Minister Uttam Kumar Reddy | ఆగస్టు 15 నాటికి పంట రుణాలను మాఫీ చేస్తాం: మంత్రి ఉత్తమ్‌

రైతులు పంట రుణాలను ఆగస్టు 15 లోగా తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేస్తుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు

Minister Uttam Kumar Reddy | ఆగస్టు 15 నాటికి పంట రుణాలను మాఫీ చేస్తాం: మంత్రి ఉత్తమ్‌

రైతులకు సాగుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

విధాత: రైతులు పంట రుణాలను ఆగస్టు 15 లోగా తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేస్తుందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. సోమవారం తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్‌గా ఎస్ అన్వేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను అప్పుల బాధ నుంచి విముక్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే దఫాలో పంట రుణాలను మాఫీ చేస్తుందన్నారు. పంట రుణాల మాఫీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా ఆగస్టు 15 లోగా పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. రైతుల ఆర్థిక సాధికారత లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రైతు భరోసా పథకాన్ని ప్రారంభించామని, ఇది రైతులందరికీ ఏడాదికి ఎకరాకు రూ.15,000 పెట్టుబడి మద్దతునిస్తుందన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలే

కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీరందించలేకపోయిందని ఉత్తమ్ కుమార్ రెడి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణాత్మక పరిష్కారాలు, స్పష్టమైన ఫలితాలపై దృష్టి సారిస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. పంట రుణాల మాఫీ సహా పలు కీలక అంశాలపై రానున్న అసెంబ్లీ సమావేశంలో చర్చిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.