జూడాలతో మంత్రి దామోదర రాజనర్సింహ చర్చలు అసంపూర్ణం

త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాలంటూ జూనియ‌ర్ డాక్ట‌ర్లు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి స‌మ్మె చేపట్టారు. దీంతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌తో జూనియ‌ర్ డాక్ట‌ర్లు సోమ‌వారం మ‌ధ్యాహ్నం చ‌ర్చ‌లు నిర్వ‌హించారు

జూడాలతో మంత్రి దామోదర రాజనర్సింహ చర్చలు అసంపూర్ణం

విధాత : త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాలంటూ జూనియ‌ర్ డాక్ట‌ర్లు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి స‌మ్మె చేపట్టారు. దీంతో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌తో జూనియ‌ర్ డాక్ట‌ర్లు సోమ‌వారం మ‌ధ్యాహ్నం చ‌ర్చ‌లు నిర్వ‌హించారు. అయితే ఈ చ‌ర్చ‌లు అంస‌పూర్తిగా ముగిశాయ‌ని జూడాలు పేర్కొన్నారు. కొన్ని ప్ర‌తిపాద‌న‌ల‌పై మంత్రి సానుకూలంగా స్పందించార‌ని, మ‌రికొన్ని ప్ర‌తిపాద‌న‌ల‌పై మ‌రోసారి చ‌ర్చించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు.

డాక్ట‌ర్ల భ‌ద్ర‌త గురించి ఆలోచిస్తామ‌ని, స్టైఫండ్‌కు గ్రీన్ ఛాన‌ల్‌పై మ‌రోసారి చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని వైద్యారోగ్య శాఖ మంత్రి చెప్పిన‌ట్లు జూనియ‌ర్ డాక్ట‌ర్లు పేర్కొన్నారు. స‌మ్మె కొన‌సాగింపుపై రాష్ట్ర స్థాయి జూడాల‌తో చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. అప్ప‌టి వ‌ర‌కు స‌మ్మె య‌థాత‌థంగా కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి ప్ర‌తి నెలా స్టైఫండ్ చెల్లింపు, సూప‌ర్ స్పెషాలిటీ సీనియ‌ర్ రెసిడెంట్‌ల‌కు రూ. 1.25 ల‌క్ష‌ల గౌర‌వ వేత‌నం, మెడిక‌ల్ కాలేజీల్లో పెంచిన 15 శాతం సీట్ల‌లో ఏపీ విద్యార్థుల‌కు అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని, డాక్ట‌ర్ల‌పై దాడులు జ‌ర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌నే ప‌లు డిమాండ్ల‌తో జూనియ‌ర్ డాక్ట‌ర్లు స‌మ్మె చేస్తున్నారు.