ఓట్ల కోసమే మైనంపల్లి మెదక్ వచ్చారు: పద్మా దేవేందర్ రెడ్డి

-సభ్యత్వం లేనివారికి టికెట్లిచ్చిన కాంగ్రెస్
– ఆపార్టీకి ఓటేస్తే.. అభివృద్ధికి చేటు
– మెదక్ బీఆరెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: నియోజకవర్గాలకు అభ్యర్థులు కరువైన కాంగ్రెస్ పార్టీ, ఏకంగా సభ్యత్వం లేని మైనంపల్లి హన్మంతరావుకు పార్టీ టికెట్ ఇచ్చిందని మెదక్ బీఆరెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి విమర్శించారు. శనివారం మెదక్ మండలం రాయన్ పల్లి, శివాయపల్లి, కొంటూర్ గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ కి ఓటేస్తే అభివృద్ధికి చేటు అని, కష్టాల పాలవుతామన్నారు. ఎమ్మెల్యేగా మైనంపల్లి హన్మంతరావు 2 సార్లు గెలిచినా అభివృద్ది చేయలేదని,14 సంవత్సరాల నుండి పక్కా లేకుండా పోయిన హన్మంతరావు ఎన్నికలకు సమయంలో వచ్చాడని ఆరోపించారు.
కాంగ్రెస్ నాయకులు ఏ పథకాన్ని ప్రవేశపెట్టాలన్న ఢిల్లీ అధిష్టానం నిర్ణయించాల్సి ఉంటుందని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మన అందరి నిర్ణయం మేరకే కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెడతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ నియోజకవర్గాన్ని ఓ రాజకీయ ప్రయోగశాలగా మార్చిందని, పార్టీ సభ్యత్వం లేని వారికి టికెట్ ఇస్తున్నదని ఆరోపించారు. మైనంపల్లి హనుమంతు రావు కొట్లాటలు పెట్టడం మల్కాజ్ గిరిలో నడుస్తది కానీ మెదక్ లో కుదరదు అన్నారు. నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మేము వచ్చి గొడవలు పెడతాం, కోట్లాటలు పెడతాం అంటే ఊరుకోమని హెచ్చరించారు.
కాంగ్రెస్ అభ్యర్థికి ఇక్కడి స్థితిగతులు కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని అన్నారు. కాగా రాయన్ పల్లి, శివాయపల్లి, కొంటూర్, పాషాపూర్, తిమ్మా నగర్, వెంకటాపూర్, గుట్టకింద పల్లిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పద్మా దేవేందర్ రెడ్డికి స్థానికులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. హారతులిచ్చి, డప్పు చప్పుళ్లు, గిరిజన సాంప్రదాయ నృత్యాలు, ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, ఎంపీపీ జమున జయరాం రెడ్డి, హవెలిఘన్పూర్ మెదక్ మండలాల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, అంజా గౌడ్, కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు మాణిక్య రెడ్డి, కిష్టయ్య, సాయి పాల్గొన్నారు.