మెదక్ బీఆరెస్ లో బీఫామ్ ల గందరగోళం
ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు బీఆరెస్ అభ్యర్థుల ప్రకటనలో ఇంకా అయోమయం కొనసాగుతోంది. బీఫామ్ లు అందక పలువురు ఆశావహులకు ఎదురుచూపులే మిగిలాయి.

– ఇప్పటికీ ఐదు నియోజకవర్గాలకే అందజేత
– తేలని నర్సాపూర్ అభ్యర్థి?
– సంగారెడ్డిలో తెరపైకి రాజేందర్
– జహీరాబాద్ అభ్యర్థి మాణిక్ రావునూ మారుస్తారా?
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు బీఆరెస్ అభ్యర్థుల ప్రకటనలో ఇంకా అయోమయం కొనసాగుతోంది. బీఫామ్ లు అందక పలువురు ఆశావహులకు ఎదురుచూపులే మిగిలాయి. అయితే పార్టీ అధిష్టానం వ్యూహాత్మక రాజకీయంలో భాగంగానే బీపామ్ ల పంపిణీలో ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజక వర్గంతో పాటు, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ముందుగా ప్రకటించినప్పటికీ బీఫామ్ లు మాత్రం ఇవ్వలేదు.
నర్సాపూర్ పై తొలగని ప్రతిష్టంభన
నర్సాపూర్ నియోజకవర్గం నుంచి సిటింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి టికెట్ ప్రకటించక పోగా, అభ్యర్థినీ వెల్లడించలేదు. ఇక్కడ మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ముందుగా అభ్యర్థులను ఖరారు చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్, జహీరాబాద్ సిటింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావు కు సీఎం కేసీఆర్ ఇంకా బీఫామ్ లు ఇవ్వలేదు. అభ్యర్థులను మారుస్తారా? లేక వ్యూహాత్మకంగా వ్యవహరించి ముందుకు పోతున్నారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనడుస్తోంది. సీఎం ఆదివారం తెలంగాణ భవన్ లో 51 మంది అభ్యర్థులకు బీ ఫామ్ లు అందించిన విషయం తెల్సిందే. కామారెడ్డిలో సీఎం తరపున అక్కడి సిటింగ్ ఎమ్మెల్యే గంప గోవర్దన్ బీ ఫామ్ అందుకున్నారు. ఇక్కడ మాత్రం ఆయన బీ ఫామ్ ను ఎవరికీ ఇవ్వలేదు. ఈ పరిణామాలతో వ్యూహాత్మకంగా వ్యవహరించి మెదక్ జిల్లాలో పలు స్థానాలకు అభ్యర్థులను మారుస్తారా అన్న సందేహాలు ఆపార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి.
సంగారెడ్డి టికెట్ రాజేందర్ కేనా?
మెదక్ ఉమ్మడి జిల్లా సంగారెడ్డి కి చెందిన టీఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2 సంవత్సరాలు పదవీ కాలం ఉన్న రాజేందర్ ను సీఎం కేసీఆర్ రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన్ను సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముదిరాజ్ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే సీటు కేటాయించినట్లు, ఉద్యోగ సంఘాల నాయకుల మద్దతు పొందవచ్చని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మొదట ప్రకటించిన చింతా ప్రభాకర్, మాణిక్య రావ్ కు బీఫామ్ ఇవ్వలేదని భావిస్తున్నారు. జహీరాబాద్ లో సైతం నీటి పారుదల శాఖలో ఉన్న సీనియర్ అధికారికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బీ ఫామ్ లు అందుకున్న నేతలు వీరే..
మెదక్ సిటింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్ లో బీ ఫామ్ అందించారు. పటాన్ చెరువు సిటింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, అందోల్ సిటింగ్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, నారాయణఖేడ్ సిటింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిలకు బీ ఫామ్ లు అందించారు. మిగితా బీ ఫామ్ లు ఎవరికి దక్కుతాయోననే ఆందోళన ఆశావహుల్లో వ్యక్తమవుతోంది. ముందుగా సీఎం ప్రకటించిన సంగారెడ్డి – చింత ప్రభాకర్, జహీరాబాద్ – మాణిక్యరావుకు సైతం బీఫాం అందకపోవడంతో వారి అనుచరుల్లో ఆందోళన మొదలైంది.