ్యర్థిత్వం ప్రకటించారు. ఆయన తనదైన శైలిలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రవిందర్ రావు వర్గానికి పరీక్ష
మానుకోట సిటింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు టికెట్ ఇవ్వకూడదంటూ ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవిందర్ రావుతో సహా, అయన అనుచర వర్గమంతా కత్తులు నూరారు. మామిడితోటల్లో ప్రత్యేక మీటింగ్ లు పెట్టి శంకర్ నాయక్ కు కంటిమీద కునుకులేకుండా చేశారు. ఈ సారి అభ్యర్ధిని మార్చకుంటే పార్టీ గెలుపు కోసం పనిచేసేదిలేదని తేల్చిచెప్పారు. మరి కొందరు నాయకులైతే ప్రతిజ్ఞ చేశారు. శంకర్ నాయక్ పై బహిరంగంగానే అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇవేమీ పట్టించుకోకుండా అధిష్టానం శంకర్ నాయక్ కే మూడవసారి అభ్యర్థిగా ఛాన్స్ ఇచ్చారు. దీంతో అసమ్మతివర్గానికి అవమానం ఎదురైంది. పార్టీ నాయకత్వం తమ మాటకు విలువ ఇవ్వలేదనే ఆవేదనలో మౌనంగా ఉన్నారు. విలువలేని చోట ఎందుకు పనిచేయాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఈ స్థితిలో నియోజకవర్గంలో నెలకొన్న అసమ్మతిని నిలువరించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. అసమ్మతి వర్గానికి నాయకుడైన రవిందర్ రావును పిలిచి స్పష్టంగా ఆదేశించింది. శంకర్ నాయక్ గెలుపునకు పనిచేయాలని చెప్పారు. దీంతో రవిందర్ రావు గురువారం తన వర్గం నాయకులతో చాలా సేపు సమావేశమై, అధిష్టాన నిర్ణయాన్ని వెల్లడించారు. దీనిపై తన వర్గం నాయకులు పెద్దగా స్పందించలేదు. మౌనం వహించారు. ఔననకుండా, కాదనకుండా మౌనం వహించినట్లు సమాచారం. మరోసారి సమావేశం అయ్యేందుకు నిర్ణయించారు. ఇదిలా ఉండగా రవిందర్ రావు సహకారం ఉండాలనే ఉద్దేశం ఇప్పటికే ఆయనను ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఆయన సతీమణి డాక్టర్ సీతామహాలక్ష్మి ప్రత్యేకంగా కలిసి ఆయన మద్ధతుకోరారు. తాజాగా అధిష్టానం ఆదేశించడంతో తన వర్గాన్ని నచ్చచెప్పే ప్రయత్నాల్లో రవిందర్రావు ఉన్నారు.