Marxism, Maoism | మావోయిస్టు సిద్ధాంతం ఓడిపోలేదు.. ఆ భావజాలాన్ని ఓడించడం ఎవరితరం కాదు : చంద్రన్న
మార్క్సిజం, మావోయిస్టు భావజాలాలను ఎవరూ ఓడించలేరని సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) నేత, మావోయిస్టు కీలక నాయకుడు చంద్రన్న అలియస్ పుల్లూరి ప్రసాదరావు స్పష్టం చేశారు. తాము లొంగిపోలేదని, జనజీవన స్రవంతిలో కలిశామని చెప్పారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు.
- పార్టీలో చీలిక వచ్చిన మాట నిజం
- మావోయిస్టు చీఫ్‌గా దేవ్ జీ ఎన్నిక
- ప్రజాస్వామిక పద్ధతుల్లో పనిచేస్తాం
- లొంగిపోయిన మావోయిస్టునేత చంద్రన్న
- మావోయిస్టు పార్టీ తాజా పరిస్థితిపై వివరాల వెల్లడి
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Marxism, Maoism | మార్క్సిజం, లెనినిజం, మావోయిస్టు సిద్ధాంతం ఓడిపోలేదని, ఆ భావజాలాన్ని ఓడించడం ఎవరి తరమూ కాదని సీపీఐ (మావోయిస్టు పార్టీ) కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న అలియాస్ పుల్లూరి ప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ సిద్ధాంతం ప్రజల మధ్యనే ఉందని, కొందరు చనిపోవచ్చూ… అయినా ఆ భావజాలంతో పనిచేసే వారు ప్రజల మధ్య నుంచే పుట్టుకవస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మంగళవారం రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో చంద్రన్నతోపాటు, మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ లొంగిపోయారు. ఈ సందర్భంగా చంద్రన్న మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సూటిగా స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ శివధర్ రెడ్డి మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలువాలని ఇచ్చిన పిలుపు మేరకు తాము స్పందించామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి.. నక్సలైట్లు తమ అన్నదమ్ములే అంటున్నారని, అందుకే తాము జనజీవన స్రవంతిలోకి వచ్చామని తెలిపారు. కగార్ ఆపరేషన్ వల్ల నష్టాలు జరిగే అవకాశం ఉందని, దీనితో పాటు అనారోగ్యం వల్ల తాము లొంగిపోయామన్నారు. ఇది లొంగుబాటు కాదని, తాము జనజీవన స్రవంతిలోకి వచ్చామని అభివర్ణించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల్లోకి వచ్చి పనిచేస్తామని చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా పీడిత ప్రజల కోసం పనిచేశామని, రేపు కూడా పనిచేస్తామని అంటూ.. ఆచరణే గీటురాయి అన్నారు. ఇప్పటి వరకు తాము ఎలాంటిదీ ఆశించలేదని స్పష్టంచేశారు. ప్రజల మధ్య, ప్రజాస్వామిక పద్ధతిలో పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా పనిచేయాలని భావిస్తున్నామన్నారు.
పార్టీలో చీలిక వచ్చింది
పార్టీలో విభేదాలున్నాయంట కదా? అన్న మీడియా ప్రశ్నకు చంద్రన్న స్పందిస్తూ పార్టీ లోపల అంతర్గతంగా చీలిక వచ్చిందనేది స్పష్టమని అన్నారు. ‘ఇదంతా మీడియాకు తెలిసిందే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సందర్భం వచ్చినపుడు వివరిస్తాను’ అని తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్ కౌంటర్ లో మృతి చెందిన తర్వాత ఆయన స్థానంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతిని పార్టీలో ఉన్నవాళ్ళు ఎన్నుకున్నారని చంద్రన్న తెలిపారు. మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్ళపల్లి వాసుదేవరావులు లొంగిపోయిన తర్వాత వారిని పార్టీ హెచ్చరించిన అంశం గురించి మాట్లాడుతూ పార్టీలో చీలిక వచ్చింది కాబట్టి, ఎవరి మార్గం వారు ఎంచుకున్నారని, తాను, బండి ప్రకాష్ మాత్రం మావోయిస్టు పార్టీ లైన్ ను సపోర్టు చేస్తున్నామని తేల్చిచెప్పారు. తాను దేవ్ జీ లైన్‌తో ఏకీభవిస్తానని, సోనూను వ్యతిరేకిస్తానని చెప్పారు. ఆయుధాలు ఏం చేశారని ప్రశ్న పై మాట్లాడుతూ తమ ఆయుధాలు పార్టీకి అప్పగించి వచ్చామని కుండ బద్దలు కొట్టారు. తమకు కూడా ప్రజల మధ్య పనిచేసే వారు చాలామందే ఉన్నారని, పార్టీ ఐడియాలజీ మేరకు ప్రజల మధ్య ఉండి పనిచేస్తామని చంద్రన్న స్పష్టం చేయడం గమనార్హం.
అనేక విషయాలు స్పష్టం చేసిన చంద్రన్న
చంద్రన్న లొంగిపోయిన సందర్భంలో ఆయనకున్న పరిధి, పరిమితిలో కూడా చెప్పిన సమాధానాలు మావోయిస్టు పార్టీలో నెలకొన్న తాజా వాతావరణంలో అనేక విషయాలను స్పష్టం చేసింది. ఇటీవల మావోయిస్టు పార్టీలో నెలకొన్న విభేదాల గురించి ఆయన స్పష్టం చేశారు. పార్టీలో చీలిక నెలకొందని తేల్చిచెప్పారు. అదే పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోనూ, తక్కెళ్ళపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్న ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టు నాయకులు, కేడర్ ఆయుధాలతో సహా మహారాష్ట, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల ముందు లొంగిపోయిన సంఘటనలు తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆయుధాలతో సహా లొంగిపోవడాన్ని పలువురు విమర్శించారు. పార్టీ నాయకులు కూడా దీనిపై తీవ్రంగా స్పందిస్తూ విప్లవ ద్రోహులుగా ముద్ర వేసి కొవర్టులంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. వారిద్దరి మాదిరిగానే అదే కేంద్ర కమిటీ స్థాయి నేతగా ఉన్న తెలంగాణకు చెందిన నాయకుడు చంద్రన్న తన ఆయుధాలను పార్టీకి అప్పగించి వచ్చానని చెప్పారు. పైగా పార్టీపై విశ్వాసాన్ని వ్యక్తం చేయడం, ప్రజల్లో పనిచేస్తానంటూ చెప్పడం ఓకింత ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో తాను నూతనంగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన దేవ్ జీ లైన్ కు మద్ధతుగా నిలుస్తానంటూ చెప్పడం గమనార్హం. భవిష్యత్ ఎలా? ఉన్నప్పటికీ తాను లొంగిపోయినా ప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రజల్లో పనిచేస్తానంటూ చెప్పడం గమనార్హం.
ఇవి కూడా చదవండి..
Maoists Clarification Ceasefire | అది పార్టీ నిర్ణయం కాదు.. తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటన సోనూ వ్యక్తిగత అభిప్రాయమే: మావోయిస్టు పార్టీ
Maoists surrender intense debate | లొంగుబాటా… వెసులుబాటా! మల్లోజుల, ఆశన్న నిర్ణయంపై మేధావి వర్గం ఏమంటున్నది?
Maoist Leaders Letters War | ప్రజాయుద్ధ పంథా దేశ పరిస్థితులకు తగనిది! దేవ్‌జీ జనరల్ సెక్రటరీ ఎంపిక మీడియా సృష్టే: జగన్‌కు కౌంటర్‌గా అభయ్ మరో స్టేట్‌మెంట్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram