రాజకీయాల్లో వయస్సు కాదు.. సేవాభావం కావాలి: మైనంపల్లి రోహిత్
పద్మాదేవెందర్ రెడ్డి పదేళ్ళు ఎమ్మెల్యేగా పని చేసి మెదక్ నియోజకవర్గానికి ఏం ఒరగ బెట్టారో చెప్పాలని మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు ప్రశ్నించారు

- పదేళ్ళలో ఏం ఒరగబెట్టారో చెప్పండి?
- పార్టీ కార్యాలయం ప్రారంభం
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: పద్మాదేవెందర్ రెడ్డి పదేళ్ళు ఎమ్మెల్యేగా పని చేసి మెదక్ నియోజకవర్గానికి ఏం ఒరగ బెట్టారో చెప్పాలని మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు ప్రశ్నించారు. గురువారం ఆయన మండలంలోని పొడిచనపల్లిలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని యువకులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు గజమాలతో, టపాసులు కాలుస్తూ స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో రోహిత్ మాట్లాడారు. పద్మా దేవెందర్రెడ్డి తన హయాంలో మెదక్ నియోజకవర్గం నుండి ఒక్కో కార్యాలయాన్ని తరలించారని ఆరోపించారు. మహిళా డిగ్రీ కళాశాల, ఫారెస్ట్ సర్కిల్ ఆఫీస్, అథ్లెటిక్ అకాడమీ తరలి పోయాయన్నారు. రాజకీయాల్లో వయస్సుతో పనిలేదని అన్నారు. గతంలో అస్సాం సీఎం ప్రపుల్ల కుమార్ మహాంత యూనివర్శిటీ నుంచి సీఎం అయిన విషయాన్ని గుర్తు చేశారు. నేను చేసిన సేవా కార్యక్రమాలు ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నాయన్నారు.
కులాలను వేరు చేసి బీసీ, దళిత బంధులు అంటూ ఒకరిద్దరికి స్కీంలు వర్తింప చేసి, మిగతా వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. డబ్బు సంచులు పంచేది మేముకాదు.. బీఆరెస్ వారే అన్నారు. కాంగ్రెస్ ను చీల్చడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్క తాటిపై ఉన్నారని, పార్టీ గెలుపు కోసం సైనికుల్లా పనిచేస్తున్నారని అన్నారు. జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు పబ్బతి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రకరకాల జిమ్మిక్కులతో ఎన్నికల్లో గెలువాలని చూస్తున్నదని అన్నారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా మెదక్ పిల్లి కొట్టాల్ వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు గురువారం ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో ఏడు పాయల మాజీ చైర్మన్లు జీవన్ రెడ్డి, వేంకటేశ్వర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు గోవింద్ పాల్గొన్నారు.