అభివృద్ధి చేతకాక పారిపోయిన వ్యక్తి కోమటిరెడ్డి: ఎమ్మెల్సీ రవీందర్రావు

- మరోసారి ఎన్నికల్లో ఓట్లు అడగడం సిగ్గుచేటు
- కాంగ్రెస్ ది టికెట్లు అమ్ముకునే నీచ సంస్కృతి
- నల్గొండలో బీఆర్ఎస్ గెలుపు ఖాయం
విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: అభివృద్ధి చేతకాక నల్గొండ నుంచి పారిపోయిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు, నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి విమర్శించారు. బుధవారం నల్గొండ ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డితో కలిసి వారు మాట్లాడారు. 20 ఏళ్లుగా నల్గొండ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసిన కోమటిరెడ్డి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీని అసంపూర్తిగా వదిలేశారని అన్నారు.
కనీసం ప్రజలకు మంచి నీళ్ళు కూడా ఇవ్వలేని ఆయన ఎన్నికల్లో ఓట్లు వేయమని అడగడం సిగ్గుచేటు అన్నారు. భూపాల్ రెడ్డి గెల్చిన తర్వాతనే అన్ని పనులు పూర్తి అయ్యాయని చెప్పారు. కొంతమందిని లోబర్చుకొని కాంగ్రెస్ లో చేర్చుకుంటే అయ్యేదేమి లేదన్నారు. ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే వున్నారని, భూపాల్ రెడ్డి గెలుపు ఖాయమైందని తెలిపారు. కోమటిరెడ్డికి మతిస్థిమితం లేదని, ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని విమర్శించారు.
కాంగ్రెస్ కే గ్యారంటీ లేదని, భూపాల్ రెడ్డి చేసిన అభివృద్ధి ముందు కోమటిరెడ్డి జిమ్మిక్కులు నడవవన్నారు. కేసీఆర్ పై అవినీతి మరక వేయాలని కాంగ్రెస్ ప్రయత్నం చేయడం విచారకరమన్నారు. టికెట్లు అమ్ముకున్న నీచ చరిత్ర కాంగ్రెస్ ది అని, రాహుల్ గాంధీ, రేవంత్ సుద్ద పూసలా మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, బొర్రా సుధాకర్, చాడ కిషన్ రెడ్డి, శరణ్య రెడ్డి పాల్గొన్నారు.