సీఎం కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలి..హైకోర్టులో బల్మూరి వెంకట్ పిటిషన్

* హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్
* ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరిపే అవకాశం
విధాత, హైదరాబాద్: ప్రజా ఆశీర్వాద సభ పేరుతో బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ అవమానకర, రెచ్చగొట్టే, పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఆయనపై చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పిటిషన్ దాఖలు చేశారు. నిర్వచన్ సదన్‌లోని ఈసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ సీఈవో, సీఎం కేసీఆర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ‘ఈ చేత కానీ దద్దమ్మలు, వెదవలు పని చేసే చేతగాక ఎన్నికలు ఫేస్ చేసే దమ్ము లేక.. దీనికి తెలంగాణ సమాజమే బుద్ధి చెప్పాలని కోరుతున్నా.. కత్తి పట్టుకుని పొడవాలంటే ఎంత మందిమి ఉన్నాం. మాకు చేతులు లేవా. మొండిదో లండుదో మాకు ఒక కత్తి దొరకదా. ఒకవేళ మాకు తిక్కనే రేగితే దుమ్ము దుమ్ము రేగాలి.
ఈ రాష్ట్రం అంత తస్మాత్ జాగ్రత్త’ అని కేసీఆర్ గత నెల 30న బాన్సువాడ ప్రసంగంలో పేర్కొన్నారని పిటిషన్‌లో వెల్లడించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఈనెల 3న తాము రాత పూర్వక వినతిపత్రం సమర్పించినా ఈసీ నుంచి ఎలాంటి స్పందన లేదని, అందుచే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈసీ విడుదల చేసిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్కుీ , ఇతర సూచనలకు కేసీఆర్ వ్యాఖ్యలు విరుద్ధంగా ఉన్నాయని, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 నుంచి ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయని.. చట్టప్రకారం కేసీఆర్‌పై చర్యలు తీసుకునేలా ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.