20 యేండ్లు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క!
‘రాష్ట్రంలో నియంత పాలన పోయి.. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. 20 యేండ్లు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క’ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు

– నల్లగొండలో గుండాయిజం, రౌడీయిజం అంతం చేస్తా
– మూడేళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగం,
ఆర్నెల్లలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పూర్తి చేయిస్తా
– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
– కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం.. హెలికాప్టర్ నుంచి పూల వర్షం
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ‘రాష్ట్రంలో నియంత పాలన పోయి.. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. 20 యేండ్లు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క’ అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన సోమవారం నల్గొండ వచ్చారు. ఈసందర్భంగా మర్రిగూడ బైపాస్ వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు డప్పు చప్పులు, బాణాసంచాతో ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మర్రిగూడ రేణుక ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఈసందర్భంగా హెలికాప్టర్ నుంచి ర్యాలీగా సాగుతున్న మంత్రికి పూలవర్షం కురిపించారు.
అక్కడి నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. గజమాలతో మంత్రికి అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రం వచ్చినందున పేదలందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్లగొండలో రౌడీయిజం, భూకబ్జాలు, అక్రమ ఇసుక దందా కొనసాగాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇక వాటికి చోటు ఉండదని స్పష్టం చేశారు. నల్గొండలో గుండాయిజం, రౌడీయిజం లేకుండా చేస్తానని అన్నారు. అక్రమ ఇసుక దందా, బెల్ట్ షాపులను లేకుండా చేస్తానని తెలిపారు. గంజాయి సరఫరా, వాడకంపై ఉక్కుపాదం మోపుతామని పేర్కొన్నారు. మూడేళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగం, ఆరు మాసాల్లో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పనులను పూర్తి చేయిస్తానని చెప్పారు. వచ్చే ఆరు మాసాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడతానని అన్నారు.
డిసెంబర్ 28న కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని మరో రెండు పథకాలను ప్రారంభిస్తామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మనిమద్దే సుమన్, తిప్పర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జూకూరి రమేష్, తిప్పర్తి జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, కనగల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం అనుఫ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, సూరెడ్డి సరస్వతి పాల్గొన్నారు.