కాంగ్రెస్‌పై బీఆరెస్ మంత్రుల ముప్పేట దాడి

దళిత బంధు నిలిపివేయాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి మరోసారి ఆ పార్టీ రైతు విరోధిగా నిరూపించుకుందని మంత్రులు కేటీఆర్‌, టి.హరీశ్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి విమర్శలతో కాంగ్రెస్‌పైకి ఎదురుదాడికి దిగారు.

కాంగ్రెస్‌పై బీఆరెస్ మంత్రుల ముప్పేట దాడి
  • కేటీఆర్‌, హరీశ్‌, జగదీశ్‌రెడ్డిల ధ్వజం
  • క్షేత్ర స్థాయిలో నిరసనలు
  • కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్‌

విధాత : దళిత బంధు నిలిపివేయాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి మరోసారి ఆ పార్టీ రైతు విరోధిగా నిరూపించుకుందని మంత్రులు కేటీఆర్‌, టి.హరీశ్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి సహా ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు విమర్శలతో కాంగ్రెస్‌పైకి ఎదురుదాడికి దిగారు. మరోవైపు బీఆరెస్ శ్రేణులు రైతులతో కలిసి మండల కేంద్రాల్లో నిరసనలకు దిగుతు కాంగ్రెస్‌ను ప్రజాక్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ ఫిర్యాదుపై ట్వీట్టర్ ఎక్స్ వేదికగా స్పందించిన మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ వైఖరి చూస్తే ఇంటింటికి మంచినీళ్లు, ఇరవై నాలుగు గంటల కరెంటు కూడా ఆపెయ్యమంటరేమో ? నని ఎందుకంటే అందులో కూడా కేసీఆరే కనిపిస్తడు కదా? అని ఎద్దేవా చేశారు.


అన్నదాత పాలిట నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని ఇంకోసారి తేలిపోయిందన్నారు. రైతులకు పెట్టుబడి సాయాన్ని అడ్డుకునే కపట కాంగ్రెస్ పార్టీ కుట్రను తెలంగాణ రైతులు సహించరన్నారు. అన్నదాతల పొట్టకొట్టే.. కుటిల కాంగ్రెస్ కుతంత్రాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రైతులు భరించరన్నారు. రైతుబంధును ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ తోకలు కట్ చేయడం పక్కా అన్నారు. ఇప్పటికే నమ్మి ఓటేసిన పాపానికి కర్ణాటక రైతులను అరిగోస పెడుతున్నారన్నారు. తెలంగాణ రైతులకు కడుపునిండా కరెంట్ ఇస్తే ఓర్వలేక మూడు గంటల మోసానికి తెర తీశారన్నారు. రైతుబంధు పథకానికి కూడా పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.

రైతుల జోలికొస్తే డిపాజిట్లు గల్లంతే

మంత్రి టి.హరీశ్‌రావు ఫైర్‌

కాంగ్రెస్ పార్టీ రైతుబంధును ఆపాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి రైతుల పట్ల ఉన్న వ్యతిరేకతను మరోసారి చాటుకుందని, రైతుల జోలికొస్తే డిపాజిట్లు గల్లంతు చేస్తాం ఖబడ్ధార్ అని మంత్రి టి.హరీశ్‌రావు హెచ్చరించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుబందు పథకం అనేది కొత్త పథకం కాదని, 75వేల కోట్లను రైతులకు రైతుబంధు ద్వారా గతంలో అందించామన్నారు. గత ప్రభుత్వాలు రైతుల నుంచి పన్ను కట్టించుకుంటే కేసీఆర్ రైతులకు డబ్బులు పంచడం జరిగిందన్నారు.

69లక్షల రైతులు సీఎం కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ వైఖరి గమినిస్తే చివరకు పించన్లు, కేసీఆర్ కిట్‌లను కూడా ఆపమంటారేమోనన్నట్లుగా ఉందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, కర్ణాటక ప్రజలు కొడంగల్, గద్వాల్ లో కరెంట్ విషయంలో ఆందోళన చేశారని, కర్ణాటక లో మూడు గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని, కేసీఆర్ పాలనలో నాణ్యమైన కరెంట్ ఇస్తూ ఎరువులు కూడా అందిస్తున్నామన్నారు. రైతుల పై కాంగ్రెస్ పార్టీ కక్ష కట్టిందని, రైతుబంధు పొందిన 69లక్షల రైతులు కాంగ్రెస్ కు కర్రుగాల్చి వాతపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.


