మీదే కుటుంబ పాలన.. మీ పార్టీ దేశానికి సీ(చోర్) టీమ్: కేటీఆర్
సీఎం కేసీఆర్‌ది కుటుంబ పాలన అని అంటున్న రాహుల్ గాంధీ ఎవరు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఒకే వేదిక మీద నిలబడొచ్చు. సోనియా గాంధీ

- ఒక్క చాన్స్ అనడానికి కాంగ్రెస్‌కు సిగ్గుందా
- కాళేశ్వరంపై రాహుల్ అవగాహాన లేని మాటలు
- గాడ్సే గాంధీభవన్ అమ్మేస్తాడు
- రాహుల్, రేవంత్‌లపై మంత్రి కేటీఆర్ నిప్పులు
విధాత : సీఎం కేసీఆర్‌ది కుటుంబ పాలన అని అంటున్న రాహుల్ గాంధీ ఎవరు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఒకే వేదిక మీద నిలబడొచ్చు. సోనియా గాంధీ అదే వేదిక మీద ఉండొచ్చు. అప్పుడప్పుడు చనిపోయిన ఇందిరా గాంధీని, రాజీవ్ గాంధీని, నెహ్రూని యాది చేసుకోవచ్చు. కానీ కేసీఆర్‌ది మాత్రం కుటుంబ పాలన అంటరు. ఇదెక్కడి నీతి నాకర్థం కాదు. గొంగడిలో కూర్చొని ఎవడన్న వెంట్రుకలు ఏరుతాడా..? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన వికలాంగుల పెన్షన్ లబ్ధిదారుల కృతజ్ఞత సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
జవహర్ లాల్ నెహ్రూ బిడ్డ ఇందిరా గాంధీ కొడుకు రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ వచ్చి.. తెలంగాణలో కుటుంబ పాలన గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు.11సార్లు పాలించే చాన్స్ ఇస్తే మంచినీళ్లు కూడా ఇవ్వలేదని, ఫ్లోరైడ్, కరువు పీడిత నల్లగొండ, మహాబూబ్‌నగర్ వంటి జిల్లాలకు చేసిందేమి లేదని, సిగ్గులేకుండా మరో చాన్స్ అని అడుగుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని రాహుల్ మాట్లాడుతున్నారని కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టును రూ. 80 వేల కోట్లతో నిర్మించారని, కానీ రాహుల్ గాంధీ లక్ష కోట్ల అవినీతి జరిగిందని అంటున్నడని, అమెరికాలో ఉండే ప్రపంచ పర్యావరణ కాంగ్రెస్ వాళ్లు పిలిచి కాళేశ్వరానికి అవార్డులు ఇస్తున్నారన్నారు.
కానీ ఇక్కడున్న కాంగ్రెసోళ్లకు అయితే అర్థమైత లేదన్నారు. 80 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎట్ల జరుగుతుందో రాహుల్ కొంచెం బుర్రతో ఆలోచించి మాట్లాడాలని, రాహుల్ గాంధీతో వచ్చిన బాధ ఏంటంటే.. ఆయన లీడర్ కాదు.. రీడర్. ఏం రాసిస్తే అది చదువుతాడు పాపం. ఆయనకేం తెల్వదు.. తెల్లకాగితమని, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడు అని రాహుల్‌పై కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీకి బీ టీమ్ బీఆరెస్ అని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, మేం బీజేపీ బీ టీమ్ కాదు.. మీరు ఈ దేశానికి సీ టీమ్ అన్నారు. సీ టీమ్ అంటే ఏంది.. చోర్ టీమ్ మీరు.. చోర్ టీమ్ అని కేటీఆర్ విమర్శించారు. ఏ టు జడ్ కుంభకోణాలు చేసిన దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నిప్పులు చెరిగారు. ఏ అంటే ఆదర్శ్, బీ అంటే భోఫోర్స్, సీ అంటే కామన్వెల్త్.. ఇలా చెప్పుకుంటూ పోతే జడ్ దాకా ఉన్నాయి. ఆకాశం నుంచి పాతాళం దాకా దోచుకున్న పార్టీ, దగుల్బాజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు.
