నాడు ఓటుకు నోటు.. నేడు నోట్ల‌కు సీట్లు: మంత్రి హ‌రీశ్‌రావు

గ‌తంలో ఓటుకు నోటు కేసులో ఉన్న ప్ర‌స్తుత టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ప్ర‌స్తుతం నోటుకు సీట్లు అమ్ముకుంటున్నార‌ని మంత్రి హ‌రీశ్‌రావు ఆరోపించారు

నాడు ఓటుకు నోటు.. నేడు నోట్ల‌కు సీట్లు: మంత్రి హ‌రీశ్‌రావు
  • మా మ్యానిఫెస్టోతో విప‌క్షాల్లో మంట‌
  • ఇదే పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి నైజం
  • బీజేపీకి పోటీ చేసే అభ్య‌ర్థులే లేరు
  • ల‌క్ష మందితో సిద్దిపేట స‌భ‌

విధాత: మెదక్ ప్రత్యేక ప్రతినిధి: గ‌తంలో ఓటుకు నోటు కేసులో ఉన్న ప్ర‌స్తుత టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ప్ర‌స్తుతం నోటుకు సీట్లు అమ్ముకుంటున్నార‌ని మంత్రి హ‌రీశ్‌రావు ఆరోపించారు. సిద్దిపేట‌లో నిర్వ‌హించ‌నున్న ప్ర‌జా ఆశీర్వాద స‌భ నేప‌థ్యంలో ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌లో, మ్యానిఫెస్టో విడుద‌ల‌లోనే కాదు.. రేపు విజ‌యంలోనూ బీఆరెస్ ముందుంటుంద‌ని అన్నారు.

ల‌క్ష మందితో నిర్వ‌హించే సిద్దిపేట ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌కు ల‌క్ష‌ల్లో త‌ర‌లిరావాల‌ని పిలుపునిచ్చారు. బీఆరెస్ మ్యానిఫెస్టోతో ప్ర‌తిప‌క్షాల ఫ్యూజులు ఎగిరిపోయాయ‌ని హ‌రీశ్‌రావు ఎద్దేవా చేశారు. బీఆరెస్ మ్యానిఫెస్టోతో ప్ర‌జ‌ల హృద‌యాలు ఆనందంతో పొంగిపోతుంటే.. ప్ర‌తిప‌క్షాల గుండెలు జారిపోయాయ‌ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీయే త‌మ ప‌థ‌కాల‌ను కాపీకొట్టింద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ నాయ‌కులు ప‌ది కోట్ల‌కు టికెట్ అమ్ముకున్నారని ఆయ‌న ఆరోపించారు. ఈ విష‌యంలో ఢిల్లీ గ‌ల్లీల్లో కాంగ్రెస్ నాయ‌కులే నిర‌స‌న‌ల‌కు దిగుతున్నార‌ని చెప్పారు.

బీజేపీ నేత రాజ్‌నాథ్‌సింగ్ తెలంగాణ‌కు వ‌చ్చి, ఎక్క‌వ మాట్లాడుతున్నార‌ని విమ‌ర్శించారు. బీజేపీకి పోటీ చేసేందుకు అభ్య‌ర్థులే లేర‌ని అన్నారు. కిష‌న్‌రెడ్డి, బండి సంజ‌య్‌లాంటి వారు కూడా అసెంబ్లీకి పోటీ చేయం, ఎంపీగా పోటీ చేస్తామ‌ని త‌ప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివితే రాజ్ నాథ్ సింగ్ నవ్వుల పాలవడం తప్ప ఏమీ కాద‌ని అన్నారు. ఎవ‌రెన్ని చెప్పినా మూడోసారి ముఖ్య‌మంత్రి అయ్యేది కేసీఆరేన‌ని స్ప‌ష్టం చేశారు.