కరోనా కష్టకాలంలో కూడా రైతులకు రైతుబంధు కేసీఆర్ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు శత్రువుగా మారిందని, రేపు కాంగ్రెస్ పార్టీ వస్టే రైతు బంధుకు రాం రాం చెప్పి మూడుగంటల కరెంట్ మాత్రమే ఇస్తారన్నారు. 11సార్లు కాంగ్రెస్ కు అధికారం ఇస్తే ఒక్క పైసా ఇవ్వలేదని, మాకు రెండు సార్లు అవకాశం ఇస్తే 11సార్లు రైతు బంధు ఇచ్చామన్నారు. మహా అంటే ఒక నెల రోజులు కాంగ్రెస్ కుట్రలతో పథకాలు ఆగినా మళ్ళీ మేము రాగానే ఇస్తామని, ఇప్పటికే రైతు బంధు, రైతు రుణమాఫీ అమలు కొనసాగింపుకు వీలుగా ఎన్నికల సంఘానికి లేఖ రాశామని హరీశ్ రావు స్పష్టం చేశారు.

సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ కుట్ర చేస్తుంది : మంత్రి జి.జగదీశ్ రెడ్డి

సంక్షేమ పథకాలను నిలిపివేయాలని కాంగ్రెస్ నేతలు ఈసీకి పిర్యాదు చేయడం దుర్మార్గమైన చర్యయని మంత్రి జి.జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజాసంక్షేమ పాలన అందించడంలో విఫలమైన ఆ పార్టీ తెలంగాణ సంక్షేమ పథకాలపై అక్కసు వెల్లగక్కుతుందన్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాలకు ఎన్నికల కోడ్‌తో అడ్డంపడి సంక్షోభం తెచ్చే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని, రెండు పార్టీల అధ్యక్షులు ఒకటే స్క్రిప్ట్ చదువుతున్నారని, అభ్యర్థుల ఎంపికలోనూ కలిసే నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీల కుట్రలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలన్నారు.

కోడ్ పేరుతో పొట్ట కొడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్సీ కవిత

నాలుగు ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ పేరుతో ప్రజల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కోడ్ ముసుగులో ప్రజా సంక్షేమ పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. రైతుబంధును అడ్డుకుని కాంగ్రెస్ రైతులపై తన కడుపుమంటను చాటుకుందన్నారు.

చిత్తశుద్ధి ఉంటే నవంబర్ 2లోపు ఇవ్వు

కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్‌

విధాత : రైతుబంధు, సంక్షేమ పథకాలపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదును తప్పుబడుతూ మంత్రి కేటీఆర్ ట్వీట్‌కు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ట్వీట్టర్ వేదికగానే కౌంటర్ వేశారు. ఆడలేక మద్దెల ఓడు అంటున్నావా డ్రామారావు అని, నీకు రైతులపై ప్రేముంటే, రైతు సంక్షేమంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే నవంబర్ 2 వ తేదీ లోపునే రైతుబంధు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.


నీకు వృద్ధులపై శ్రద్ధ ఉంటే నవంబర్ 2 లోపు ఫించన్ ఇవ్వు అని, నీకు ఉద్యోగులపై బాధ్యత ఉంటే నవంబర్ 2 లోపు అందరు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిన్న మేం ఎలక్షన్ కమిషన్ కు చెప్పింది ఇదేనని, నీలాంటి వాడిని చూసే “నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్ధం ఊరంతా తిరిగొస్తుంది” అనే సామెత పుట్టిందంటూ కేటీఆర్ తీరును దుయ్యబట్టారు. డ్రామాలు ఆపి నవంబర్ 2 లోపు లబ్ధిదారులకు నిధులు ఇవ్వమని, లేదంటే కాంగ్రెస్ వచ్చాకా పెంచిన మొత్తంతో కలిపి ఇస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.