ఆకాశంలో ఎగిరే అగస్త్య హెలికాప్టర్ నుంచి పాతాళంలో ఉండే బొగ్గు దాకా దేన్ని వదలకుండా దోచుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కుంభకోణాల్లో స్వయంగా మీ కేంద్ర మంత్రులు జైళ్లకు పోయారని ఇవాళ ఆఖరికి నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద ఈడీ విచారణ జరుగుతోందని, మేం బీ టీమ్ కాదు.. ఈ దేశానికి మీరే సీ టీమ్ అని రాహుల్ విమర్శలను తిప్పికొట్టారు. కేసీఆర్ అవినీతి పరుడని, రాహుల్ అంటున్నడని, మరి రాహుల్ పక్కకు గజదొంగ రేవంత్ ఉన్నాడనే విషయాన్ని మరిచిపోవద్దని కేటీఆర్ సూచించారు. రేవంత్ కంటే పెద్ద గజదొంగ ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడా..? ఆయన ముందు దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజు కూడా చిన్నోళ్లని విమర్శించారు. ఆనాడు ఓటుకు నోటు.. ఇప్పుడు సీటుకు రేటు, రేపు రాష్ట్రమంతా అమ్ముతడని, బీజేపీకి కాంగ్రెస్ పార్టీని అమ్మిపారేస్తడని, అలాంటి వ్యక్తిని పక్కన కూర్చొబెట్టుకుని, రాహుల్ అవినీతి గురించి మాట్లాడుతున్నాడన్నారు.
పీసీసీ అధ్యక్షుడే పైసలు పంచుకుంటూ దొరికిపోయిన దగుల్బాజీ అని, 50 కోట్లు మీ ఇంచార్జికి లంచం ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్న దొంగ రేవంత్ అని, ఇది వాస్తవమో కాదో తెలుసుకోవాలంటే, మీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పక్కకు పిలిచి అడిగినా చెప్తడన్నారు. ఇక్కడ సీట్లు ఎక్కడ అమ్ముతున్నడో, ఎక్కడ విల్లాలు రాయించుకుంటున్నడో, ఎక్కడ ప్లాట్లు రాయించుకుంటున్నడో కొద్దిగా రాహుల్‌గాంధీ ఎంక్వైరీ చేయించుకోవాలన్నారు. పది మంది కాంగ్రెస్ నాయకులను పక్కకు తీసుకెళ్లి మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలని, నీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను పిలిచి మాట్లాడితే రేవంత్ బండారం బయటపడ్తదన్నారు. రేపటి రోజున అల్టిమేట్‌గా.. ఇక్కడ పది మంది గెలిచినా, పన్నెండు మంది గెలిచినా.. వారిని రేవంత్ రెడ్డి తీసుకెళ్లి బీజేపీలో గంపగుత్తగా చేర్పిస్తాడని, ఇవాళ రాసిపెట్టుకోండి.. మీడియా ముఖంగానే చెబుతున్నానన్నారు. రేవంత్ రెడ్డి సంగతి రాహుల్ గాంధీకి తెలియదని, ఆయన బీజేపీ కోవర్ట్‌గా కాంగ్రెస్‌లో బీజేపీ ఏజెంట్ గా ఉన్నారని, బీజేపీనే రేవంత్‌ను తెచ్చి మీ కాంగ్రెస్ పార్టీలో ఇరికించిందంటూ ఆరోపించారు.
మీకు తెలియక గాడ్సేకు గాంధీ భవన్‌ను అప్పజెప్పారని రాహుల్ గాంధీపై కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రస్తుత దివ్యాంగుల పించన్ 4016ఇస్తున్నామని, మళ్లీ గెలిస్తే 6,016రూపాయలకు పెంచుతామన్నారు. ప్రధాని మోడీ సొంత గుజరాత్‌లోగాని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోగాని 4వేల పింఛన్ లేదన్నారు. గుజరాత్‌లో కేవలం 47వేల మందికి మాత్రమే వైకల్య శాతం మేరకు పింఛన్ ఇస్తున్నారని తప్పుబట్టారు. తెలంగాణలో 10,300కోట్లు రూపాయలు దివ్యాంగులకు కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. 2లక్షల 25వేల దివ్యాంగులకుల వాహనాలు ఇచ్చామని, 5శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. వినికిడి యంత్రాలు కూడా అందిస్తున్నామన్నారు.