ఘణపురం ఆనకట్ట ఎత్తు పెంచారా? నిజాయితీ ఉంటే నిరూపించండి: రోహిత్ సవాల్

ఘణపురం ఆనకట్ట ఎత్తు పెంచారా? నిజాయితీ ఉంటే నిరూపించండి: రోహిత్ సవాల్

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: ‘బీఆరెస్ గత ఎన్నికల్లో ఘణపురం ఆనకట్ట ఎత్తు పెంచి, 35 వేల ఎకరాలకు సాగు నీరు ఇస్తామని ప్రగల్భాలు పలికారు. శంఖుస్థాపన చేసి వదిలేశారు. నిజాయితీ ఉంటే నిరూపించండి’ అంటూ మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ సవాల్ విసిరారు. గురువారం పాపన్నపేట మండలకేంద్రంలోని మంజీరా గార్డెన్స్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఘణపురం ఆనకట్ట ఎత్తు పెంచామని ప్రచారంలో చెప్పుకుంటున్న మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలు, 48 గంటల్లో ప్రాజెక్ట్ వద్దకు వచ్చి ఎత్తు ఎక్కడ పెంచారో చూపించాలని సవాల్ విసిరారు.

నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని మాయమాటలు చెప్పి, పదేండ్లు అయినా 1400 మంది కార్మికుల నోట్లో మన్ను పోశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. పదేండ్ల పద్మ పాలనలో సొంత ఆస్తులు పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న ధ్యాస లేకుండా పోయిందన్నారు. కార్యకర్తలపై బైండోవర్ ల పేరిట పోలీసులు వేధింపులు మానుకోవాలన్నారు. అనంతరం పాపన్నపేట మండలకేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సుమారుగా 400 మంది రోహిత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పబ్బతి ప్రభాకర్ రెడ్డి, ఏడుపాయల దేవస్థానం కమిటీ మాజీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి, మండల అధ్యక్షులు గోవింద్ నాయక్, ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి, యువ న్యాయవ్యాది జీవన్ రావ్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీకాంత్ అప్ప, పాపన్నపేట ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, కుర్తివాడ ఎంపీటీసీ రమేశ్ గౌడ్, భరత్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, పట్లోళ్ళ వరుణ్ రెడ్డి పాల్గొన్నారు.