జాతీయ పార్టీనా? ప్రాంతీయ పార్టీనా?

జాతీయ పార్టీనా? ప్రాంతీయ పార్టీనా?
  • పేరుకేమో బీఆరెస్‌ జాతీయ పార్టీ..
  • ఈ ఎన్నికల్లో ప్రాంతీయ సెంటిమెంట్‌
  • ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్తని వ్యాఖ్యలు
  • ఢిల్లీకి గులాములు కావద్దని హెచ్చరికలు
  • భారత్‌ రాష్ట్ర సమితి హోదా ఏమిటి?
  • గందరగోళంలో ఆ పార్టీ కార్యకర్తలు

విధాత: భారత్‌ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న టీఆరెస్‌.. జాతీయ పార్టీనా? ప్రాంతీయ పార్టీనా? జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తామని చెబుతూ టీఆరెస్‌ను బీఆరెస్‌గా మార్చారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. తెలంగాణ సాధన కోసం పుట్టిన పార్టీగా తెలంగాణ ఆత్మను బీఆరెస్‌గా మార్చడంతో చంపుకొన్నారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. వాటిని బీఆరెస్‌ నాయకత్వం కొట్టిపారేసింది. కానీ.. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అధినేతగానే మాట్లాడుతుండటం ఆసక్తి రేపుతున్నది. ఎన్నికల ప్రచారసభల్లో మాట్లాడుతున్న కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ ఇతర నాయకులు కాంగ్రెస్‌, బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ.. అవి ఢిల్లీ పార్టీలని, ఆ పార్టీలకు ఇక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్నవారు ఢిల్లీకి గులాములని మండిపడుతున్నారు. మళ్లీ తెలంగాణ.. వారికి గులాములుగా ఉండాలా? సీల్డ్‌ కవర్‌ సీఎంలు కావాలా? టూరిస్టులు కావాలా? అని ప్రశ్నలు గుప్పిస్తుండటాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ‘బీఆరెస్‌ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని అంటున్నారు. మరి దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసమే బీఆరెస్‌గా మార్చుతున్నామని ఆ సమయంలో చెప్పారు.


కానీ.. ఇప్పటికీ తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్‌ మీదనే ఆధారపడుతున్నారు. ఢిల్లీ జాతీయ పార్టీలను నమ్మొద్దని వారే చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీ అయిన బీఆరెస్‌నే గెలిపించాలని కోరుతున్నారు. ఈ వైరుధ్యాన్ని బీఆరెస్‌ నాయకులు గుర్తించారో లేదో!’ అని ఢిల్లీ కేంద్రంగా పనిచేసే సీనియర్‌ తెలుగు జర్నలిస్టు ఒకరు వ్యాఖ్యానించారు. బీఆరెస్‌లో కేసీఆర్‌ తర్వాత కీలక నాయకుడిగా భావించే కేటీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ఉపన్యాసాలు సైతం అలానే ఉంటున్నాయని చెబుతున్నారు. నిజానికి వారు ఆ విషయం మర్చిపోవడం అనే కంటే.. ఉద్దేశపూర్వకంగానే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రాంతీయ సెంటిమెంట్‌ను ఉపయోగిస్తున్నారని పేర్కొంటున్నారు.

ఫ్లాష్‌బ్యాక్‌లో..

కొద్ది నెలలు వెనక్కు వెళితే.. టీఆరెస్‌ బీఆరెస్‌గా మారిన క్రమంలో పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించారు. పంజాబ్‌, ఢిల్లీ, బీహార్‌, మహారాష్ట్ర, బెంగాల్‌, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లారు. అక్కడి అధికారంలో ఉన్న నేతలను, ప్రతిపక్ష నేతలను కలిశారు. జాతీయ స్థాయిలో చేయాల్సిన పనులపై చర్చించారు. రైతు ఉద్యమంలో చనిపోయిన పంజాబ్ రైతులకు, గల్వాన్ పోరులోని అమరుల కుటుంబాలకు చెక్కులతో హల్ చల్ చేశారు. చివరకు ఆయన కలిసిన నేతలెవరూ ఆయన వెంట నిలువలేదు. ప్రతిపక్ష ఇండియా కూటమికి దగ్గరయ్యారు. దీంతో మహారాష్ట్రపై కేంద్రీకరించిన కేసీఆర్‌.. కొందరు నేతలను హైదరాబాద్‌కు పిలిపించి.. గులాబీ కండువాలు కప్పారు. తదుపరి మహారాష్ట్రలో అధికారం బీఆరెస్‌దే అనేంత దాకా పరిస్థితి వెళ్లింది.

మోసం చేసిన కాంగ్రెస్‌ను ఎందుకు నమ్మారు?

‘ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్‌ అని కేసీఆర్‌ చెబుతున్నారు. వాళ్ల తప్పు వల్ల 58 ఏళ్లు గోసపడ్డామంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం అడిగితే పిల్లల్ని కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఇస్తుందని ఇదే పార్టీని నమ్మామని కూడా అంటున్నారు. అయినా 15 ఏళ్లు తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడుతున్నారు. అయితే.. ఏ ఒక్క దశలోనూ తెలంగాణకు మోసం చేసింది కాంగ్రెస్‌ పార్టీయే అన్న విషయం కేసీఆర్‌కు గుర్తు రాలేదా? మోసం చేసిన పార్టీ న్యాయం చేస్తుందని భావించారా? తెలంగాణ ఇచ్చేదాకా కాంగ్రెస్‌ను నమ్మిన టీఆరెస్‌.. ఇచ్చిన తర్వాత గత మోసాలను ఇప్పుడెందుకు లేవనెత్తుతున్నది?’ అని కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడొకరు సందేహం వ్యక్తం చేశారు.


కాంగ్రెస్‌కు 11 చాన్స్‌లు ఇచ్చామని చెబుతున్నా.. అది ఉమ్మడి రాష్ట్రంలో సంగతేనని గుర్తు చేశారు. ఉమ్మడి పాలనలోనూ తెలంగాణకోసం గొంతెత్తింది తామేనని ఉద్యమకాలంలో క్రియాశీలంగా వ్యవహరించిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు అన్నారు. ‘ఇప్పుడు జరగాల్సిన చర్చ.. ఈ పదేళ్ల కాలంలో ఎవరికి ఏం చేశారు? నిరుద్యోగుల పరిస్థితేంటి? ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఎంత మందికి ఇళ్లు ఇచ్చారు? ఎంత మందికి ‘బంధు’లు అందాయి? అది వదిలేసి.. ఉమ్మడి రాష్ట్ర పాలనపై నిప్పులు చెరగడం ప్రస్తుత వైఫల్యాలను కప్పిపుచ్చడమేనని ఆయన తేల్చి చెప్పారు.