అభివృద్ధిని చూడండి… ఆశీర్వదించండి: మంత్రి నిరంజన్ రెడ్డి
పదేళ్లలో వనపర్తి నియోజకవర్గం అభివృద్ధిలో ఎంతో ముందడుగు వేసింది. అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని వనపర్తి బీఆర్ఎస్, అభ్యర్థి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు

- వనపర్తిలో కనీవినిఎరుగని అభివృద్ధి చేశా
- సాగునీటితో బీడు భూములు సస్యశ్యామలం చేశా
- మళ్ళీ గెలిపించండి.. వనపర్తిని అగ్రభాగాన నిలబెడతా
- వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి నిరంజన్ రెడ్డి
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పదేళ్లలో వనపర్తి నియోజకవర్గం అభివృద్ధిలో ఎంతో ముందడుగు వేసింది. అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని వనపర్తి బీఆర్ఎస్, అభ్యర్థి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గంలోని ఖిల్లాఘనాపురం మండలంలో మంత్రి ప్రచారం చేపట్టారు.
ఈసందర్భంగా పలు గ్రామాల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో వెనుకబడిన వనపర్తి జిల్లాకు తన హయాంలో సాగునీరు తెచ్చి ఇక్కడి బీడు భూములకు అందిస్తే, పంటలు పండి రైతులు ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగారన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంటు, ఆసరా పింఛన్లతో అండగా నిలుస్తున్నామన్నారు.
ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజలు నేడు తిరిగి సొంత గ్రామాలకు వస్తున్నారన్నారు. పైరవీకారులకు తావులేకుండా, ఏ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నేరుగా ఆ రైతు కుటుంబానికి బీమా డబ్బు రూ.5 లక్షల పరిహారం అందుతున్నదన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలతో గ్రామాలు బాగుపడుతున్నాయని, ఇవన్నీ నిజమైతే ఈ ఎన్నికల్లో అండగా నిలబడి మళ్ళీ గెలిపిస్తే పేదలకు మరిన్ని పథకాలు తీసుకొస్తానని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
ఆహారశుద్ధి పరిశ్రమలతో ఉపాధి
పేదలకు రూ.400కే గ్యాస్ సిలిండర్, రూ.2016 పింఛన్ ను విడతల వారీగా రూ.5000 వేలకు పెంచుతామన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన ఉద్యోగాలు 32 వేలు అయితే.. తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు లక్ష 62 వేలు అని, మరో 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినమన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గతంలో ఉన్న పరిస్థితులే మళ్ళీ పునరావృతం అవుతాయని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయనిధి నిధులు వనపర్తి నియోజకవర్గంలో ఇచ్చామన్నారు. భవిష్యత్తులో ఆహారశుద్ధి పరిశ్రమలతో వనపర్తిలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రజలు అడిగిన పనులన్నీ చేసి చూపించానని, తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నామని, గ్రామాలు నేడు పాడిపంటలతో ప్రశాంతంగా ఉన్నాయని, రెక్కల కష్టంతో ఎవరి కాళ్ల మీద వారు బతుకుతున్నారని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి వెంట ఎంపీపీ కృష్ణా నాయక్, జడ్పీటీసీ సౌమ్య నాయక్, మండల పార్టీ అధ్యక్షులు కృష్ణయ్య ఉన్నారు.