బడే నాగజ్యోతికి మావోయిస్టు పార్టీ మద్దతు ప్రకటించలేదు
ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతికి తమ పార్టీ ఎప్పుడు మద్దతు ప్రకటించలేదని, ఆమెకు మా మద్దతు లేదని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది


– బీఆర్ఎస్ నాయకుల బోగస్ ప్రచారం
– అధికార పార్టీని తన్నితరమండి
– మావోయిస్టు పార్టీ నేత వెంకటేష్ ప్రకటన
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతికి తమ పార్టీ ఎప్పుడు మద్దతు ప్రకటించలేదని, ఆమెకు మా మద్దతు లేదని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. కావాలనే బీఆర్ఎస్ నాయకులు బోగస్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో తాము ఎప్పుడో అధికార పార్టీ నాయకులను తన్ని తరమాలని, ప్రతిపక్షాలను నిలదీయాలని చెప్పామన్నారు. ఈ విషయమై జేఎండబ్ల్యుపీ మావోయిస్టు కార్యదర్శి వెంకటేష్ మీడియాకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన వివరాలివి. ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థికి మావోయిస్టు పార్టీ మద్దతు ఇస్తున్నారని ఆ పార్టీ లీడర్లు, మాజీ మావోయిస్టులు చేస్తున్న ప్రచారం బూటకం, పచ్చి అబద్ధం ప్రజలు ఎవరూ నమ్మవద్దన్నారు. మాపార్టీ సాధారణంగా పార్లమెంటు వ్యవస్థలో భాగంగా జరుగుతున్న బూటకపు ఎన్నికలను బహిష్కరణ విధానం ప్రజలందరికీ తెలిసిందేనని, అందులో భాగంగానే తెలంగాణలో బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని కోరారు.
బ్రాహ్మణీయ హిందుత్వ బీజేపీకి, ఆపార్టీకి మద్దతునిచ్చే అవకాశవాద బీఆర్ఎస్ ను తన్నితరిమండి, ప్రతిపక్ష పార్టీలన్నింటిని నిలదీయాలని ఈ స్పష్టమైన వైఖరిని మేము అనుసరిస్తున్నామన్నారు. ఎందుకంటే ఈ దేశంలో అర్ధ వలస, అర్ధ భూస్వామ్యమే రాజ్యమేలుతోందంటే సామ్రాజ్యవాదులు దళారి నిరంకుశ పెట్టుబడిదారులు, భూస్వాములే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారని పేర్కొన్నారు. బ్రిటీష్ వలసవాదుల నుండి అధికార మార్పిడి జరిగింది కాని ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు.
– పదేండ్లలో బీఆర్ఎస్ విఫలం
నీళ్ళు, నిధులు, నియామకాల కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నారని మావోయిస్టు పార్టీ నేత పేర్కొన్నారు. బీఆర్ఎస్ 2014లో అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పరిపాలించిందీ, కాని ప్రజల కోసం ప్రకటించిన ఏ ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. సంస్కరణ పథకాలన్నీ వారి అనుచరులకు చెందినవే కాబట్టి వారి, బతుకులో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఆరేండ్ల నుండి సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు రాలేదు, హరిత హారం పేరుతో సాగుచేస్తున్న భూములను స్వాధీనం చేసుకుని మొక్కలు నాటారు. రైతు బంధు రాలేదు. 5వ షెడ్యూల్, పెసా చట్టాన్ని అమలు చేయడం లేదు. జీవో 3ని ఎత్తి వేయడమంటే నామమాత్రపు ఉద్యోగాలు కూడా రావని స్పష్టం చేశారు. ఈ పాలకులు దోపిడీ వర్గాలకు దోచిపెట్టడమే వారి ప్రధాన లక్ష్యమన్నారు.
– మౌలిక సమస్యల పట్ల నిర్లక్ష్యం
గత 76 సంవత్సరాల నుండి అనేకసార్లు బూర్జువా పార్టీలకు ఓట్లు వేస్తూ అధికారాన్ని మారుస్తూ వచ్చాము కాని, ఏ బూర్జువా పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజల మౌలిక సమస్యలు ఒక్కటి కూడా పరిష్కరించలేదని మావోయిస్టుపార్టీ పేర్కొంది. కాబట్టి దోపిడీదారులైన సామ్రాజ్యవాదులు, దళారి నిరంకుశ పెట్టుబడిదారులు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. బూర్జువా పార్టీలన్నీ కులం, మతం, జాతి బంధు ప్రీతిని ఉపయోగించి డబ్బు వెదజల్లుతూ, మద్యం ఏరులై పారిస్తూ, సంస్కరణ పథకాలు మీకు ఇస్తామని ఒక పక్క చెప్పుతూనె, మరోపక్క ఓటు వేయకుంటే మీకు అన్ని బంద్ చేస్తామని బెదిరింపులకు గురి చేసి, అన్ని హంగులను ఉపయోగించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి రావాలని చూస్తారన్నారు కానీ, మావోయిస్టు పార్టీ పీడిత ప్రజల కోసం పనిచేస్తుందని ప్రజలందరికీ తెలిసిందేనన్నారు.
– బీఆర్ఎస్ లీడర్ల తప్పుడు ప్రచారం
కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు, మాజీ మావోయిస్టులు ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని, ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మవద్దన్నారు. మేము ఏ అభ్యర్థికి, ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదని, మేము ఈ బూటకపు ఎన్నికలను బహిష్కరించండి అనే పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. బూర్జువా పార్టీలు, వ్యక్తులు ప్రజలను మోసం చేయడానికి పైకమిటీతో మాట్లాడుకున్నామని మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మవద్దు. మా పార్టీ పేరు చెప్పుకుంటూ మాపై తప్పుడు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ లీడర్లు, మాజీ మావోయిస్టులు, వ్యక్తులు ఎవరు చెప్పినా ప్రజల్లో బహిర్గత పరుస్తామని వెంకటేష్ ఆ ప్రకటనలో హెచ్చరించారు.