కాంగ్రెస్ పార్టీది రక్త చరిత్ర: మంత్రి జగదీశ్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీది రక్త చరిత్ర: మంత్రి  జగదీశ్ రెడ్డి

విధాత, సూర్యాపేట: తెలంగాణా అమరుల త్యాగాలను, పోరాటాన్ని తక్కువ చేసిన కాంగ్రెస్ పార్టీని వంద అడుగుల గుంత తీసి బొంద పెట్టాలని, హస్తం పార్టీది రక్త చరిత్ర అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు విడుదల చేసిన మ్యానిఫెస్టోపై మంత్రి శుక్రవారం స్పందించారు. అది 42 పేజీల మ్యానిఫెస్టో కాదని, ఫోర్ ట్వంటీ (420) మ్యానిఫెస్టో అని మండిపడ్డారు. వారివి.. ఆరు గ్యారంటీలు కాదని, ఆరు అబద్ధాలు అని మంత్రి ఎద్దేవా చేశారు. ఉత్తమ కుమార్, కోమటిరెడ్డి, జానారెడ్డి లాంటి వృద్ధ నాయకులను ఘోరంగా ఈ ఎన్నికల్లోనూ ప్రజలు ఓడించబోతున్నారన్నారు.


ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాల్లోనూ బీఆర్ఎస్ గెలుపు తథ్యమన్నారు. సీఎం కేసీఆర్ సభలకు వస్తున్న జనమే బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయానికి సంకేతమన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటేనన్నారు. బీఆర్ఎస్ పార్టీపై సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేతలు విష ప్రచారం చేస్తున్నారనీ, గులాబీ నేతలు, కార్యకర్తలు వీటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి రైతులకు 3 గంటల విద్యుత్ చాలని నోటితో చెబుతారని, మ్యానిఫెస్టోలో మాత్రం 24 గంటలు అని ప్రకటించారన్నారు. మాటలు, చేతలకు పొంతన లేని కాంగ్రెస్ నాయకుల మాటలను ప్రజలు నమ్మబోరన్నారు. రాహుల్ గాంధీ మోదీకి అతిపెద్ద క్యాంపెయినరని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్మినందుకు కర్ణాటకలో రైతులు గోస పడుతున్నారనీ, తెలంగాణ ప్రజలు వారికి ఓట్లేస్తే చీకట్లు అలుముకుంటాయన్నారు.