మైనంపల్లికి ఓటేస్తే చిక్కడు.. దొరకడు: పద్మాదేవేందర్ రెడ్డి

– ఆడబిడ్డగా ఆదరిస్తే అభివృద్ధి చేస్తా
విధాత, మెదక్ బ్యూరో: కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ కు ఓటేస్తే చిక్కడు దొరకడని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి విమర్శించారు. ఆడబిడ్డగా ఆదరించి తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటానని హామీ ఇచ్చారు. ఆదివారం ఆమె రామాయంపేట మండలం లక్ష్మాపూర్, కాట్రాల్, తాండ, దంతపల్లి, బాపనయ్య తాండ తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు బోనాలు, డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రచార సభల్లో పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడారు. గతంలో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. పోగా.. ప్రజలకు ఏమేరకు అందుబాటులో ఉన్నాడో ప్రజలు ఆలోచించాలని ఆమె కోరారు. 13 ఏళ్లపాటు నియోజకవర్గ ప్రజల కష్టసుఖాలు తెలుకోకుండా పత్తా లేకుండా పోయిన మైనంపల్లి తన కొడుకును ఎమ్మెల్యేగా చేసేందుకు ఎత్తుకొని వచ్చాడని ధ్వజమెత్తారు. నియోజకవర్గంపై ఎలాంటి అవగాహన లేని వారు ఎమ్మెల్యేగా గెలిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని, ప్రజలు అలోచించి ఓటు వేస్తే అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాంగ్రెస్ చెప్పే మాయమాటలు విని మోసపోవద్దని, 11 సార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏమి అభివృద్ధి చేసిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ళ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం వివిధ పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రైతులకు పంటల సాగుకు 24 గంటల కరెంట్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. రైతు బీమా, రైతు బంధు పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కల్యాణలక్షి పథకం కింద ఆడబిడ్డల పెళ్లి కోసం రూ.1,00,116 అందజేస్తున్నామని, అధికారంలోకి వస్తే మరింత పెంచుకొనున్నామని తెలిపారు. సౌభాగ్య లక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు రూ.3,000 పింఛన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రామాయంపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. 2001లో ఉమ్మడి రామాయంపేట మండలంలో జడ్పీటీసీ సభ్యురాలిగా తనకు రాజకీయ జీవితాన్ని అందించిందని, మీరు పెట్టిన మొక్కను అని గుర్తుంచుకొని తనకు ఓటు వేస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.