బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ విజయం ఖాయం.. మంత్రి జగదీశ్ రెడ్డి

బీఆరెస్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయాన్ని అందుకోబోతోందని,సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ శ్రేణులు ఎన్నికలకు సన్నద్ధం కావాలని మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు

బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ విజయం ఖాయం.. మంత్రి జగదీశ్ రెడ్డి

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: రాష్ట్రంలో బీఆరెస్ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయాన్ని అందుకోబోతోందని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే సాధారణ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా శుక్రవారం సూర్యాపేట రూరల్ మండలంలోని పలు గ్రామాలు, బూత్ ల వారిగా బీఆర్ఎస్ శ్రేణులతో మంత్రి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సాధించిన ప్రగతిని వివ‌రించారు.

కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ తక్కువ సమయంలో ఊహించని అభివృద్ధి చేశారని, దీంతో ప్రజలంతా బీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల‌ను వివ‌రిస్తూ వాటిని ప్రజ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప‌రిపాల‌నా దక్షత క‌లిగిన సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలు దేశానికి ఆద‌ర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి పాల‌న‌లో తెలంగాణ ప్రజ‌లు ఎన్నో ఇబ్బందులు ప‌డ్డార‌ని, స్వరాష్ట్రంలో వాటిని అధిగ‌మించి మిగతా రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నామ‌ని తెలిపారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్‌ పాలనలో చేయని అభివృద్ధిని బీఆర్‌ఎస్‌ సర్కారు తొమ్మిదేళ్లలోనే చేసి చూపించిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ విజయం ఖాయం అని అన్నారు. గతంలో అభివృద్ధి పథకాలకు గ్రామాలకు లక్ష రూపాయలు కూడా వచ్చేవి కావన్న మంత్రి, ఒక్కో గ్రామానికి బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయల నిధులు వచ్చాయని తెలిపారు.

సంక్షేమ పథకాలను తమ పార్టీలకు మాత్రమే ఇచ్చే సంస్కృతి గతపార్టీలది అయితే, పార్టీలకతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందించిన పార్టీ బీఆర్ఎస్ అన్నారు. పెన్షన్ రావాలంటే ఎవరు పోతారా అని ఎదురు చూసే దౌర్భాగ్యపు పరిస్థితులు గత పాలకుల హయాంలో ఉండేవన్నారు. రైతుల కోసం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన రైతు బీమా, రైతు బంధు, 24 గంటల కరెంటు పథకాలు గ్రామాల రూపురేఖలని మార్చి వేసినాయని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం దేశంలో బీఆర్ఎస్ మాత్రమే అని అన్నారు. పట్టణాలతో సమానంగా పల్లెలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి అన్నారు.

గ్రామాలలో 2014 ముందు, ప్రస్తుత పరిస్థితులను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులు చేసే బాధ్యతను బీఆర్ఎస్ శ్రేణులు తీసుకోవాలన్నారు. రాబోయే 46 రోజులు విభేదాలను పక్కనపెట్టి హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సూర్యాపేట ఎంపీపీ రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ జీడీ బిక్షం, మండల పార్టీ అధ్యక్షులు వంగాల శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ నాయుడు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు, బూత్ ఇంచార్జిలు పాల్గొన్నారు.