డబ్బు సంచులతో కాంగ్రెస్ నేతలు వస్తుండ్రు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి

– తుంగతుర్తిలో కిషోర్ ను మరోసారి ఆశీర్వదించండి
– మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ‘60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో నల్గొండ జిల్లాకు ఒరిగిందేమీ లేదు. ఎన్నికల్లో డబ్బులతో ఓట్లు కొనుక్కునేందుకు వస్తుండ్రు. అహంకార కాంగ్రెస్ నేతలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట్లకండ్ల జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని
శాలీగౌరారం మండలం అడ్లుర్ లో స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్, ఎంపీ బడుగులతో కలిసి శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆకలితో ఉన్న కాంగ్రెస్ నాయకుల పాచికలు చైతన్యవంతమైన ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల ముందు సాగవన్నారు. ప్రజలకు ఏం చేస్తామో చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు.
ఎన్నికలు అయిపోక ముందే సీఎం కుర్చీ కోసం కొట్లాడుకుంటున్న దౌర్భాగ్యపు పరిస్థితి కాంగ్రెస్ నేతలది అన్నారు. కాంగ్రెస్ నేతలను గ్రామాలకు రానిచ్చే పరిస్థితి లేదన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు కాంగ్రెస్ ను ఛీత్కరిస్తున్నారన్న మంత్రి, 25 ఏళ్లు పాలించిన జిల్లా నేతలు ఒరగబెట్టిందేమి లేదన్న విషయాన్ని ప్రజలు గ్రహించారని తెలిపారు. జిల్లాలో 12కు 12 స్థానాల్లో బీఆరెస్ ను గెలిపించి, కేసీఆర్ కు గిఫ్ట్ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
కిషోర్ తోనే తుంగతుర్తిలో ప్రశాంత వాతావారణం
ప్రజాదరణ మధ్య ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం సాగుతున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కక్షలు, కార్పణ్యాలకు నిలయమైన తుంగతుర్తిలో ప్రశాంత వాతావరణం నెలకొల్పిన ఘనత కిషోర్ దే అన్నారు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ఇక్కడి ప్రజలు కిషోర్ నాయకత్వంలో అద్భుత ప్రగతిని చూస్తున్నారని అన్నారు.
స్వలాభం కోసం గ్రామాల్లో రక్తం పారిచిన చరిత్ర గత పాలకులదే అన్నారు. గత పాలనలో గ్రామాల నుండి పట్టణాలకు వస్తే అది కేవలం రాజకీయ కేసుల గురించినే ఉండేదన్నారు. బీయన్ రెడ్డి కలలను నిజం చేసింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో రెండు లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే అన్నారు. కిషోర్ ను మూడవసారి గెలిపీయడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.